పెరుగుతున్న సీట్లు.. కూటమికి ప్లస్.....వైసీపీకి ?
దేశమంతా లోక్ సభ అసెంబ్లీలకు సీట్లు పెరగనున్నాయి. ఇవి అప్పటికి ఉన్న సంఖ్యలో సగం అన్న మాట.;
దేశమంతా లోక్ సభ అసెంబ్లీలకు సీట్లు పెరగనున్నాయి. ఇవి అప్పటికి ఉన్న సంఖ్యలో సగం అన్న మాట. ఈ లెక్క తీసుకుంటే ఏపీలో దాదాపుగా 269 దాకా అసెంబ్లీ సీట్లు 38 దాకా ఎంపీ సీట్లు పెరగనున్నాయి. అయితే ఈ పెరుగుతున్న సీట్లతో ఎవరికి రాజకీయ లాభం అన్న చర్చకు తెర లేస్తోంది. అధికమవుతున్న సీట్లతో చాలా మందికి ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా పోటీ చేసే చాన్స్ వస్తుంది. ఆ విధంగా అనేక మంది ఆశలు తీరుతాయి. ఈ విధంగా చూస్తే ఏపీలో ఒక విధంగా రాజకీయ కోలాటం మొదలవుతుందని చెప్పక తప్పదు.
కూటమికి చాన్స్ :
అధికంగా సీట్లు పెరగడం కూటమికి ప్లస్ పాయింట్లు అని అంటున్నారు. ఎలాగంటే కూటమిలో మూడు పార్టీలు ఉన్నాయి. టీడీపీ జనసేన బీజేపీ మొత్తం 175 సీట్లను ఎంతో జాగ్రత్తగా 2024 ఎన్నికల్లో సర్దుకుని పోటీ చేశాయి. ఆ విధంగా చూస్తే ఆశావహులు మూడు పార్టీలలో ఎంతో మంది మిగిలిపోయారు. టీడీపీలో అయితే త్యాగరాజులకు కొదవ లేదు, జనసేనలో అనేక మంది తమ పార్టీ గెలిస్తే చాలు అని తగ్గారు, బీజేపీలో అదే పరిస్థితి. ఇపుడు. ఏకంగా కొత్తగా మరో 87 దాకా సీట్లు అసెంబ్లీకి పెరగబోతున్నాయి అంటే కచ్చితంగా అది కూటమికి ప్లస్ పాయింట్ అని అంటున్నారు.
మరింత బలంగా :
కొత్తగా సీట్ల పెరుగుదలతో కూటమిలోని పార్టీలు మరింత బలంగా ఐక్యంగా ముందుకు వస్తాయి. ఒకరికి ఒకరితో పోటీ లేకుండా అంతా సహకరించుకునే చాన్స్ ఉంటుంది. అలాగే జనసేన కోరుకున్న యాభై సీట్లు దక్కవచ్చు, బీజేపీకి 20 దాకా సీట్లు లభించవచ్చు. ఇక 200 దాకా సీట్లలో టీడీపీ పోటీ చేసేందుకు వెసులుబాటు ఉంటుంది. 175 సీట్లలోనే 164 సీట్లు సాధించిన కూటమి 269లో మ్యాజిక్ ఫిగర్ 135 సీట్లను ఈజీగా సాధించేందుకు ఎంతో వీలు అవుతుంది అని అంటున్నారు. రెట్టించిన ఉత్సాహంతో కూటమి దూసుకుని వచ్చేందుకు ఈ పరిణామాలు దోహదపడతాయని విశ్లేషిస్తున్నారు.
పునర్ విభజన సైతం :
ఇక కూటమి అధికారంలో ఉండడంతో పునర్ విభజన సైతం తమకు అనుకూలంగా ఉండేలా చేసుకునే వీలు ఉంటుంది. అదే సమయంలో ప్రత్యర్ధి బలాలు ఉన్న చోట వ్యూహాత్మకంగా సీట్లను తగ్గించేందుకు చాన్స్ ఉంటుంది. ఇవన్నీ రాజకీయ వ్యూహాలుగానే చూడాలి. దాంతో వైసీపీకి ఈ పరిణామాలు కొంత ఇబ్బందికరంగా ఉండొచ్చు అని అంటున్నారు. అలాగే మహిలా సీట్లు, రిజర్వుడు సీట్ల విషయంలో అధికార పార్టీ చెప్పినట్లుగానే జరుగుతుంది కాబట్టి విపక్ష వైసీపీకి ఇది ఒక సవాల్ గా మారుతుందని అంటున్నారు.
అసలైన సమస్యగా :
ఇవన్నీ పక్కన పెడితే వైసీపీకి అసలైన సమస్యలు పెరిగిన సీట్లతోనే అని అంటున్నారు. ఒంటరిగా పోటీ చేసే వైసీపీకి మొత్తం 269 ఎమ్మెల్యే 38 ఎంపీ అభ్యర్ధులను నిలబెట్టడం ఒక సవాల్ అవుతుందని అంటున్నారు. ఎవరో ఒకరికి టికెట్ ఇవ్వడం కాదు గెలుపు గుర్రాల కోసం వేట అన్నదే పెద్ద ఇష్యూ అవుతుందని చెబుతున్నారు. ఇప్పటికి అయితే చాలా మంది పార్టీని వీడిపోయారు. దాంతో ఉన్న సీట్లలోనే సమర్ధ నేతల కరవు ఉందని అంటున్నారు. దానికి తోడు మహిళా రిజర్వేషన్ల పేరుతో 86 మంది దాకా ఎంపిక చేసి ఇవ్వడం అంటే అది కూడా చాలా ఆలోచించాల్సిన విషయంగా ఉంటుంది అంటున్నారు. ఏది ఏమైనా ఇప్పటి నుంచే వైసీపీ అలెర్ట్ అయితేనే తప్ప ఈ పెరిగిన సీట్లలో కూటమితో బలంగా ఢీ కొట్టడానికి అవకాశం ఉండదని అంటున్నారు.