ఏఐ పై జగన్ కామెంట్స్, టీడీపీ ట్రోలింగ్స్.. మేటరేమిటంటే..!

ఇదే సమయంలో... డేటా సెంటర్‌ తో ఉద్యోగాలు తక్కువే అయినా.. ఎకో సిస్టమ్‌ తయారవుతుందని.. తద్వారా గ్లోబల్‌ క్యాపబుల్‌ సెంటర్స్‌ వస్తాయని.. అందువల్ల వీటికి తమ ప్రభుత్వంలోనే నాంది పలికామని చెప్పారు.;

Update: 2025-10-24 09:50 GMT

ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో విశాఖకు గూగుల్ డేటా రావటం అనే అంశంపై అటు అధికార, ఇటు ప్రతిపక్ష పార్టీలపై క్రెడిట్ గేమ్ నడుస్తోన్న సంగతి తెలిసిందే. విశాఖలో డేటా సెంటర్ కు వైసీపీ హయాంలో 2023 లోనే శంకుస్థాపన చేశామని.. అది వైసీపీ నాటిన విత్తనమే అని.. దాని కొనసాగింపే నేటి గూగుల్ డేటా సెంటర్ అని జగన్ చెబుతున్నారు!

మరోవైపు... విశాఖపట్నంలో డేటా సెంటర్‌ ఏర్పాటుకు 2019 జనవరి 9న తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో.. అదానీ గ్రూప్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాల మధ్య ఒప్పందం కుదిరిందని.. ఆ ఒప్పందం జరిగిన 35 రోజుల వ్యవధిలోనే విశాఖపట్నంలోని కాపులుప్పాడలో అదానీ డేటా సెంటర్‌ కు ముఖ్యమంత్రి చంద్రబాబు శంకుస్థాపన చేశారని టీడీపీ చెబుతోంది.

జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత పాత ఒప్పందం రద్దు చేస్తున్నామని, కొత్త ప్రతిపాదనతో రావాలని సూచించారని.. దాంతో అదానీ సంస్థ ప్రాజెక్టు ప్రతిపాదనను 89 ఎకరాలకు, రూ.3,000 కోట్లకు తగ్గించుకుంటామని చెప్పిందని.. తర్వాత ఆ సంస్థతో ప్రభుత్వానికి ఒప్పందం కుదిరాక.. 2023 మే 3న డేటా సెంటర్‌ కు సీఎం హోదాలో జగన్‌ మళ్లీ శంకుస్థాపన చేశారని చెబుతోంది.

ఈ విధంగా ఏపీలో డేటా సెంటర్ విషయంపై అధికార టీడీపీ, ప్రతిపక్ష వైసీపీల మధ్య తీవ్ర మాటల యుద్ధాలు జరుగుతున్న పరిస్థితి. ఈ సమయంలో.. ఏఐ భవిష్యత్తులో ప్రపంచాన్ని డామినేట్‌ చేసే టెక్నాలజీ అని.. ఏఐ అయినా, క్వాంటం కంప్యూటింగ్‌ అయినా.. భవిష్యత్తులో గొప్ప మార్పులకు డేటా సెంటర్‌ నోడల్‌ పాయింట్‌ గా ఉంటుందని జగన్ తెలిపారు.

ఇదే సమయంలో... డేటా సెంటర్‌ తో ఉద్యోగాలు తక్కువే అయినా.. ఎకో సిస్టమ్‌ తయారవుతుందని.. తద్వారా గ్లోబల్‌ క్యాపబుల్‌ సెంటర్స్‌ వస్తాయని.. అందువల్ల వీటికి తమ ప్రభుత్వంలోనే నాంది పలికామని చెప్పారు. ఈ క్రమంలో... "డేటా ఉంటే రకరకాలుగా.. ఆ డేటాకు మైండ్ అప్లై చేస్తే అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అవుతుంది" అని అన్నారు. దీనిపై ట్రోలింగ్ మొదలైంది.

అవును.. తాజాగా మీడియాతో మాట్లాడిన జగన్.. డేటా సెంటర్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి మాట్లాడుతూ... "డేటాకు మైండ్ అప్లై చేస్తే అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అవుతుంది" అని అన్నారు. దీనికి సంబంధించిన వీడియోలు నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో టీడీపీ ఫాలోవర్స్ జగన్ మాటలను ట్రోల్ చేస్తున్నారు.

ఈ సందర్భంగా... డేటాకు మైండ్ అప్లై చేస్తే అనాలసిస్ అవుతుందని.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) అవ్వదని చెబుతూ... ఏఐలో ఆల్గారిథమ్స్, లెర్నింగ్ ప్యాట్రన్స్ ఉంటాయని కామెంట్స్ చేస్తున్నారు. ఈ సందర్భంగా రకరకాల ట్రోలింగ్ వీడియోలు నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి!

అయితే టీడీపీ ట్రోలింగ్స్ పై వైసీపీ సపోర్టర్స్ స్పందిస్తూ... ఏఐ అంటే సామాన్యులకు అర్ధం అయ్యేలా జగన్ చెప్పారని.. ఇందులో ట్రోలింగ్ చేసేటంత విషయం ఏమీ లేదని కౌంటర్ ఇస్తున్నారు.

Tags:    

Similar News