ఏపీ సీఎంకు కొత్త హెలికాఫ్టర్ కొనలేదు.. అద్దెకు తీసుకున్నాం
రాజకీయ వాతావరణం కంగాళిగా ఉన్నప్పుడు.. అధికార.. ప్రతిపక్ష పార్టీల మధ్య తరచూ ఏదో ఒక వివాదం నడిచే వేళలో ప్రభుత్వాన్ని నడిపేవారు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది.;
రాజకీయ వాతావరణం కంగాళిగా ఉన్నప్పుడు.. అధికార.. ప్రతిపక్ష పార్టీల మధ్య తరచూ ఏదో ఒక వివాదం నడిచే వేళలో ప్రభుత్వాన్ని నడిపేవారు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. తెలుగు రాష్ట్రాల్లో ఏపీ రాజకీయం వేరే లెవల్ లో ఉంటుందన్న విషయం తెలిసిందే. గడిచిన పదేళ్లలో ఆ రాష్ట్రంలోని రాజకీయ ముఖచిత్రమే మారిపోయింది. సత్యాన్ని అసత్యంగా ప్రచారం చేసే కళ ఆ రాష్ట్ర రాజకీయాల్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. దీనికి తోడు సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేసే స్థాయి వేరే లెవల్ లో ఉంటుంది. ఇలాంటి వేళ అధికారంలో ఉన్న వారు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది.
కొద్ది రోజులుగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు వినియోగించేందుకు వీలుగా ఒక ఆధునిక హెలికాఫ్టర్ ను ఏర్పాటు చేయటం తెలిసిందే. అయితే.. దాదాపు రూ.150 కోట్ల ఖర్చుతో ఈ హెలికాఫ్టర్ కొన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. చివరకు ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటుందని పేరున్న మీడియా సంస్థలోనూ ఏపీ సీఎం కోసం కొత్త హెలికాఫ్టర్ ను కొనుగోలు చేసినట్లుగా వార్త వచ్చింది. సోషల్ మీడియాలో మాదిరి నెగిటివ్ గా కాకుండా.. వివరాల్ని వివరాలుగా పేర్కొనటం కనిపిస్తుంది.
ఇదిలా ఉంటే.. కొత్త హెలికాఫ్టర్ కొనుగోలు అంశంపై తాజాగా ఏపీ సీఎంవో ఫుల్ క్లారిటీ ఇచ్చేసింది. ఇదేదో.. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టేసినట్లుగా వ్యవహరిస్తున్న ధోరణిని తప్పు పడుతున్నారు. ఇప్పుడున్న సోషల్ మీడియా ప్రపంచంలో గాలిని సైతం మూట కట్టేస్తున్న సందర్భంలో.. జరిగిన విషయాల్ని జరిగినట్లుగా.. అధికారికంగా ప్రకటిస్తే సరిపోతుంది. అందుకోసం మరీ అంతగా శ్రమించాల్సిన అవసరం లేదు. తప్పుడు ప్రచారం జరిగిన తర్వాత వాస్తవాల్ని అధికార ప్రకటన రూపంలో వెల్లడించే కన్నా.. దానికంటే ముందే ఆ పని చేస్తే సరిపోతుంది.
కొద్ది రోజుల క్రితం వరకు ఏపీ ముఖ్యమంత్రి ప్రయాణాల కోసం భెల్ కు చెందిన హెలికాఫ్టర్ ను వినియోగించే వారు. ఈ లోహ విహంగానికి తరచూ సాంకేతిక సమస్యలు ఎదురు కావటం.. అదే మాత్రం సురక్షితం కాదన్న అంశాన్ని భద్రతా వర్గాలు హెచ్చరించాయి. దీంతో.. కొత్త హెలికాఫ్టర్ వినియోగానికి సంబంధించిన కసరత్తు జరిగింది. ఈ నేపథ్యంలో ఎయిర్ బస్ కు చెందిన అత్యాధునిక మోడల్ హెచ్ 160ను వినియోగిస్తున్నారు.
అయితే.. ఈ హెలికాఫ్టర్ ను ఏపీ ప్రభుత్వం కొనుగోలు చేయలేదు. అద్దె ప్రాతిపదికన తీసుకుంది. ఈ కొత్త హెలికాఫ్టర్ తో ఉండే ప్రయోజనం ఏమంటే.. అమరావతి నుంచి నేరుగా అటు శ్రీకాకుళం.. ఇటు చిత్తూరు వరకు ప్రయాణించేందుకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. పాత హెలికాఫ్టర్ కారణంగా తరచూ విమానాశ్రయానికి వెళ్లాల్సి రావటం.. దానికి అయ్యే ఖర్చు ఇలాంటివన్నీ చూసుకున్నప్పుడు.. అద్దెకు కొత్తగా తీసుకున్న హెలికాఫ్టర్ కారణంగా ఇప్పటివరకు అవుతున్న ఖర్చులో 70 శాతం ఆదా చేసే వీలుందని ఏపీ సీఎంవో చెబుతుంది. ఈ విషయాల్ని సోషల్ మీడియాలో తప్పుగా పోస్టు అయ్యే దానికి ముందే ప్రకటన విడుదల చేసి ఉంటే బాగుండేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.