బుచ్చయ్య తాతా....కాదు అంకుల్

శాసనసభ వర్షాకాల సమావేశాలు కీలక దశకు చేరుకున్నాయి. ప్రతీ రోజూ సభలో అనేక అంశాల మీద చర్చ సాగుతోంది.;

Update: 2025-09-24 13:44 GMT

శాసనసభ వర్షాకాల సమావేశాలు కీలక దశకు చేరుకున్నాయి. ప్రతీ రోజూ సభలో అనేక అంశాల మీద చర్చ సాగుతోంది. కూటమిలోని మూడు పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు వివిధ అంశాలను ప్రస్తావిస్తూ సభ దృష్టికి తెస్తున్నారు. వాటి మీద మంత్రులు స్పందిస్తూ సానుకూలమైన హామీలు ఇస్తున్నారు. ఒక విధంగా విపక్షం వైసీపీ లేదన్న లోటు తెలియకుండా అధికార కూటమి సభ్యులే నిర్మాణాత్మకమైన పంధాలో సభలో ప్రశ్నలు సంధిస్తూ మంత్రుల నుంచి జవాబులు రాబడుతున్నారు.

తాతా అన్న లోకేష్ :

అయితే ఈ సందర్భంగా సరదాలు కూడా చోటు చేసుకుంటున్నాయి. మొత్తం సభలో సీనియర్ సభ్యుడుగా రాజమండ్రి రూరల్ కి చెందిన గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఉన్నారు. ఆయన ఈసారి సభలో ప్రొటెం స్పీకర్ గా కూడా వ్యవహరించారు. ఆయన చేనేత కార్మికుల గురించి సభలో ప్రస్తావించారు. దానికి బదులిస్తూ మంత్రి లోకేష్ బుచ్చయ్య తాతా అనడంతో సభాపతి స్థానంలో ఉన్న డిప్యూటీ స్పీకర్ రఘురామ క్రిష్ణం రాజు సరదాగానే అభ్యంతరం తెలిపారు. తాత కాదు అంకుల్ అనండి అని సూచించారు. దానికి లోకేష్ స్పందిస్తూ నేను చిన్నప్పటి నుంచి ఆయనను అలాగే పిలుస్తున్నాను అన్నారు. ఆ పిలుపులోనే చనువు గౌరవం ఉందని అన్నారు. అయినా అలా అన్నందుకు క్షమించాలి అని కూడా చెప్పారు.

అంకుల్ కే ఓకే :

అయితే తాత అని అనవద్దు అంటున్నారు గోరంట్ల అని మరోసారి రఘురామ చెప్పారు. ఆయనను అంకుల్ అని పిలవమనే థమ్స్ అప్ ని సూచిస్తున్నారు అని కూడా అన్నారు. మరో వైపు చూస్తే కనుక గోరంట్ల బుచ్చయ్య చౌదరినే అధ్యక్షుడిగా చేసి చేనేత కార్మికుల సమస్యల మీద వర్కింగ్ గ్రూప్ ని ఏర్పాటు చేస్తామని పూర్తి పరిష్కారాలు కనుగొంటామని లోకేష్ చెప్పారు.

గోరంట్లకు క్లారిటీ :

ఇదిలా ఉంటే సుదీర్ఘకాలం నుంచి ఎమ్మెల్యేగా బుచ్చయ్యచౌదరి ఉంటూ వస్తున్నారు. ఆయన ఎనిమిది సార్లు ఎమ్మెల్యే అయ్యారు. 1983 నుంచి ఆయన నెగ్గుతూనే ఉన్నారు. అయితే ఆయనకు 1994లో మాత్రం ఒకసారి మంత్రి పదవి దక్కింది. ఆ తరువాత ప్రభుత్వం మారడంతో ఆయన పదవి పోయింది. ఆయన ఎన్టీఆర్ మరణం వరకూ ఆయనతో ఉంటూ ఆ తరువాత లక్ష్మీపార్వతి వర్గం వైపు ఉన్నారు. ఆ మీదట ఆయన చంద్రబాబు వైపు వచ్చారు. అయితే ఆయనకు మంత్రి పదవి మాత్రం కలగానే ఉంది. 2024 ఎన్నికల్లో గెలిచాక తనకు గ్యారంటీగా మంత్రి పదవి అనుకున్నా దక్కలేదు. అయితే లోకేష్ తో ఆయనకు గ్యాప్ ఉందని వార్తలు కూడా ఆ మధ్య ప్రచారంలోకి వచ్చాయి.

కానీ తాజాగా అసెంబ్లీలో లోకేష్ మాట్లాడిన తీరు పెద్దలుగా గోరంట్ల అంటే తనకు ఎంతో గౌరవం అని చెబుతూ ఆయన పట్ల అభిమానం చాటుకున్న వైనంతో లోకేష్ నుంచి ఫుల్ క్లారిటీ అయితే వచ్చింది అని అంటున్నారు. సామాజిక సమీకరణల మూలంగానే ఆయనకు మంత్రి పదవి దక్కలేదు తప్ప టీడీపీ అధినాయకత్వానికి ఆయన పట్ల ఎంతో గౌరవం ప్రేమ ఉన్నాయని కూడా అందరికీ మరోసారి తెలిసి వచ్చినట్టు అయింది.

Tags:    

Similar News