టీవీకే పార్టీకి అసలైన సవాల్.. ఒక్కొక్కరికి రూ.5 కోట్లు!!

విజయ్ కు ఉన్న క్రేజ్ తో ఎన్నికల్లో పోటీ చేద్దామని, నాయకులుగా గుర్తింపు తెచ్చుకుందామని ఉబలాట పడిన వారే కానీ, డబ్బు ఖర్చు చేసేందుకు ఎవరూ ముందుకు రావడం లేదని అంటున్నారు.;

Update: 2026-03-14 09:57 GMT

తమిళనాడులో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదగాలని కోరుకుంటున్న సినీ నటుడు, టీవీకే అధిపతి విజయ్ కి ఊహించని సవాళ్లు ఎదురవుతున్నాయి. రాజకీయాలు అంటే నల్లేరుపై నడక కాదని, ముఖ్యంగా డబ్బు లేకపోతే రాజకీయాలు చేయలేమన్న కఠినమైన నిజం విజయ్ కి ఆలస్యంగా తెలుస్తోందని అంటున్నారు. తన సినీ గ్లామర్ తో ఎన్నికల్లో సులువుగా గెలిచేయొచ్చన్న అంచనాలు ఇప్పుడు రివర్స్ అవుతున్నాయని, ఎమ్మెల్యేలుగా పోటీ చేయడానికి తగినంత మంది అభ్యర్థులు కనిపించడం లేదని అంటున్నారు. ఇటీవల ఆ పార్టీ అంతర్గత సమావేశంలో జరిగిన చర్చను ఉటంకిస్తూ మీడియాలో ప్రచారం అవుతున్న కథనాలు విజయ్ ఎదుర్కొంటున్న దయనీయ స్థితిని తెలియజేస్తున్నాయని అంటున్నారు.

తమిళనాడు అసెంబ్లీకి మరో రెండు నెలల్లో ఎన్నికలు జరగనున్నాయి. అధికార డీఎంకే, విపక్షం అన్నాడీఎంకే ప్రధానంగా తలపడుతున్నాయి. ఈ రెండు కూటములకు ప్రత్యామ్నాయంగా దళపతి విజయ్ పార్టీ టీవీకే కూడా పోటీకి సిద్ధమవుతోంది. అయితే రాష్ట్రంలోని 234 స్థానాల్లో పోటీకి తగినంత ఆర్థిక స్థోమత ఉన్న అభ్యర్థులు ఆ పార్టీకి లభించడం లేదని అంటున్నారు. ఎన్నికల్లో పోటీ చేయాలంటే ఒక్కో అభ్యర్థి కనీసం రూ.5 కోట్లు వరకు ఖర్చు చేయాల్సివుంటుందని, కొన్ని కీలక నియోజకవర్గాల్లో అంతకన్నా ఎక్కువగానే ఖర్చు పెట్టాల్సివుంటుందన్న అంచనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో తగినంత ఆర్థిక స్థోమత ఉన్న అభ్యర్థులు టీవీకీ పార్టీకి లభించడం లేదన్న ప్రచారం హీట్ పుట్టిస్తోంది.

విజయ్ కు ఉన్న క్రేజ్ తో ఎన్నికల్లో పోటీ చేద్దామని, నాయకులుగా గుర్తింపు తెచ్చుకుందామని ఉబలాట పడిన వారే కానీ, డబ్బు ఖర్చు చేసేందుకు ఎవరూ ముందుకు రావడం లేదని అంటున్నారు. విజయ్ పార్టీ తరఫున అవకాశం వస్తే డొనేషన్లు, పార్టీ ఫండ్ తో నెట్టుకు వచ్చేద్దామని అనుకున్న వారే ఎక్కువగా ఉన్నారని అంటున్నారు. ఈ పరిస్థితుల్లో అన్నాడీఎంకేతో పొత్తు పెట్టుకోవాలని కొందరు ఒత్తిడి తెస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. విజయ్ తో పార్టీ ముఖ్య నేతల సమావేశంలోనూ ఇదే అంశం చర్చకు వచ్చిందని చెబుతున్నారు.

అన్నాడీఎంకే కూటమిలో టీవీకే చేరేందుకు చర్చలు సాగుతున్నాయన్న ప్రచారం నేపథ్యంలో ఈ అంశం వెలుగులోకి రావడం చర్చనీయాంశంగా మారింది. ఏ పార్టీకి అయినా ఎన్నికల్లో నిధులు అవసరం ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు. డబ్బు లేనిదే ఎన్నికల రణక్షేత్రంలో నెగ్గుకురావడం కష్టమనే అభిప్రాయం ఎక్కువగా ఉంది. అయితే ఒంటరిగా పోటీకే మొగ్గు చూపుతున్న విజయ్ నిధులు విషయంలో నోరు మెదపడం లేదని అంటున్నారు. దీంతో టీవీకే వ్యూహం అంతుచిక్కడం లేదని వ్యాఖ్యానిస్తున్నారు.

Tags:    

Similar News