చంద్రబాబు మైండ్ గేమ్.. దిగొచ్చిన బీజేపీ, రంగంలోకి ఈడీ
ఏపీ లిక్కర్ స్కాంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇప్పటికే ఈ స్కాంపై కేసు నమోదు చేసి ఏపీ పోలీసులు విచారణ చేపడుతుండగా, తాజాగా ఈడీ రంగంలోకి దిగింది.;
ఏపీ లిక్కర్ స్కాంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇప్పటికే ఈ స్కాంపై కేసు నమోదు చేసి ఏపీ పోలీసులు విచారణ చేపడుతుండగా, తాజాగా ఈడీ రంగంలోకి దిగింది. సుమారు రూ.3,500 కోట్ల విలువైన ప్రజాధనాన్ని దోచేశారని ఆరోపణలు రావడం, కేసు దర్యాప్తు చేస్తున్న సిట్ పోలీసులు కీలక ఆధారలు సేకరించడంతో ఈడీ కూడా గతంలో కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. అయితే సిట్ ఒకవైపు అరెస్టులు చేస్తున్నా, ఇంతవరకు ఈడీ ఎలాంటి ముందడుగు వేయలేదు. దీంతో ఈ కేసుపై కేంద్ర ప్రభుత్వానికి ఆసక్తి లేదా? అన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈ పరిస్థితుల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యూహాత్మకంగా పావులు కదపడంతో ఈడీ దర్యాప్తులో కదలిక వచ్చిందని చెబుతున్నారు. దీంతో లిక్కర్ స్కాం నిందితులకు మరిన్ని కష్టాలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయని విశ్లేషిస్తున్నారు.
ఏపీ మద్యం స్కాంపై కేసు నమోదు చేసిన ఈడీ ఎట్టకేలకు రంగంలోకి దిగింది. లిక్కర్ స్కాం ద్వారా సేకరించిన కమీషన్ ను షెల్ కంపెనీల ద్వారా విదేశాలకు మల్లించి మనీలాండరింగ్ చేశారన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్న ఈడీ తమ సందేహాలను నివృత్తి చేయాలని ఆదేశిస్తూ శర్వాణీ ఆల్కోబ్రూ ప్రైవేటు లిమిటెడ్ కంపెనీ డైరెక్టర్ ఎనకొండ చంద్రారెడ్డికి సమన్లు జారీ చేసింది. ఈ నెల 28న ఉదయం 10.30 గంటలకు హైదరాబాద్లో తమ కార్యాలయంలో విచారణకు హాజరుకావాల్సిందిగా ఆ సమన్లలో ఆదేశించింది. తాము గుర్తుంచిన, దర్యాప్తు జరుపుతున్న మనీలాండరింగ్ వ్యవహారానికి సంబంధించి వివరాలు సమర్పించాలని ఈడీ హైదరాబాద్ బ్రాంచ్ అసిస్టెంట్ డైరెక్టర్ ప్రతీక్ సింగ్ సమన్లు జారీ చేశారు.
సుమారు రూ.3,500 కోట్ల విలువైన స్కాం జరిగిందని ఏపీ పోలీసులు అభియోగాలు నమోదు చేయగా, 12 మందిని అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో సిట్ సేకరించిన వివరాలను ఈడీ తీసుకుంది. దీనిపై ఈడీ సొంతంగా దర్యాప్తు చేస్తోంది. ముఖ్యంగా స్కాంలో మనీలాండరింగుపై ఈడీ ఎక్కువగా ఫోకస్ చేసిందని చెబుతున్నారు. ఈడీ దర్యాప్తులో కీలక ఆధారాలు లభించడంతో శర్వాణీ ఆల్కో బ్రూ కంపెనీ డైరెక్టర్ చంద్రారెడ్డికి నోటీసులు జారీ చేసినట్లు చెబుతున్నారు. అయితే ఈడీ దర్యాప్తు వెనుక ముఖ్యమంత్రి చంద్రబాబు మాస్టర్ మైండ్ ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఇంతవరకు కేంద్ర పెద్దల అండతో స్కాం నుంచి బిగ్ బాస్ తప్పించుకుంటున్నారని, చంద్రబాబు ఏం చేయలేరన్న విమర్శలను తిప్పికొట్టేందుకు సీఎం వ్యూహాత్మకంగా తీసుకున్న చర్యల ఫలితమే ఈడీ నోటీసులు అంటూ చర్చ జరుగుతోంది. పార్లమెంటు సమావేశాల ప్రారంభానికి ముందు ఏపీ లిక్కర్ స్కాంను సభలో చర్చించాలని టీడీపీ ప్రతిపాదించింది. అఖిల పక్ష సమావేశంలో టీడీపీ సూచనతో బీజేపీ ఉలిక్కిపడినట్లు చెబుతున్నారు. తమ ప్రధాన మిత్రపక్షం రాజకీయ ప్రయోజనాలకు భంగం కలిగేలా వ్యవహరిస్తున్నామనే చెడ్డపేరు రాకుండా ముందు జాగ్రత్తగా సభలో చర్చకు ముందే ఈడీని రంగంలోకి దింపారంటున్నారు. ఈ పరిణామాలు ఎటుదారితీస్తాయోనన్న టెన్షన్ వైసీపీలో కనిపిస్తుండగా, సరైన సమయంలో ప్రత్యర్థులకు చెక్ చెప్పామని టీడీపీ నేతలు చెబుతున్నారు. మొత్తానికి ఈడీ దర్యాప్తు ఏపీలో రాజకీయ ప్రకంపనలు రేపనుందని అంటున్నారు.