‘సోషల్ భూతం’పై పవన్ కీలక ప్రతిపాదన.. దుష్ప్రచారానికి ఫుల్ స్టాప్ పడుతుందంటారా?
ఇక డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కల్యాణ్ సోషల్ మీడియా ప్రధాన బాధితుడిగా చెబుతారు. రాష్ట్ర రాజకీయాల్లో ఉన్న నేతల్లో పవన్ ను టార్గెట్ చేసుకుని ఓ వర్గం సోషల్ మీడియాలో చెలరేగిపోతుందని అంటుంటారు.;
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రభుత్వంలో కీ రోల్ ప్లే చేస్తున్నారు. అనువజ్ఞుడు అయిన ముఖ్యమంత్రి చంద్రబాబు వద్ద తాను ఎంతో నేర్చుకోవాల్సివుందని చెప్పే డిప్యూటీ సీఎం కొన్ని విషయాల్లో మాత్రం దూకుడు చూపుతున్నారు. ముఖ్యంగా రాజకీయాల్లో అక్రమాలు, అవినీతి, దౌర్జన్యాలపై పవన్ వైఖరి తీవ్ర చర్చనీయాంశమవుతోంది. అవినీతి, అక్రమాలను అణచివేయాలనే విషయంలో ముక్కుసూటిగా వ్యవహరిస్తున్న పవన్ రాజకీయ నాయకుల దౌర్జన్యాలను తీవ్రంగా పరిగణిస్తున్నారు. హింసను ప్రేరేపించే నేతలు తన వారు అయినా దూరం పెడుతున్నారు. ఈ క్రమంలోనే డిప్యూటీ సీఎం పవన్ తాజాగా చేసిన ఓ ప్రతిపాదన రాజకీయంగా చర్చనీయాంశం అవుతోంది.
ప్రస్తుతం డిజిటల్ యుగంలో సోషల్ మీడియా ప్రభావం ఎక్కువగా ఉంది. కత్తికి రెండు వైపులా పదును అన్నట్లు సోషల్ మీడియా వల్ల ఎంత మేలు ఉందో.. అంతకు రెండింతలు ముప్పు ఉందనే అభిప్రాయం ఉంది. ముఖ్యంగా మహిళలను కించపరచడం, రాజకీయ ప్రత్యర్థులపై దుష్ర్పచారం, ఫేక్ వార్తల ప్రసారంతో సోషల్ మీడియాపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇక డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కల్యాణ్ సోషల్ మీడియా ప్రధాన బాధితుడిగా చెబుతారు. రాష్ట్ర రాజకీయాల్లో ఉన్న నేతల్లో పవన్ ను టార్గెట్ చేసుకుని ఓ వర్గం సోషల్ మీడియాలో చెలరేగిపోతుందని అంటుంటారు.
దీంతో డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలపై కేసులు నమోదుకు పవన్ ఆదేశించారు. ఓ దశలో హోంమంత్రి అనితపైనా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పరిణామంతో రాష్ట్రంలో సోషల్ మీడియా అరెస్టులు జరిగాయి. ఇక ప్రస్తుతం ఈ అరెస్టుల పరంపర కాస్త నెమ్మదించిందని అంటున్నారు. అయితే ఈ పరిస్థితి పునరావ్రుతం కాకుండా సోషల్ మీడియా బిల్లును ప్రవేశపెట్టాలని ప్రభుత్వానికి సూచిస్తున్నారు పవన్.
సోషల్ మీడియాకు ప్రస్తుతం ఎలాంటి నిబందనలు, పరిమితులు లేవు. దీంతో ఎవరికి నచ్చిన విధంగా వారు ఇష్టానుసారం పోస్టింగులు, షేరింగులతో చెలరేగిపోతున్నారు. దీనివల్ల కొందరి వ్యక్తిగత పరువు ప్రతిష్టలు మంట కలుస్తున్నాయి. ప్రధానంగా రాజకీయాల్లో ఉన్న నేతలు, వారి కుటుంబ సభ్యుల వ్యక్తిత్వాన్ని కించపరిచేలా సోషల్ సైకోలు రెచ్చిపోతున్నారు. ఇది ఆ పార్టీ.. ఈ పార్టీ అన్న తేడా లేకుండా సాగుతోంది.
అయితే టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పరిస్థితిలో కొంత మార్పు వచ్చినా, ఫేక్ ప్రచారం మాత్రం ఆగడం లేదని ప్రభుత్వం భావిస్తోంది. సోషల్ మీడియా కట్టడికి ప్రత్యేక చట్టం తేవాలని చాలా కాలం నుంచి ఆలోచిస్తోంది. దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్ కూడా పలుమార్లు ప్రస్తావించారు. కానీ, ఇంతవరకు ఒక్క అడుగు ముందుకు పడలేదు. ఇక ‘సేనతో సేనాని’ కార్యక్రమం కింద విశాఖ వచ్చిన పవన్ తొలి రోజు కార్యకర్తలు, నేతలతో సమావేశమైన సందర్భంగా ఈ అంశంపై చర్చించినట్లు సమాచారం. నేతలతో భేటీ సందర్భంగా సోషల్ మీడియాలో దుష్ప్రచారంపై చర్చ జరగగా, దీనిని అరికట్టేందుకు ప్రత్యేక బిల్లు ప్రవేశపెట్టనున్నట్లు పవన్ వెల్లడించారు. ఈ విషయంపై ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబుతో మాట్లాడటం జరిగిందని కూడా పవన్ చెప్పారని అంటున్నారు.