గోదావరి పుష్కరాలు - 18 నెలల మందు నుంచే చంద్రబాబు హడావుడి
ప్రతి 12 ఏళ్లకు ఒకసారి నిర్వహించే గోదావరి పుష్కరాలపై ఏపీ ప్రభుత్వం ఫోకస్ చేస్తోంది. వచ్చే ఏడాది జూన్ 26 నుంచి జులై 7 వరకు గోదావరి పుష్కరాలు జరగనున్నాయి.;
ప్రతి 12 ఏళ్లకు ఒకసారి నిర్వహించే గోదావరి పుష్కరాలపై ఏపీ ప్రభుత్వం ఫోకస్ చేస్తోంది. వచ్చే ఏడాది జూన్ 26 నుంచి జులై 7 వరకు గోదావరి పుష్కరాలు జరగనున్నాయి. గోదావరి నది ప్రవహించే ప్రతి రాష్ట్రంలో ఈ పుష్కరాలు జరగనున్నాయి. అయితే గోదావరి సముద్రంలో కలిసే సంగమ ప్రాంతం రాష్ట్రంలో ఉండటంతో భక్తులు ఎక్కువ మంది ఈ ప్రాంతంలో స్నానాలు చేయడానికి ఆసక్తి చూపుతుంటారు. దీంతో ఏపీలో గోదావరి పుష్కరాలకు ఎంతో ప్రాధాన్యం ఉంటోంది.
12 ఏళ్ల క్రితం జరిగిన గోదావరి పుష్కరాల సమయంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబే ఉన్నారు. ఇప్పుడు మరోసారి ఆయనకే అవకాశం రావడం గమనార్హం. అయితే గతంలో చోటుచేసుకున్న దుర్ఘటన వల్ల చంద్రబాబుపై ఎప్పటికప్పుడు విపక్షాలు విమర్శలు చేస్తుంటాయి. ఈ నేపథ్యంలో వచ్చే పుష్కరాలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయడానికి సీఎం ముందస్తుగా సిద్ధమయ్యారు. గత అనుభవనాలను దృష్టిలో పెట్టుకుని పుష్కరాలకు తరలివచ్చే భక్తులను అంచనా వేయడం, క్రౌడ్ మేనేజ్మెంట్, వసతుల కల్పన వంటివాటిపై అధికారులతో తాజాగా సమీక్షించారు. పుష్కరాలకు ఇంకా ఏడాదిన్న ఉందనగా సీఎం ఇప్పటి నుంచే సన్నాహాలు చేస్తుండటం ప్రభుత్వం ముందుజాగ్రత్తలను తెలియజేస్తోందని అంటున్నారు.
గోదావరి పుష్కరాలను కుంభమేళాను తలపించేలా నిర్వహించాలని, ఇందుకు యంత్రాంగం ఇప్పటి నుంచే సన్నద్ధం కావాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అధికారులను ఆదేశించారు. పుష్కరాలకు ఇంకా 18 నెలల సమయమే ఉన్నందున పనులు వెంటనే ప్రారంభించి వేగంగా కొనసాగించాలని సూచించారు. గోదావరి పుష్కర స్నానం ఆచరించేందుకు దేశ, విదేశాల నుంచి సుమారు 10 కోట్ల మంది భక్తులు రాష్ట్రానికి వచ్చే అవకాశం ఉందన్న అంచనా వేస్తున్నారు. దీంతో భక్తుల రద్దీకి తగిన రీతిలో మౌలిక సదుపాయాలు కల్పించాలని నిర్దేశించారు.
వచ్చే ఏడాది జూన్ 26 నుంచి జూలై 7 వరకు మొత్తం 12 రోజుల పాటు గోదావరి పుష్కరాలు అత్యంత ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్రంలో గోదావరి ప్రవహించే 212 కిలోమీటర్ల పొడవునా ఘాట్ల నిర్మాణం చేపట్టేందుకు ప్రభుత్వం ప్రణాళిక రచిస్తోంది. పోలవరం, ఏలూరు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కోనసీమ, కాకినాడ జిల్లాల్లో పుష్కర స్నానాలకు ఇబ్బంది లేకుండా చూడాలని సీఎం చంద్రబాబు సూచించారు. నిధుల కోసం ఇప్పటి నుంచే కేంద్రంతో సంప్రదింపులు జరపాలని సీఎం సూచించారు.
భక్తుల రద్దీకి అనుగుణంగా ఏర్పాట్లు చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా వసతి సమస్యను తీర్చేలా టెంట్ సిటీలు హోం స్టేలను అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. ప్రస్తుతం ఉన్న ఘాట్ల సామర్ధ్యాన్ని కూడా పెంచుకోవాల్సి ఉందన్నారు. స్నాన ఘాట్లలో రాకపోకలకు సంబంధించి రూట్ మేనేజ్‌మెంట్ రూపొందించాలని సూచించారు. వాహనాలు ఘాట్ల వరకు రాకుండా పార్కింగ్ ప్రాంతాలను ఎక్కడికక్కడ ఏర్పాటు చేయాలని నిర్దేశించారు.
ట్రాఫిక్ ఇబ్బందులు, వాహన రద్దీ, టెంట్ సిటీలో అగ్ని ప్రమాదాలు లాంటి ఘటనలు తలెత్తకుండా పక్కాగా భద్రతా చర్యలు చేపట్టాలని ఇందుకు ప్రణాళికలు రూపొందించాలని ముఖ్యమంత్రి అన్నారు. ఇందుకోసం ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ డ్రివెన్ క్రౌడ్ మేనేజ్మెంట్‌ని, ఆర్టీజీఎస్ సేవలను వినియోగించుకోవాలన్నారు. భద్రతా చర్యలు, సేవల విషయంలో ఎక్కడా మానవ ప్రయత్నంలో లోటు పాట్లు ఉండకూడదని అధికారులకు సీఎం దిశానిర్దేశం చేశారు. వివిధ ప్రాంతాల నుంచి రాష్ట్రానికి భక్తులు వచ్చేందుకు వీలుగా రహదారులన్నీ అభివృద్ధి చేయాలని ఆదేశించారు. గోదావరి పుష్కరాలకు ముందే పోలవరం ప్రాజెక్టు పనులు పూర్తి కావాలని ముఖ్యమంత్రి అధికారులకు దిశానిర్దేశం చేశారు.
అత్యధికంగా కోనసీమ జిల్లాలో 175 ఘాట్లు
ప్రస్తుతం ఉన్న 234 ఘాట్లతో పాటు కొత్తగా మరో 139 ఘాట్లు నిర్మించనున్నారు. మొత్తం 373 ఘాట్లు 9,918 మీటర్ల పొడవున అభివృద్ధి చేసేలా ప్రణాళికలు రచిస్తున్నారు. పోలవరం జిల్లాలో 14, ఏలూరు జిల్లాలో 34, తూర్పుగోదావరిలో 102, పశ్చిమ గోదావరి 40, కాకినాడ జిల్లా 6, బీఆర్ అంబేద్కర్ కోనసీమలో 175 ఘాట్లు అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. రాజమహేంద్రవరంలో ముందుగా మోడల్ ఘాట్ నిర్మించి ఆ డిజైన్ల ఆధారంగా మిగిలిన ఘాట్ల నిర్మాణం చేపట్టాలని సీఎం సూచించారు. ప్రస్తుతం ఉన్న ఘాట్ల సామర్ధ్యాన్ని కూడా పెంచాలని నిర్దేశించారు. పుష్కరాలకు సన్నద్ధతగా కర్టెన్ రైజర్ ఈవెంట్ నిర్వహించాలని చెప్పారు.
ఇటీవల జరిగిన మహా కుంభమేళాలో వినియోగించినట్టే ఏఐ బేస్డ్ టెక్నాలజీని గోదావరి పుష్కరాలకు అందుబాటులోకి తీసుకురావాలని సీఎం స్పష్టం చేశారు. భాషిణి యాప్ ద్వారా అన్ని భాషల భక్తులకు సేవలు అందించగలగాలని చెప్పారు. పారిశుధ్యం విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. పుష్కరాలకు వచ్చేవారి కోసం ప్రత్యేక బస్సు సర్వీసులు నడపాలని... కేంద్రంతో మాట్లాడి రైళ్లు, విమాన సర్వీసులు అదనంగా నడిపేలా చూడాలన్నారు. పుష్కరాలు నిర్వహించే అన్ని ఘాట్లను, ప్రసిద్ధ క్షేత్రాలను, సమీప ఖాళీ స్థలాలు, ఇతర మౌలిక వసతులను మ్యాపింగ్ చేయాలని సూచించారు. గోదావరి పుష్కరాలకు విస్తృతంగా ప్రచారం కల్పించాలని అధికారులకు సూచించారు.