ఏపీలో మూకుమ్మడి ఉప ఎన్నికలు... నిజమెంత ?
ఏపీలో మూకుమ్మడిగా ఉప ఎన్నికలు వస్తాయా. ప్రస్తుతం దీని మీదనే ప్రచారం సాగుతోంది.;
ఏపీలో మూకుమ్మడిగా ఉప ఎన్నికలు వస్తాయా. ప్రస్తుతం దీని మీదనే ప్రచారం సాగుతోంది. ఏపీలో వైసీపీ అధినేత జగన్ అరెస్ట్ అవుతారని వార్తలు వస్తున్న నేపధ్యంలో ఉప ఎన్నికలు మూకుమ్మడిగా తోసుకుని వస్తాయని అంటున్నారు. జగన్ అరెస్టుకి నిరసనగా ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు అంతా మూకుమ్మడిగా రాజీనామాలు చేస్తే దేశవ్యాప్తంగా రాజకీయంగా సంచలనం నమోదు అవుతుందని వైసీపీ భావిస్తోంది అని అంటున్నారు. అలా జరిగితే దేశం మొత్తం ఏపీ వైపు చూస్తుందని అంటున్నారు.
ఫ్లాష్ బ్యాక్ నుంచేనా :
ఇదంతా ఫ్లాష్ బ్యాక్ నుంచే తీసుకున్న స్పూర్తిగా అన్న చర్చ సాగుతోంది 2012లో జగన్ అరెస్టు అయ్యారు. ఆ తరువాత ఏపీలో ఏకంగా 17 చోట్ల ఉప ఎన్నికలు జరిగాయి. ఒకటి రెండు తప్ప మొత్తానికి మొత్తం వైసీపీ గెలుచుకుని ఒక ప్రభంజనం సృష్టించింది. ఈసారి కూడా అలాగే చేయాలని పార్టీ హైకమాండ్ అలా ఏమైనా ఆలోచిస్తోందా అనందే అంతా చర్చిస్తున్న్నారు.
అవకాశాలు ఎంతమేరకు :
అయితే ఏపీలో ఉప ఎన్నికలు అని ప్రచారం జరుగుతున్నా అలా జరిగేందుకు ఎంతమేరకు అవకాశాలు ఉన్నాయని కూడా అంతా ఆలోచిస్తున్నారు. ఏపీలో ఎన్నడూ లేనంతంగా వైసీపీ రాజకీయంగా ఇబ్బందులో ఉంది. గతంలో తీరు వేరు. ఇపుడు పరిస్థితులు వేరు అని అంటున్నారు. అపుడు వైసీపీలో జగన్ జైలుకు వెళ్ళినా నాయకత్వం కొరత లేదని అంటున్నారు. తల్లి విజయమ్మ, చెల్లెలు షర్మిలమ్మ పార్టీని జనంలో ఉంచారు. వారే ఉప ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పైగా ఆనాడు ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ ఉంది. దాంతో పాటుగా తెలుగుదేశం ప్రతిపక్షంలో ఉంది. జగన్ తొలిసారి జైలుకు వెళ్ళడంతో సానుభూతి వెల్లువలా వీచింది అని గుర్తు చేస్తున్నారు.
పటిష్టంగా కూటమి :
ఇపుడు చూస్తే ఏపీలో పటిష్టంగా కూటమి ప్రభుత్వం ఉందని అంటున్నారు. కూటమిలో మూడు పార్టీలు ఉన్నాయి. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది. వైసీపీ అధికారంలో ఉండగా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లోనే అంతా చేయి దాటిన పరిస్థితి ఉంది, ఇపుడు వైసీపీ విపక్షంలో ఉంది. పైగా జగన్ జైలులో ఉంటే కనుక ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఉప ఎన్నికలు ఎదుర్కొంటే అది కచ్చితంగా ఇబ్బంది అవుతుందని అంటున్నారు. పైగా కేవలం పదనాలుగు నెలలు మాత్రమే కూటమి అధికారంలోకి వచ్చి అయింది. సహజంగానే ఉప ఎన్నికలు అధికార పక్షానికే అడ్వాంటేజ్ గా ఉంటాయని అంటున్నారు.
బూమరాంగ్ అవుతుందా :
మరి ఏ విధంగా ప్రచారంలోకి వచ్చిందో తెలియదు కానీ మూకుమ్మడి ఉప ఎన్నికలు అంటూ వైరల్ అవుతోంది. అయితే అలా కనుక జరిగితే వైసీపీకి అది బూమరాంగ్ అవుతుందని అంటున్నారు. కూటమి పార్టీలు అన్నీ కలసికట్టుగా పనిచేసి వైసీపీని ఎక్కడికక్కడ దెబ్బ తీస్తే కనుక ఆ పార్టీ పూర్తిగా ఉనికి పోరాటం చేయాల్సి వస్తుందని అంటున్నారు. పైగా ఎమ్మెల్యేలు ఎవరూ రాజీనామాలకు సిద్ధంగా ఉంటారని కూడా చెప్పలేరని అంటున్నారు. ఒకవేళ ప్రతికూల పరిస్థితులు ఎదురై జగన్ జైలుకు వెళ్తే కనుక వైసీపీ ఎమ్మెల్యేలు సహా పార్టీలోని పెద్దలు అంతా సమిష్టిగా ముందుకు అడుగులు వేసి పార్టీని ప్రజలలోకి తీసుకుని వెళ్తేనే ఉపయోగం ఉంటుందని అంటున్నారు. అంతే కాదు ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్ళి దానిని ఇష్యూగా చేసినా పొలిటికల్ మైలేజ్ వస్తుందని అంటున్నారు. అయితే ఈ మూకుమ్మడి రాజీనామాలు ఉప ఎన్నికల ప్రచారంలో నిజమెంత ఉందో కూడా తెలియదు అని అంటున్నారు.