రాష్ట్ర వ్యాప్తంగా ర‌ఘురామ ఎఫెక్ట్‌.. ?

ఈ క్రమంలో ఏర్పడిన ఎస్సీ సామాజిక వర్గానికి -ఆయనకు మధ్య వివాదం చినికి చినికి గాలివానగా మారింది.

Update: 2026-05-15 10:30 GMT

రాష్ట్ర అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్, ఉండి నియోజకవర్గం ఎమ్మెల్యే కనుమూరి రఘురామకృష్ణరాజు ఒక కోణంలో ఆలోచిస్తుంటే.. పార్టీ పరంగా నాయకులు క్షేత్రస్థాయిలో ఉన్న కార్యకర్తలు అనేక కోణాల్లో ఆలోచన చేస్తున్నారు. ప్రస్తుతం ఆకివీడు మండలంలోని పెదపాడు గ్రామంలో రామాలయాన్ని పునరుద్ధరించే పనులను రఘురామ కృష్ణరాజు భుజాన వేసుకుని ముందుకు నడిపిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ సంవత్సరం ఆఖరికి రామాలయాన్ని పునరుద్ధరించి ప్రారంభిస్తామని ఆయన స్పష్టం చేస్తున్నారు.

ఈ క్రమంలో ఏర్పడిన ఎస్సీ సామాజిక వర్గానికి -ఆయనకు మధ్య వివాదం చినికి చినికి గాలివానగా మారింది. ఇది రాజకీయంగా పార్టీకి ఇబ్బందికర అంశంగా మారుతుందని తాజాగా టిడిపిలోని కొంతమంది ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన నాయకులు బహిరంగంగానే వ్యాఖ్యలు చేశారు. ఇప్పటివరకు పార్టీ పరంగా విభజన అనేది లేదని, ముఖ్యంగా మతాలు, సామాజిక వర్గాల పరంగా ఏ రోజు పార్టీ విడిపోలేదని కానీ రఘురామకృష్ణ రాజు చేస్తున్న ఈ వ్యవహారంతో పార్టీకి ఇబ్బందికర వాతావరణం వచ్చే అవకాశం ఉందని మహాసేన రాజేష్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.

దీనిపై రఘురామ‌ కూడా వివరణ ఇచ్చారు. తాను చేస్తున్న పని వల్ల పార్టీకి మేలు జరుగుతుందని చెప్తున్నారు. అయితే రాష్ట్రవ్యాప్తంగా చూసుకుంటే ఎస్సీ సామాజిక వర్గాన్ని ఏకతాటిపై నడిపించేందుకు కొన్ని చిన్న చితకా పార్టీలు ప్రయత్నాలు చేస్తున్నాయి. మరీ ముఖ్యంగా దళిత సామాజిక వర్గానికి చెందిన మాజీ ఉన్నతాధికారులు ఈ విషయంలో దూకుడుగా వ్యవహరిస్తున్నారు. ఇది పార్టీకి ఇబ్బందికర పరిణామాలు తీసుకువస్తుంది అన్నది ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన నాయకులు చెబుతున్న మాట.

కానీ రఘురామ మాత్రం హిందూ సామాజిక వర్గాన్ని పోలరైజ్ చేయడం వల్ల మెజారిటీ ఓటు బ్యాంకు టిడిపికి దక్కుతుందని ఆయన అంచనా వేస్తున్నారు. ఈ విషయాన్ని బహిరంగంగా చెప్పకపోయినప్పటికీ తను రాజ్యాంగం ప్రకారం నిబంధనల ప్రకారమే నడుస్తున్నానని దీనివల్ల పార్టీకి వచ్చిన ఇబ్బందిగాని పార్టీ నష్టపోవటం అనేది ఉండదని ఆయన స్పష్టం చేస్తున్నారు. ఈ విషయంపై టిడిపి అధిష్టానం పెద్దగా దృష్టి పెట్టలేదు.

క్షేత్రస్థాయిలో మాత్రమే ఈ పరిస్థితి పరిమితం అవుతుందని దీనివల్ల రాష్ట్రవ్యాప్తంగా వచ్చే ఎఫెక్ట్ ఏమీ ఉండదని అంచనా వేస్తున్న నేపథ్యంలో రఘురామకృష్ణరాజు తన పని తాను చేసుకోపోతున్నారు. కానీ అంతర్గతంగా మాత్రం రఘురామ విషయంలో ఆయన వ్యవహరిస్తున్న తీరును కొంతమంది నాయకులు తప్పుపడుతున్నారు. ఈ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా ప్రభావం చూపిస్తుందా.. లేకపోతే కేవలం ఉండి నియోజకవర్గానికి మాత్రమే పరిమితం అవుతుందా అనేది చూడాలి.

Tags:    

Similar News