పునర్విభజనపై ఆశలు.. నేతల ఆకాంక్ష తీరేనా..!
రాష్ట్రంలో నియోజకవర్గాల పునర్విభజన అంశం మరోసారి తెర మీదకు వచ్చింది. తాజాగా జమిలి ఎన్నికలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది.;
రాష్ట్రంలో నియోజకవర్గాల పునర్విభజన అంశం మరోసారి తెర మీదకు వచ్చింది. తాజాగా జమిలి ఎన్నికలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ క్రమంలో నియోజకవర్గాల పునర్విభజనపై అటు తెలంగాణ ఇటు ఆంధ్రప్రదేశ్లో కూడా రాజకీయ నాయకుల మధ్య చర్చ జరుగుతోంది. వాస్తవానికి ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం ప్రకారం 2019-20 మధ్యలో నియోజకవర్గం జరగాల్సి ఉంది. దీని ద్వారా ఆంధ్రప్రదేశ్లో 50 స్థానాల వరకు కొత్తగా ఏర్పడతాయి. కానీ 2021 జనాభా లెక్కల ప్రకారం దీనిని చేపడతామని అప్పట్లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.
కానీ జనాభా లెక్కలు జరగ లేదు అప్పట్లో కరోనా కారణంగా జనాభా లెక్కల విషయాన్ని వాయిదా వేసిన విషయం తెలిసిందే. ఇక ఆ తర్వాత జమ్మూ కాశ్మీర్ విభజన అనంతరం అక్కడ నియోజకవర్గాలను పునర్విభజన చేశారు. దీంతో అదే విధంగా రాష్ట్రంలోనూ నియోజకవర్గాలను విభజించాలని కోరుతూ జర్నలిస్టు పురుషోత్తం రెడ్డి సుప్రీంకోర్టులో కేసు వేశారు. ప్రస్తుతం ఇది విచారణ దిశలో ఉంది. అయితే కేంద్ర ప్రభుత్వం మాత్రం జనాభా లెక్కలు తేలిన తర్వాత మాత్రమే నియోజకవర్గాల పునర్విభజన చేపడుతామని సుప్రీంకోర్టుకు తేల్చి చెప్పింది.
ఇప్పుడు జనాభా లెక్కల విషయాన్నీ తెరమీదకు తెచ్చిన నేపథ్యంలో 2026 ముందే తొలి దశలో జనాభా లెక్కలు చేపడుతున్నారు. దీనిని బట్టి ఆంధ్రప్రదేశ్ తొలి దశలోనే ఉన్న కారణంగా అప్పుడే నియోజకవర్గాల పునర్విభజన ఖాయంగా జరుగుతుందనే చర్చ జరుగుతోంది. ఇదే జరిగితే మరో 50 స్థానాల వరకు రాష్ట్రంలో పెరిగే అవకాశం ఉంది. ఇది అన్ని పార్టీలకు లాభించే అవకాశంగా మారుతుంది. ముఖ్యంగా కూటమి కనక మళ్ళీ వచ్చే ఎన్నికల్లో ఇదేవిధంగా పోటీ చేయగలిగితే అప్పుడు ఆ పార్టీకి మరింత ఎక్కువగా లాభం జరుగుతుందని చర్చ నడుస్తోంది.
ప్రస్తుతం కేంద్రం విడుదల చేసిన జనాభా లెక్కలకు సంబంధించిన నోటిఫికేషన్ ఈ ఆశలను మరింతగా పెంచింది. అయితే... గతంలో నియోజకవర్గాల పునర్విభజన విషయంలో సై అన్న వైసీపీ.. ఇప్పుడు మాత్రం మౌనంగా ఉండడం గమనార్హం. ఎందుకంటే.. పార్టీలో నాయకుల లేమి.. కొందరు నాయకులు వెళ్లిపోవడం వంటివి వైసీపీని ఇరుకున పెడుతున్నాయి. దీంతో మళ్లీ 50 నియోజకవర్గాలు పెరిగితే.. తమకు తిప్పలేనన్న భావన ఆ పార్టీలో కనిపిస్తోంది. దీంతో ఈ విషయంపై సైలెంట్‌గా ఉంది. కానీ, కూటమి పార్టీల్లో మాత్రం నియోజకవర్గాల పునర్విభజన అంశం జోష్ నింపడం విశేషం. మరి నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుందా లేదా అనేది చూడాలి.