స్సెషల్ ఫ్లైట్ కోసం సీఎం చంద్రబాబు ఏడాది ఖర్చు లెక్క ఇదేనట
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక విమాన ఖర్చుల లెక్క మరోసారి చర్చనీయాంశంగా మారింది.;
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక విమాన ఖర్చుల లెక్క మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఈ ఆర్థిక సంవత్సరంలో (2025 ఏప్రిల్ నుంచి 2026 మార్చి) ఆయన పెట్టిన స్పెషల్ ఫ్లైట్ లకు భారీగానే ఖర్చైంది. నాలుగో త్రైమాసికానికి ఏపీ సీఎం వినియోగించే ప్రత్యేక హెలికాఫ్టర్లు.. విమానాలకు అద్దెలు చెల్లించేందుకు వీలుగా తాజాగా సాధారణ పరిపాలన శాఖ విడుదల చేసిన జీవో కొత్త రాజకీయ రగడకు తెర తీసేలా మారిందని చెప్పాలి.
నాలుగో త్రైమాసికంలో ప్రత్యేక విమానాల ఖర్చు కోసం ఏపీ ఆర్థిక శాఖ రూ.13.65 కోట్ల మొత్తాన్ని విడుదల చేసింది. దీనికి సంబంధించిన అధికారిక ఉత్తర్వులు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో చంద్రబాబు ప్రత్యేక విమానాల ఖర్చు అంతకంతకూ పెరుగుతున్న వైనంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాను విపక్షంలో ఉన్నప్పుడు అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక విమానాల ఖర్చు మీద అదే పనిగా విమర్శలు చేసిన చంద్రబాబు.. తాను సీఎంగా ఉన్నప్పుడు అంతకు మించి అన్నట్లుగా వ్యవహరించటమా? అన్నదిప్పుడు చర్చగా మారింది.
ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పుడు వివిధ జిల్లాల పర్యటనలకు హెలికాఫ్టర్ వినియోగాన్ని తప్పు పట్టలేం. కాకుంటే.. వారాంతాల్లో విజయవాడ నుంచి హైదరాబాద్ మధ్య చేస్తున్న ప్రయాణాలు.. అందుకు అయ్యే ఖర్చును విపక్షం ప్రశ్నిస్తోంది. ఏపీకి ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్న చంద్రబాబు.. ఆయన కుటుంబం మొత్తం హైదరాబాద్ లో ఉండటంతో వీకెండ్ వేళ హైదరాబాద్ కు రావాల్సి వస్తోంది. ఇందుకు ప్రత్యేక విమానాన్ని వినియోగిస్తున్నారు.
తాను విపక్ష నేతగా ఉన్నప్పుడు.. పౌర విమానాల్లో ఆయన ప్రయాణించేవారు. సామాన్యులతో కలిసి ప్రయాణించిన చంద్రబాబు.. ముఖ్యమంత్రి హోదాలోనూ అదే తీరును కొనసాగించటం కష్టమే. సామాన్యుడితో పోలిస్తే.. ముఖ్యమంత్రి సమయానికి ఉండే విలువను పరిగణలోకి తీసుకుంటే ప్రత్యేక విమానాన్ని వినియోగించటం తప్పేం కాదు. కాకుంటే.. వ్యక్తిగత అంశాలకు.. కుటుంబంతో గడిపేందుకు పెట్టే ఖర్చు విషయంలో విపక్ష నేతలు వేలెత్తి చూపేందుకు వీల్లేని విధంగా వ్యవహరించి ఉంటే బాగుండేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
గడిచిన ఆర్థిక సంవత్సరంలో హెలికాఫ్టర్లు.. ప్రత్యేక విమానాల కోసం పెడుతున్న ఖర్చు రూ.54.63 కోట్లకు చేరినట్లుగా అధికారిక గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఆసక్తికరఅంశం ఏమంటే.. ఈ ఆర్థిక సంవత్సరంలోని తొలి త్రైమాసికంలో రూ.19.12 కోట్లు ఖర్చు అయితే..రెండు.. మూడో త్రైమాసికంలో మాత్రం రూ.10.92 కోట్ల చొప్పున ఖర్చు అయ్యింది. నాలుగో త్రైమాసికానికి రూ.13.65 కోట్లు విడుదల చేయటంతో మొత్తం ఖర్చు రూ.54కోట్లను దాటేసింది. చంద్రబాబును విమర్శించేవారు.. వేలెత్తి చూపే వారిలో అత్యధికులు ఆయన ప్రత్యేక విమాన వినియోగాన్ని తరచూ తెర మీదకు తెస్తుంటారు. ఈ విషయంలో ఆయన తగిన జాగ్రత్తలు తీసుకుంటే మంచిదన్న మాట తెలుగు తమ్ముళ్ల నోట వినిపిస్తోంది.