మంత్రి కాకపోతే పార్టీలో కీలకంగా పెద్దాయన !
ఇక కళా వెంకటరావు మంత్రి పదవి కోసం చూస్తున్నారు అని టాక్ నడుస్తోంది. తనకు ఇవే చివరి ఎన్నికలు కాబట్టి మంత్రి పదవి ఇస్తే చాలు అన్నది ఆయన వైపు నుంచి మాటగా ఉంది అని అంటున్నారు.;
ఉత్తరాంధ్ర కు చెందిన సీనియర్ మోస్ట్ లీడర్ కిమిడి కళా వెంకట రావుకు మరోసారి ఏపీ టీడీపీ అధ్యక్ష పదవి దక్కుతుందని ప్రచారం సాగుతోంది ఆయన 2014 నుంచి ఈ 2020 దాకా సుదీర్ఘ కాలం చేసి ఉన్నారు. ఒక వైపు మంత్రిగా ఉంటూనే టీడీపీ ఏపీ అధినేతగా ముఖ్యమైన బాధ్యతలు చేపట్టారు. ఇక 2019లో ఆయన ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ గా ఉండగానే ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో టీడీపీ ఓటమి పాలు అయింది కళా కూడా ఎచ్చెర్ల నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి పాలు అయ్యారు. ఆ తరువాత ఆయన పదవిని ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాకు చెందిన అచ్చెన్నాయుడుకు ఇచ్చారు.
మంత్రి పదవి కోసం :
ఇక కళా వెంకటరావు మంత్రి పదవి కోసం చూస్తున్నారు అని టాక్ నడుస్తోంది. తనకు ఇవే చివరి ఎన్నికలు కాబట్టి మంత్రి పదవి ఇస్తే చాలు అన్నది ఆయన వైపు నుంచి మాటగా ఉంది అని అంటున్నారు. అయితే ఆయనకు మంత్రి పదవి ఇవ్వాలీ అంటే అదే జిల్లాకు అదే సామాజిక వర్గానికి చెందిన యువ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ని తప్పించాల్సి ఉంటుంది. అయితే మంత్రిగా మంచి పనితీరుని కబరుస్తున్నారు కొండపల్లి శ్రీనివాస్. ఇక అవినీతి ఆరోపణలకు దూరంగా ఉంటున్నారు. లోకేష్ టీం లో కీలకంగా ఉంటున్నారు. దాంతో పాటు మంత్రులకు ఇస్తున్న ర్యాంకులలో ఆయనకు మంచి ప్లేస్ ఉంటోంది. దాంతో ఆయనని తప్పించడం కష్టమే అని అంటున్నారు.
ఈ మార్పులతోనే :
ఇక విశాఖ జిల్లా గాజువాక నుంచి ఎమ్మెల్యేగా ఉన్న పల్లా శ్రీనివాస్ ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ గా ఉన్నారు. ఆయనకు మంత్రి వర్గ విస్తరణలో పదవి ఖాయమని అంటున్నారు. విశాఖ నగరంలో బలమైన యాదవ సామాజిక వర్గానికి చెందిన పల్లాకు మంత్రి పదవి ఇవ్వడం వల్ల అనేక విధాలుగా ప్రయోజనాలు ఉన్నాయని అంటున్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లాకు చెందిన అదే సామాజిక వర్గానికి చెందిన మంత్రిని తప్పిస్తారని ఆ ప్లేస్ లో పల్లాకు చాన్స్ ఉంటుందని అంటున్నారు. అలా పల్లాకు మంత్రి పదవి దక్కితే ఆయన వద్ద ఉన్న ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ పదవిని కళాకు ఇస్తారని చెబుతున్నారు. దాని వల్ల విజయనగరం జిల్లా మీద పూర్తి ఫోకస్ పెడుతూ వైసీపీని తగ్గించి కూటమిని గట్టిపరచేందుకు కళా వంటి సీనియర్ అనుభవం దోహదపడుతుందని భావిస్తున్నారుట. మొత్తం మీద చూస్తే కళా వంటి సీనియర్ కి ఈసారి పార్టీలో కానీ ప్రభుత్వంలో కానీ సముచితమైన స్థానం దక్కడం ఖాయమని అంటున్నారు. తొందరలోనే శుభవార్త అయితే తాము వింటామని కళా వర్గం అయితే ఆశాభావంతో ఉంది అని అంటున్నారు.