మనిషి వర్సెస్ మెషిన్.. యుద్ధం మొదలైందా?.. మెటా కొంప ముంచుతోంది..

కేవలం మెటా మాత్రమే కాదు.. గూగుల్, అమెజాన్ , ఒరాకిల్ వంటి సంస్థలు కూడా ఇదే బాటలో పయనిస్తున్నాయి.;

Update: 2026-03-14 09:44 GMT

మనిషి వర్సెస్ మెషిన్.. యుద్ధం మొదలైందా? సోషల్ మీడియా సామ్రాజ్యాన్ని శాసిస్తున్న మెటా ఇప్పుడు తన రూటు మారుస్తోంది. ఏఐ రంగంలో అగ్రగామిగా నిలవాలన్న ఆశయం కోసం ఏకంగా 20 శాతం మంది సిబ్బందిని వదులుకోవడానికి సిద్ధపడటం టెక్ పరిశ్రమలో పెను సంచలనం సృష్టిస్తోంది. 600 బిలియన్ డాలర్ల ఏఐ సామ్రాజ్యాన్ని నిర్మించే క్రమంలో 16 వేల మంది ఉద్యోగులు బలికాబోతున్నారా? మెటా వేస్తున్న ఈ అడుగు భవిష్యత్తు టెక్నాలజీకి సంకేతమా లేక పెను ప్రమాదమా?

ప్రపంచ సోషల్ మీడియా దిగ్గజం మెటా ప్లాట్‌ఫామ్స్ మరోసారి వార్తల్లో నిలిచింది. అయితే ఈసారి అది ఏదో కొత్త ఫీచర్‌తోనో లేదా లాభాలతోనో కాదు.. వేలాది మంది ఉద్యోగుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించే 'లేఆఫ్' వార్తలతో.. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం మెటా తన మొత్తం ఉద్యోగులలో దాదాపు 20 శాతం మందిని.. అంటే సుమారు 16,000 మందిని తొలగించేందుకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం సంస్థలో ఉన్న 79 వేల మంది సిబ్బందిపై ఈ ప్రభావం పడనుందని అంతర్జాతీయ మీడియా కథనాలు కోడై కూస్తున్నాయి.

ఏఐ కోసం భారీ పునర్వ్యవస్థీకరణ

మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ గత రెండేళ్లుగా కంపెనీని "ఇయర్ ఆఫ్ ఎఫిషియన్సీ" వైపు నడిపిస్తున్నారు. కంపెనీ తన పూర్తి ఫోకస్‌ను ఇప్పుడు జనరేటివ్ ఏఐ , మెటావర్స్ నుండి డేటా సెంటర్ల విస్తరణ వైపు మళ్లిస్తోంది. ఈ క్రమంలో అనవసరమైన విభాగాలను తొలగించడం లేదా కుదించడం ద్వారా వ్యయాలను తగ్గించుకోవాలని కంపెనీ భావిస్తోంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. కంపెనీ ఉన్నతాధికారులు ఇప్పటికే సీనియర్ లీడర్లతో సమావేశమై.. కార్యకలాపాలను ఎలా సరళీకృతం చేయాలో చర్చించారు. 2028 నాటికి సుమారు 600 బిలియన్ డాలర్లను ఏఐ మౌలిక సదుపాయాల కోసం ఖర్చు చేయాలని మెటా లక్ష్యంగా పెట్టుకుంది. ఈ భారీ పెట్టుబడుల కోసం నిధులను సమకూర్చుకోవడానికి ఉద్యోగాల కోత తప్పనిసరని విశ్లేషకులు భావిస్తున్నారు.

గత మూడేళ్లలో మూడోసారి..

ఒకవేళ ఈ 16 వేల మంది తొలగింపు నిజమైతే గత మూడేళ్లలో మెటా చేపట్టిన మూడవ అతిపెద్ద లేఆఫ్ ఇదే అవుతుంది. 2022లో 11,000 మంది ఉద్యోగుల తొలగింపు చేపట్టారు. 2023లో 10,000 మంది ఉద్యోగుల తొలగింపు...

2026 అంచనాలో 16,000 మంది ఉద్యోగుల తొలగింపు చేపట్టనున్నారు. మెటా ప్రతినిధి ఆండీ స్టోన్ ఈ వార్తలను కేవలం "ఊహాగానాలు" అని కొట్టిపారేసినప్పటికీ లోలోపల జరుగుతున్న పరిణామాలు మాత్రం ఉద్యోగుల్లో ఆందోళన కలిగిస్తున్నాయి.

టెక్ రంగంలో మారుతున్న సమీకరణాలు

కేవలం మెటా మాత్రమే కాదు.. గూగుల్, అమెజాన్ , ఒరాకిల్ వంటి సంస్థలు కూడా ఇదే బాటలో పయనిస్తున్నాయి. అమెజాన్ ఇప్పటికే ఏఐ వ్యూహంలో భాగంగా 16 వేల మందిని తొలగించింది. ఓరాకిల్ కూడా తమ డేటా సెంటర్ల సామర్థ్యం పెంచేందుకు 20 నుంచి 30 వేల మందిని తగ్గించే యోచనలో ఉంది. మోర్గాన్ స్టాన్లీ వంటి ఆర్థిక సంస్థల విశ్లేషణ ప్రకారం ఏఐ వల్ల కొన్ని రకాల ఉద్యోగాలు ఆటోమేట్ అయినప్పటికీ అవి పూర్తిగా నిరుద్యోగానికి దారితీయవు. అయితే ఉద్యోగులు పాత నైపుణ్యాలకు స్వస్తి చెప్పి మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా కొత్త నైపుణ్యాలను నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

టెక్నాలజీ మారుతున్న కొద్దీ కంపెనీలు తమ ప్రాధాన్యతలను మార్చుకోవడం సహజం. కానీ లాభాల్లో ఉన్న కంపెనీలు కూడా ఏఐ పేరుతో వేలాది మందిని రోడ్డున పడేయడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. భవిష్యత్తులో కేవలం టెక్నికల్ స్కిల్స్ మాత్రమే కాకుండా ఏఐతో కలిసి పనిచేయగలిగే సామర్థ్యం ఉన్నవారికే ఉద్యోగ భద్రత ఉంటుందని స్పష్టమవుతోంది.

Tags:    

Similar News