ఇంటర్ రీవాల్యుయేషన్ లో వెలుగు చూసిన సత్యం.. ‘0’ మిస్.. రిజల్ట్ పూర్తిగా రివర్స్
పట్టుమని పది రోజులు చదివితేనే పాస్ మార్కులు దాటేసే రోజులివి. అలాంటిది అహోరాత్రులు శ్రమించి, కార్పొరేట్ కాలేజీల ఒత్తిడిని తట్టుకుని చదివిన విద్యార్థులకు ఫలితాల రోజున 'ఫెయిల్' అని వస్తే ఆ గుండె ఎంతలా లబోదిబోమంటుంది?
పట్టుమని పది రోజులు చదివితేనే పాస్ మార్కులు దాటేసే రోజులివి. అలాంటిది అహోరాత్రులు శ్రమించి, కార్పొరేట్ కాలేజీల ఒత్తిడిని తట్టుకుని చదివిన విద్యార్థులకు ఫలితాల రోజున 'ఫెయిల్' అని వస్తే ఆ గుండె ఎంతలా లబోదిబోమంటుంది? తాజాగా గుంటూరు జిల్లాలో వెలుగుచూసిన ఒక ఘటన ఇంటర్మీడియట్ బోర్డుల కంప్యూటరైజేషన్, డేటా ఎంట్రీల వెనుక ఉన్న డొల్లతనాన్ని, దారుణమైన నిర్లక్ష్యాన్ని మరోసారి బట్టబయలు చేసింది. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం నూతక్కి గ్రామానికి చెందిన కావ్య అనే విద్యార్థిని ఇంటర్ సెకండియర్ ఫలితాలు చూసుకుని ఒక్కసారిగా షాక్‌కు గురైంది. మిగతా అన్ని సబ్జెక్టుల్లోనూ అత్యుత్తమ మార్కులు సాధించిన ఆమెకు, బోటనీలో కేవలం 6 మార్కులు మాత్రమే వచ్చాయి. దాంతో ఆమె ఫెయిల్ అయినట్లు రిజల్ట్స్‌లో చూపించింది. తాను రాసిన పరీక్షపై నమ్మకంతో, ఆందోళన చెందిన విద్యార్థిని రీవాల్యుయేషన్ కోసం దరఖాస్తు చేసుకుంది.
రీవాల్యుయేషన్ లో షాక్
రీవాల్యుయేషన్ ఫలితాలు వచ్చాక అందరి నోళ్లు వెళ్లబెట్టే పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే ఆరు మార్కులు వచ్చిన సబ్జెక్టులో కావ్యకు ఏకంగా 60కి 60 మార్కులు వచ్చాయి. అంటే పేపర్ దిద్దిన ఎగ్జామినర్ సరిగ్గానే మార్కులు వేసినప్పటికీ, వాటిని ఆన్‌లైన్ లో ఎంటర్ చేసిన సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా 60కి బదులు 6 అని టైప్ చేశారు. ఒక డిజిట్ మిస్ అవ్వడం వల్ల ఆ విద్యార్థిని, కుటుంబం నరకయాతన అనుభవించినట్లు వాపోతున్నారు.
గతంలోనూ ఇలాంటి ఘటనలు
ఇలాంటి ఘోరాలు జరగడం ఇదే మొదటిసారి కాదు. గతంలో తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి డేటా ఎంట్రీ లోపాలు, మూల్యాంకన లోపాల వల్ల విద్యార్థులు ప్రాణాలు కోల్పోయిన ఉదంతాలు కూడా ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల చరిత్రలోనే అత్యంత పెద్ద ఇంటర్ ఫలితాల వివాదం 2019లో తెలంగాణలో జరిగింది. గ్లోబరీనా అనే ప్రైవేట్ సంస్థ సాఫ్ట్‌వేర్ లోపాల వల్ల వేలాది మంది ప్రతిభావంతులైన విద్యార్థులు ఫెయిల్ అయ్యారు. అందులో ఒక విద్యార్థినికి తెలుగులో '0' మార్కులు వచ్చాయి. పొరపాటు గ్రహించి రీవెరిఫికేషన్ చేయగా ఆమెకు 99 మార్కులు వచ్చాయి. ఇలాంటి సాంకేతిక, మానవ తప్పిదాల వల్ల ఆ సమయంలో దాదాపు 25 మందికి పైగా విద్యార్థులు మనస్తాపంతో ఆత్మహత్యలు చేసుకోవడం తీవ్ర విషాదాన్ని నింపింది.
ఏపీ, తెలంగాణల్లో గత కొన్నేళ్లుగా ఓఎంఆర్ షీట్ల స్కానింగ్, బార్ కోడింగ్ లోపాల వల్ల విద్యార్థులు హాజరైనా ఆబ్సెంట్ అని రావడం, ప్రాక్టికల్స్ మార్కులు కలపకపోవడం వంటి వందలాది కేసులు రీ-వెరిఫికేషన్‌లో వెలుగుచూస్తూనే ఉన్నాయి. గత ఏడాది కూడా ఏపీలో రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ దరఖాస్తు చేసుకున్న వందలాది మంది విద్యార్థులకు 10 నుంచి 30 మార్కుల వరకు పెరిగాయి. కేవలం టోటలింగ్ లోపం, మార్కుల పోస్టింగ్ లో స్కృటినైజర్లు సరిగ్గా వ్యవహరించకపోవడమే దీనికి కారణమంటున్నారు.
చర్యలు ఏవీ?
బోటనీలో 60 మార్కులు రావాల్సిన విద్యార్థినికి 6 మార్కులు వేసి ఫెయిల్ చేయడం అనేది కేవలం చిన్న సాంకేతిక పొరపాటని అధికారులు కొట్టిపారేయవచ్చు. కానీ, ఫలితాలు వచ్చిన రోజు నుంచి రీవాల్యుయేషన్ మార్కులు చేతికి వచ్చేంతవరకు ఆ విద్యార్థిని పడే మానసిక క్షోభ, సమాజం నుంచి ఎదుర్కొనే అవమానాలకు బాధ్యులెవరు? అన్నదే ప్రశ్నగా చెబుతున్నారు. ఒకవేళ ఆ విద్యార్థిని గనుక తీవ్ర నిర్ణయం తీసుకుని ఉంటే అప్పుడు పరిస్థితికి ఎవరు బాధ్యత వహిస్తారని నిపుణులు నిలదీస్తున్నారు. పేపర్ కరెక్షన్ చేసిన తర్వాత ఆన్‌లైన్ లోకి మార్కులు ఎక్కించే సమయంలో క్రాస్ చెక్ చేసుకునే డబుల్ ఎంట్రీ లేదా ట్రిపుల్ వెరిఫికేషన్ సిస్టమ్‌ను బోర్డు అధికారులు ఎందుకు పకడ్బందీగా అమలు చేయడం లేదని ప్రశ్నిస్తున్నారు. ఇంటర్మీడియట్ విద్యామండలి ఇటువంటి తీవ్రమైన డేటా ఎంట్రీ లోపాలపై కఠినంగా వ్యవహరించాలని కోరుతున్నారు.