కొణతాల మంత్రి కోరిక తీరేనా ?

ఇక ఈ ఏడాది మధ్యలో మంత్రి వర్గ విస్తరణ జరుగుతుందని ప్రచారం అయితే గట్టిగానే ఉంది. దాంతో అనకాపల్లి జిల్లా నుంచి కొణతాల రామక్రిష్ణకు జనసేన కోటాలో మంత్రి పదవి ఖాయమని ప్రచారం అయితే ఉంది.;

Update: 2026-02-14 03:48 GMT

జనసేనలో సీనియర్ మోస్ట్ లీడర్లలో అనకాపల్లి జిల్లాకు చెందిన కొణతాల రామకృష్ణ ఒకరు. ఆయన 1989 లోనే తొలిసారి ఎంపీగా కాంగ్రెస్ నుంచి గెలిచారు. ఆ తరువాత అదే సీటు నుంచి మరోసారి ఎంపీ అయ్యారు, ఇక 2004లో ఎమ్మెల్యే అయి ఉమ్మడి విశాఖ జిల్లాకు ఏకైక మంత్రిగా అయిదేళ్ళ పాటు ఏకచత్రాధిపత్యం గా తన హవా చాటుకున్నారు. 2009లో ఆయన ఓటమి చెందకుండా ఉండి ఉంటే రాజకీయం వేరేగా ఉండేది. ఆనాడు ఓటమితో పదిహేనేళ్ళ పాటు రాజకీయంగా ఇబ్బందులు పడాల్సి వచ్చింది. అయితేనేమి అన్నట్లుగా 2024లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆయనకు పిలిచి మరీ సీటు ఇచ్చారు. ఆ విధంగా రాజకీయ సంధ్యా సమయంలో ఆయనకు తిరిగి ఎమ్మెల్యేగా భారీ చాన్స్ దక్కింది.

మంత్రి అవుతారని :

విశాఖ జిల్లా రాజకీయాల పట్ల ఉత్తరాంధ్రా రాజకీయాల పట్ల పూర్తి అవగాహన కలిగి ఉన్న కొణతాలకు మంత్రి పదవి కచ్చితంగా దక్కుతుందని అంతా ఊహించారు. పైగా బలమైన బీసీ సామాజిక వర్గానికి చెందిన వారుగా ఆయన ఉన్నారు ఆ సామాజిక వర్గానికి ఇప్పటికి మూడు దశాబ్దాలకు పూర్వం చివరి సారిగా మంత్రి యోగం దక్కింది. మళ్ళీ ఇంతవరకూ ఆ చాన్స్ రానే లేదు. దాంతో విశాఖలో అనేక నియోజకవర్గాలలో ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రభావితం చేస్తూ వస్తున్న గవర సామాజిక వర్గానికి మంత్రి పదవి కావాలని వారంతా బలంగా కోరుకున్నారు. కానీ అది ఎందుకో కుదరలేదు.

విస్తరణలో చాన్స్ :

ఇక ఈ ఏడాది మధ్యలో మంత్రి వర్గ విస్తరణ జరుగుతుందని ప్రచారం అయితే గట్టిగానే ఉంది. దాంతో అనకాపల్లి జిల్లా నుంచి కొణతాల రామక్రిష్ణకు జనసేన కోటాలో మంత్రి పదవి ఖాయమని ప్రచారం అయితే ఉంది. ప్రస్తుతం జనసేలలో ముగ్గురికి మంత్రి పదవులు ఇచ్చారు. నాలుగవది ఇస్తే కనుక నాగబాబుకే అని గతంలో ప్రచారం సాగింది. అయితే ఒకే కులానికి ఒకే కుటుంబానికి పదవులు అన్న అపప్రద వస్తుందని జనసేన అధినాయకత్వమే వెనక్కి తగ్గిందని ప్రచారం అయితే ఉంది. దీంతో బీసీల నుంచి కీలక నేతకు మంత్రి పదవి ఇస్తే బాగుంటుంది అన్న ఆలోచన జనసేనలో ఉంది అని అంటున్నారు. పైగా ఉభయ గోదావరి జిల్లాల తరువాత ఉత్తరాంధ్రా జిల్లాలలో జనసేనకు మంచి బలం ఉంది. ఆరు ఎమ్మెల్యే సీట్లను ఇక్కడ ఆ పార్టీ గెలుచుకుంది. ఈ కారణాలతో పాటు భవిష్యత్తు రాజకీయాలను దృష్టిలో ఉంచుకుని మంత్రి పదవి కొణతాలకు ఇవ్వవచ్చు అని అంటున్నారు.

కొణతాల నోటి వెంట :

ఇదిలా ఉంటే ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ తాజాగా జరుగుతున్న బడ్జెట్ సమావేశాలలో ఏకంగా ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబం మొత్తాన్ని పొగిడేశారు. చంద్రబాబుని లోకేష్ ని మాత్రమే కాదు భువనేశ్వరిని దేవాంశ్ ని ఆఖరుకి బ్రాహ్మణిని కూడా తన పొగడ్తలతో ముంచెత్తారు ఒకే కుటుంబంలో అందరూ ప్రతిభావంతులే అని కొణతాల చెప్పుకొచ్చారు. ఈ మధ్య ఆ కుటుంబంలోని వారు అంతా వివిధ రంగాలకు సంబంధించి అవార్డులు అందుకున్నారు దానిని ప్రస్తావిస్తూ కొణతాల ఈ వ్యాఖ్యలు చేశారు ఆయన చెప్పినవి అన్నీ వాస్తవాలు అయినప్పటికీ ఇపుడే ఎందుకు ప్రస్తావించారు అన్నదే చాలా మంది చర్చించుకుంటున్న విషయం. పైగా జనసేన ఎమ్మెల్యేగా ఉంటూ టీడీపీ వారి కంటే ఎక్కువగా బాబు కుటుంబాన్ని కొణతాల పొగడడం వెనక మంత్రి పదవి కోరికలు ఉన్నాయా అన్న చర్చ కూడా సాగుతోంది. మొత్తం మీద కోణతాల ఎన్నడూ ఈ తీరున ఎవరినీ పొగడలేదని కూడా గుర్తు చేసుకుంటున్నారు.

Tags:    

Similar News