సన్‌రైజర్స్ నిర్ణయం వెనుక తమిళ రాజకీయం?

అందులోనూ భారత్‌తో మ్యాచ్‌లు ఆడినపుడల్లా విపరీతమైన అతి చేసే పాక్ ఆటగాళ్లలో అబ్రార్ ఒకడు. అలాంటి ఆటగాడిని సన్‌రైజర్స్ ఎంచుకోవడంతో సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేగింది.;

Update: 2026-03-14 07:58 GMT

కొన్నేళ్ల ముందు వరకు ఐపీఎల్‌లో అతి తక్కువ ఆదరణ ఉన్న జట్లలో ఒకటిగా ఉండేది సన్‌రైజర్స్ హైదరాబాద్. ఆ జట్టు ఆరంభ సీజన్లలో ఆటతీరు అంత గొప్పగా ఉండేది కాదు. దీనికి తోడు అభిమానుల్లో ఇది మన జట్టు అనే ఫీలింగ్ తీసుకురాలేకపోయారు. కానీ డేవిడ్ వార్నర్ కెప్టెన్ అయ్యాక అంతా మారింది. కమిన్స్ సారథ్యంలో జట్టులో ఇంకా దూకుడు పెరిగాక ఆదరణ కూడా అమాంతం పెరిగింది. లీగ్‌లో ఆ జట్టు పాపులారిటీ ఎక్కడికో వెళ్లింది. గత సీజన్లో సన్‌రైజర్స ఆట అంత గొప్పగా లేకపోయినా.. జట్టు ఫాలోయింగ్ ఏమీ తగ్గలేదు. ఈ సీజన్ ముంగిట మంచి హైపే కనిపిస్తోంది.

కానీ ఒక్క రోజు వ్యవధిలో ఈ హైప్ అంతా కరిగిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. పాకిస్థాన్ బౌలర్ అబ్రార్ అహ్మద్‌ను ఇంగ్లాండ్‌లో జరిగే ది హండ్రెడ్ టోర్నీలో భాగమైన సన్‌రైజర్స్ ఫ్రాంఛైజీ కొనుగోలు చేయడం వివాదానికి దారి తీసింది. గత ఏడాది పహల్గాం దాడి తర్వాత భారత్, పాకిస్థాన్ మధ్య సంబంధాలు బాగా దెబ్బ తిన్న నేపథ్యంలో ఆ జట్టు ఆటగాళ్ల ఊసెత్తితే మన క్రికెట్ అభిమానులకు రుచించట్లేదు.

అందులోనూ భారత్‌తో మ్యాచ్‌లు ఆడినపుడల్లా విపరీతమైన అతి చేసే పాక్ ఆటగాళ్లలో అబ్రార్ ఒకడు. అలాంటి ఆటగాడిని సన్‌రైజర్స్ ఎంచుకోవడంతో సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేగింది. ఆ ఫ్రాంఛైజీని, దాని యజమానులను మామూలుగా ట్రోల్ చేయట్లేదు నెటిజన్లు. ఐతే హండ్రెడ్ టోర్నీలో పాకిస్థాన్ ఆటగాళ్లు ముందు నుంచి ఆడుతున్నారని.. అక్కడ అన్ని జట్లూ పాక్ ఆటగాళ్లను తీసుకుంటున్నపుడు, ఆ విషయంలో ఏ ఆంక్షలూ లేనపుడు అబ్రార్‌ను ఎంచుకుంటే తప్పేంటన్నది సన్‌రైజర్స్ వాదనగా కనిపిస్తోంది. కానీ ఈ విషయంపై ఆ ఫ్రాంఛైజీ అధికారికంగా ఏమీ స్పందించలేదు. కానీ అభిమానుల ఆగ్రహం మాత్రం మామూలుగా లేదు.

ఐతే దీన్ని తమిళనాడు ఎన్నికలకు ముడిపెట్టి కూడా కొందరు విశ్లేషణలు చేస్తుండడం గమనార్హం. అక్కడ అధికారంలో ఉన్న డీఎంకే పార్టీలో కీలకమైన మారన్ కుటుంబానిదే సన్‌రైజర్స్ ఫ్రాంఛైజీ. హిందుత్వ అజెండాతో పని చేసే బీజేపీని తీవ్రంగా వ్యతిరేకించే డీఎంకే.. తమది ముస్లిం మైనారిటీల పక్షపాత పార్టీగా చెప్పుకుంటూ ఉంటుంది. ఈ నేపథ్యంలో రాబోయే తమిళనాడు ఎన్నికల్లో ముస్లింల మనసులు గెలించేందుకు అబ్రార్‌ను సన్‌రైజర్స్ ఎంచుకుందంటూ ఒక వాదన తెరపైకి వచ్చింది. ఐతే ఒక పాకిస్థాన్ ఆటగాడిని ఓన్ చేసుకుని తమిళనాట ముస్లింలు డీఎంకే ఓటేస్తారా? ఇది అర్థరహితమైన వాదన అంటూ కొందరు కొట్టిపారేస్తున్నారు. ఇందులో ఎంత వరకు నిజం ఉందో కానీ.. ఈ నిర్ణయం వల్ల సన్‌రైజర్స్ ఫ్రాంఛైజీ ప్రతిష్ఠ మాత్రం దారుణంగా దెబ్బ తిన్నట్లే కనిపిస్తోంది. అలా అని ఆ నిర్ణయంపై వెనక్కి తగ్గడం కూడా కష్టంగానే కనిపిస్తోంది.

Tags:    

Similar News