నామినేటెడ్ పోస్టుల భర్తీకి ప్రాతిపదిక ఏంటి? 31 నియామకాలపై చర్చ
ఏపీ ప్రభుత్వం తాజాగా 31 నామినేటెడ్ పోస్టులను భర్తీ చేసింది. మిత్రపక్షాలైన జనసేన, బీజేపీ నాయకులకు కూడా పదవులిచ్చినా ఎక్కువగా టీడీపీ నేతలకే పోస్టులిచ్చింది.;
ఏపీ ప్రభుత్వం తాజాగా 31 నామినేటెడ్ పోస్టులను భర్తీ చేసింది. మిత్రపక్షాలైన జనసేన, బీజేపీ నాయకులకు కూడా పదవులిచ్చినా ఎక్కువగా టీడీపీ నేతలకే పోస్టులిచ్చింది. ప్రధాన కార్పొరేషన్లను కేటాయించడంతో పోస్టుల భర్తీపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఎన్నికలకు ముందు టీడీపీ యువనేత నారా లోకేశ్ చెప్పినట్లు అప్పట్లో పార్టీ కోసం పోరాడిన వారే తాజాగా కార్పొరేషన్ చైర్మన్ పదవులు దక్కించుకున్నారని టీడీపీ శ్రేణులు చెబుతున్నాయి. ముఖ్యంగా అప్పటి ప్రభుత్వంలో కేసులు ఎదుర్కొని జైలుకు వెళ్లినవారికి పెద్దపీట వేశారని చెబుతున్నారు.
అమరావతి రాజధాని ఉద్యమంతోపాటు చంద్రబాబు అరెస్టు సమయంలో ప్రభుత్వంతో తాడోపేడో తేల్చుకునేలా పోరాడిన వారికి అగ్ర తాంబూలమిచ్చారని చెబుతున్నారు. అంతేకాకుండా మిత్రపక్షాలకు కేటాయించినట్లే గత ప్రభుత్వంలో అమరావతి కోసం పోరాడిన తటస్థులకు ఇప్పుడు పదవులను కట్టబెట్టడం విశేషంగా చెబుతున్నారు. ముఖ్యంగా సాంఘిక సంక్షేమ బోర్డు చైర్మన్ గా నియమితులైన బాల కోటయ్య గతంలో అమరావతి కోసం బహుజన జేఏసీని స్థాపించారు. అనేక టీవీ చర్చల్లో వక్తగా పాల్గొని టీడీపీని సమర్థించారు. దీంతో ఆయనకు నామినేటెడ్ పోస్టు వరించిందని అంటున్నారు.
అదేవిధంగా టీడీపీ యువనేత బ్రహ్మం చౌదరికి కమ్మ కార్పొరేషన్ చైర్మన్ పదవి దక్కింది. బ్రహ్మం చౌదరికి పదవి ఇవ్వడంపైనా పార్టీ వర్గాల్లో సంతోషం వ్యక్తమవుతోందని అంటున్నారు. గురజాల నియోజకవర్గానికి చెందిన బ్రహ్మం చౌదరి సోషల్ మీడియాలో పార్టీ తరఫున తీవ్రంగా పోరాడారు. అంతేకాకుండా నారా లోకేశ్ పాదయాత్ర సమయంలోనూ గట్టిగా పనిచేసినట్లు సమాచారం. ఇక కొత్తగా ఏర్పడిన ముదిలియార్ కార్పొరేషన్ కు ముఖ్యమంత్రి చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పానికి చెందిన సీఎస్ త్యాగరాజన్ ను నియమించారు. కుప్పంలో తమిళ వలస ఓటర్లు పార్టీ వైపు మొగ్గు చూపడంతోటు ముఖ్యమంత్రి చంద్రబాబు గెలుపులో వారి ఓట్లు కీలకంగా మారాయని చెబుతున్నారు. తమిళ ఓటర్లను ఆకర్షించడంలో భాగంగా త్యాగరాజన్ కు పదవి దక్కిందని చెబుతున్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబుకు విధేయుడుగా చెప్పే నాగుల్ మీరాకు నూర్ బాషా, దూదేకుల కార్పొరేషన్ చైర్మన్ పదవి దక్కింది. ఈయన విజయవాడ పశ్చిమ నియోజకవర్గానికి చెందిన నాయకుడు. అదేవిధంగా ఇదే నియోజకవర్గానికి చెందిన బీజేపీ నేత మారుపిల్లి తిరుమల్లేశ్వరరావుకు సైతం కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇచ్చారు. నగరాల సంక్షేమం, అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ గా తిరుమల్లేశ్వరరావును నియమించారు. జనసేన కోటాలో షేక్ రియాజ్ కు ఒంగోలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ పదవి, గుంటశాల వెంకటలక్ష్మికి మహిళా అభివృద్ధి సంస్థ చైర్మనుగా నియమించారు. ఇక వంపూరు గంగులయ్యకు జానపద కళలు, సృజనాత్మకత అకాడమీ చైర్మన్ పదవులిచ్చారు.