ఢిల్లీలో ఏపీ సీఐడీ.. టెన్షన్ లో వైసీపీ

ఏపీ లిక్కర్ స్కాంలో సీఐడీ వేట మొదలైందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే ఈ స్కాంతో సంబంధం ఉందనే అనుమానాలు ఉన్న నేతలు, అధికారుల ఇళ్లల్లో సీఐడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.;

Update: 2025-04-05 19:24 GMT

దేశ రాజధాని ఢిల్లీలో ఏపీ సీఐడీ అధికారులు దిగడం ప్రతిపక్ష వైసీపీకి టెన్షన్ పుట్టిస్తుంది. మాజీ ముఖ్యమంత్రి జగన్ కు అత్యంత సన్నిహితుడు, వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని అరెస్టు చేసేందుకే సీఐడీ అధికారులు ఢిల్లీ వచ్చారంటూ జరుగుతున్న ప్రచారం రాజకీయంగా హీట్ పుట్టిస్తోంది. ఏపీ లిక్కర్ స్కాంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న మిథున్ రెడ్డి పెట్టుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్ ను హైకోర్టు కొట్టివేడయంతో ఆయన అరెస్టుకు మార్గం సుగమమైందని అంటున్నారు. అయితే హైకోర్టు తీర్పుపై ఎంపీ మిథున్ రెడ్డి సుప్రీంకోర్టులో అప్పీలు చేశారు. కానీ, సుప్రీంలో విచారణకు రాకముందే మిథున్ రెడ్డిని అరెస్టు చేయాలని ప్రభుత్వ పెద్దలు ఆదేశించినట్లు జరుగుతున్న ప్రచారం రాజకీయంగా ఆసక్తి రేపుతోంది.

ఏపీ లిక్కర్ స్కాంలో సీఐడీ వేట మొదలైందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే ఈ స్కాంతో సంబంధం ఉందనే అనుమానాలు ఉన్న నేతలు, అధికారుల ఇళ్లల్లో సీఐడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటివరకు ఎవరినీ అరెస్టు చేయకపోయినా, అరెస్టు భయంతో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి, మాజీ ఐటీ సలహాదారు రాజ్ కసిరెడ్డి ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. అదే సమయంలో ఈ కేసులో ఆరోపణలు ఉన్న వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి అప్రూవర్ గా మారిపోయే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే లిక్కర్ స్కాంలో కర్త, కర్మ, క్రియ అంతా రాజ్ కసిరెడ్డి అంటూ విజయసాయిరెడ్డి బాంబు పేల్చారు. ఈ నేపథ్యంలో రాజ్ కసిరెడ్డికి సీఐడీ జారీ చేసిన నోటీసులపై ఆయన హైకోర్టుకు వెళ్లడం, ఆ పిటిషన్ ను హైకోర్టు కొట్టివేయడంతో ఏం జరుగుతుందా? అనే ఉత్కంఠ ఎక్కువవుతోంది. మరోవైపు ఇప్పటివరకు లిక్కర్ స్కాంలో మిథున్ రెడ్డి ప్రమేయంపై సీఐడీ ఎలాంటి ప్రకటన చేయకపోయినా, ఆయన ముందస్తు బెయిల్ కోసం కోర్టులను ఆశ్రయించడం కూడా చర్చకు తావిస్తోంది. అరెస్టు భయంతోనే ఆయన చట్టం నుంచి రక్షణ కోరుతున్నట్లు చెబుతున్నారు.

ఇక రాష్ట్రంతోపాటు హైదరాబాదులోను పలువురి ఇళ్లల్లో సోదాలు నిర్వహిస్తున్న సీఐడీ, శనివారం ఢిల్లీకి వెళ్లడం హైటెన్షన్ గా మారుతోంది. మిథున్ రెడ్డి అరెస్టు తప్ప, ఢిల్లీలో సీఐడీకి మరే పనీ లేదని అంటున్నారు. అయితే ఇంతవరకు నోటీసు ఇవ్వకుండా మిథున్ రెడ్డిని అరెస్టు చేసే అవకాశం లేదని కూడా లేదని చెబుతున్నారు. దీంతో మిథున్ రెడ్డికి నోటీసు ఇచ్చేందుకు ఢిల్లీ వెళ్లారా? లేక అరెస్టు చేయడానికా? అనేది సస్పెన్స్ గా మారింది. ప్రస్తుతం పార్టమెంటు సమావేశాలు జరుగుతున్నందున ఓ ఎంపీని అరెస్టు చేయడం అంత సులువు కాదని టాక్ కూడా వినిపిస్తోంది. పార్లమెంటు సమావేశాల్లో ఉన్న ఎంపీని అరెస్టు చేయాలంటే ముందస్తుగా స్పీకర్ అనుమతి తీసుకోవాలనే వాదన కూడా వినిపిస్తోంది. దీంతో సీఐడీ ఢిల్లీ టూరుపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. శని, ఆదివారాల్లో సెలవు కావడంతో అరెస్టు చేసినా, కోర్టుకు వెళ్లడం కుదరదనే ఆలోచన వైసీపీని భయపెడుతోంది. దీంతో వచ్చే 36 గంటల్లో ఏం జరగనుందనేది ఉత్కంఠ రేపుతోంది.

Tags:    

Similar News