చంద్రబాబు సర్కారు అదిరి పోయే ప్లాన్.. వైసీపీ ఇప్పుడేం చేస్తుందో?
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన ‘స్త్రీశక్తి’ ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణ పథకంపై అధికార, విపక్షాల మధ్య విమర్శలు, ప్రతి విమర్శలు కొనసాగుతున్నాయి.;
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన ‘స్త్రీశక్తి’ ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణ పథకంపై అధికార, విపక్షాల మధ్య విమర్శలు, ప్రతి విమర్శలు కొనసాగుతున్నాయి. సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా ప్రవేశపెట్టిన ఉచిత బస్సు పథకం సూపర్ హిట్ అయిందని ప్రభుత్వం ప్రచారం చేస్తోంది. అంతేకాకుండా ప్రజల్లో అనూహ్య స్పందన కనిపిస్తోందని, ఆగస్టు 15న ఈ పథకం ప్రారంభించగా, నాలుగు రోజులుగా లక్షల మంది మహిళలు రాష్ట్రవ్యాప్తంగా ఉచితంగా ప్రయాణించారని గణాంకాలు చూపుతోంది. అయితే ఉచిత బస్సుపై పరిమితులు పెట్టారని, ప్రజలను మోసం చేశారని వైసీపీ విమర్శలకు దిగుతోంది. దీనిపై తన సోషల్ మీడియా టీంతో వీడియోలు చేయిస్తూ తమ పార్టీ వాదనను ప్రజల్లోకి తీసుకువెళుతోంది.
వైసీపీ విమర్శలకు ప్రభుత్వం కూడా దీటుగా కౌంటర్ అటాక్ చేస్తోంది. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డిని టార్గెట్ చేస్తూ ఉచిత బస్సుతో రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్లవచ్చని చెప్పటమే కాకుండా, వైసీపీ అధినేత జగన్ ఉచిత బస్సు పథకం ఎలా పనిచేస్తుందో తెలుసుకునేందుకు తన సతీమణి భారతీరెడ్డిని తీసుకని వారి సొంత నియోజకవర్గం పులివెందుల నుంచి తిరుపతి వరకు వెళ్లవచ్చని చెబుతోంది. అయితే టీడీపీ ఈ స్థాయిలో ఎదురుదాడి చేస్తున్నా వైసీపీ తన విమర్శలను మాత్రం ఆపడం లేదు. ఉచిత బస్సు పథకం అన్ని బస్సు సర్వీసుల్లోనూ అమలు చేయాలని గట్టిగా డిమాండు చేస్తోంది. రాష్ట్రంలో 11 రకాల బస్సు సర్వీసులు ఉంటే, కేవలం 5 రకాల సర్వీసులకు ఉచిత పథకాన్ని వర్తించేలా అమలు చేయడాన్ని వైసీపీ ఆక్షేపిస్తోంది.
నాలుగు రోజులుగా రాష్ట్రంలో లక్షల మంది మహిళలు పెద్ద ఎత్తున వినియోగించుకుంటున్న ఉచిత బస్సు పథకంపై వైసీపీ విమర్శల దాడి ఆపకపోవడాన్ని సీరియస్ గా తీసుకున్న టీడీపీ అదిరిపోయే ప్లాన్ వేసింది. జగన్మోహనరెడ్డి పార్టీకి ఆయన సొంత ప్రాంతం నుంచే సమాధానం చెప్పాలని నిర్ణయించింది. దీంతో ప్రతిరోజూ మహిళా ప్రయాణికులపై డిపోల వారీగా సమాచారం తెప్పించుకుంటున్న ప్రభుత్వం.. పులివెందుల నియోజకవర్గంలో తిరుగుతున్న ఆర్టీసీ బస్సులు, ఆ నియోజకవర్గం పరిధిలోని మండలాల నుంచి ఇతర ప్రాంతాలకు వెళుతున్న బస్సు ప్రయాణికుల వివరాలను సేకరించింది. దీనిద్వారా జగన్మోహనరెడ్డి సొంత నియోజకవర్గంలో కూడా ప్రభుత్వ పథకానికి ఆదరణ లభిస్తోందని చెప్పాలని ప్రభుత్వం వ్యూహం రచించింది.
ఇక పులివెందుల ఆర్టీసీ డిపో మేనేజర్ లెక్కల ప్రకారం గత మూడురోజుల్లో సుమారు 20 వేల మంది మహిళా ప్రయాణికులు ఉచిత బస్సు సౌకర్యాన్ని వినియోగించుకున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. అంటే పులివెందుల అసెంబ్లీ సెగ్మంటులో కూడా ఉచిత బస్సు పథకానికి మంచి ఆదరణ లభిస్తోందన్న విషయాన్ని ప్రభుత్వం వెల్లడించింది. అంతేకాకుండా పులివెందుల డిపో పరిధిలో సుమారు రూ.7.5 లక్షల డబ్బు మహిళలకు ఆదా అయిందని కూడా అధికారులు చెబుతున్నారు. దీంతో వైసీపీ చేస్తున్న విమర్శలకు క్షేత్రస్థాయిలో పథకం అమలు తీరుకు ఎక్కడా సంబంధం లేదని ప్రభుత్వ వర్గాలు వాదిస్తున్నాయి. 80 శాతం ప్రయాణికులకు మేలు జరుగుతోందని ఉచిత పథకం ద్వారా మహిళలు చాలా ఆనందంగా ఉన్నారని ప్రభుత్వం వివరిస్తోంది.
మాజీ ముఖ్యమంత్రి జగన్ తన సొంత నియోజకవర్గంలోని మహిళల అంతరంగం తెలుసుకోకుండా, తన పార్టీ నేతలతో ‘స్త్రీశక్తి’ పథకంపై విమర్శలు చేయిస్తున్నారని ప్రభుత్వం మండిపడుతోంది. మరోవైపు ఉచిత బస్సు పథకానికి ప్రజల నుంచి స్పందన బాగుండటంతో ప్రభుత్వానికి పాజిటివ్ టాక్ వచ్చిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇదే సమయంలో వైసీపీ విమర్శలపైనా సమీక్షించిన ప్రభుత్వం.. ఘాట్ రోడ్డులలో బస్సులకు కూడా ఉచిత బస్సు సౌకర్యం అమలు చేయాలని నిర్ణయించింది.