రెండేళ్ళ కూటమి: వర్తమానంలోకి రావాలి !
ఇదిలా ఉంటే తిరుపతి సభలో కూటమి పెద్దలు ఏమి మాట్లాడారు అన్నది ఒక్కసారి చూస్తే వైసీపీ మీద విమర్శలు గుప్పించారు.
కాలగమనంలో రెండేళ్ళు అతి చిన్నది. కానీ మానవ జీవితంలో అది గొప్పది. ఇదిలా ఉంటే ప్రజలు ప్రజాస్వామ్యంలో అయిదేళ్ళ కాల పరిమితికి ఒక పార్టీని ఎన్నుకుని అధికారం అప్పగిస్తారు. అందులో రెండేళ్ళు అంటే దాదాపుగా సగం పాలన అయినట్లే. ఎందుకంటే ఎన్నికల ఏడాది అని ఒకటి ఉంటుంది. ఆ టైం లో ఏమి చేసినా జనాలకు పెద్దగా వినిపించదు, కనిపించదు. అందువల్ల సరిగ్గా సగం పాలన ఏపీలో కూటమికి పూర్తి అయినట్లే అని భావించాలి.
ఇంకా గతంలోనే ఉంటే :
ఇదిలా ఉంటే ఏపీలో కూటమి పెద్దలు జగన్ మీద వైసీపీ మీద విమర్శలు చేస్తూ వస్తున్నారు. ఇవి ఎన్నికల ముందు కొనసాగాయి. అంతకు ముందు కూడా సాగాయి. అయితే ఆనాడు జనాలు విన్నారు, ఇపుడు పెద్దగా ఆసక్తిని కనబరచడం లేదు, దానికి రీజన్ ఏంటి అంటే జగన్ ఇపుడు అధికారంలో లేరు, కూటమి ప్రభుత్వం ఉంది. వారి వైపు అయిదు కోట్ల మంది ప్రజలు ఆశగా ఎదురుచూస్తున్నారు. అందువల్ల కూటమి పెద్దలు చెప్పాల్సింది తాము ఏమి చేశామని ఇంకా ఏమి చేయబోతున్నామని. అంతే తప్ప గత ప్రభుత్వాన్ని విమర్శిస్తూ పోతే ప్రయోజనం పెద్దగా ఉండదని గ్రహించాలి.
తిరుపతి సభలో :
ఇదిలా ఉంటే తిరుపతి సభలో కూటమి పెద్దలు ఏమి మాట్లాడారు అన్నది ఒక్కసారి చూస్తే వైసీపీ మీద విమర్శలు గుప్పించారు. చంద్రబాబు పవన్ లోకేష్ ముగ్గురూ వైసీపీ పాలన అరాచకం అన్నారు. అంతే కాదు తాము కలసి పొత్తులతో వస్తే జనాలు ఆదరించారు అన్నారు. ఇక చంద్రబాబు వైసీపీ పాలన చీకటి అంటే లోకేష్ గొడ్డలి పార్టీ అన్నారు, అదే సమయంలో పవన్ తాము రాష్ట్ర అభివృద్ధి కోసం తమ సీట్లను త్యాగం చేశామని చెప్పారు. పొత్తు వల్ల మంచి ఫలితాలు అని చెప్పారు. అయితే ఇవన్నీ గతించిన విషయాలు. జనాలు వీటిని మించి వినాలని చూస్తున్నారు అన్నదే కూటమి పెద్దలు గుర్తెరగాలని అంటున్నారు.
ఎంపీ కీలక సూచన :
ఇదిలా ఉంటే చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు అయితే సభలో మాట్లాడుతూ ప్రభుత్వ పెద్దలకు విజ్ఞప్తి అంటూ కీలక సూచనలే చేశారు. మనం అభివృద్ధి గురించి చెప్పుకుందామని ఆయన అన్నారు. కూటమి ఏమి చెప్పింది ఏమి చేసింది అన్నది ప్రజలలోకి వెళ్ళాలని ఆయన కోరారు. అదే చర్చకు రావాలని కూడా అన్నారు. విమర్శల వల్ల అసలు విషయాలు మరుగున పడతాయని అన్నారు. నిజంగా టీడీపీ ఎంపీ ఈ విధంగా సూచనలు ఇవ్వడాన్ని కూటమి పెద్దలు సానుకూలంగా పరిశీలించాలని అంటున్నారు. రాజకీయ విమర్శలు అన్నవి ఎన్నికల సమయంలోనే బాగుంటాయి. జనాలు కూడా రిసీవ్ చేసుకుంటారు. ఇక పాలనలో ఉన్న పార్టీలు ఎక్కువగా తమ ప్రభుత్వ కార్యక్రమాల గురించి చెప్పుకుంటే అవే జనంలోకి వెళ్ళి మైలేజ్ ని తెస్తాయని చెప్పక తప్పదు.
ఏపీ అంటే మరి :
ఇక ఏపీలో కూటమి రెండు విషయాలను దృష్టిలో పెట్టుకుని పాలన చేస్తోంది. అందులో ఒకటి అమరావతి రాజధాని, రెండవది పోలవరం ప్రాజెక్ట్. వీటికే ఏపీ అన్ పేరు పెట్టుకుంది. ఈ రెండూ కూడా 2029 ఎన్నికల నాటికి ఒక రూపునకు షేపునకు వస్తేనే కూటమి పట్ల జనంలో సానుకూలత వస్తుందని అంటున్నారు. అయితే అభివృద్ధిని చూసి ఓటు వేసే జనాలతో పాటు సంక్షేమాన్ని చూస్తే వారు కూడా ఉంటారు. ఏపీలో అత్యధిక శాతం మధ్యతరగతి పేదలు, వారికి సంక్షేమ పధకాలు అమలు చేసి తీరాలి. అవి కూడా కూటమి ఇచ్చిన హామీల మేరకు. సూపర్ సిక్స్ హామీలలో కొన్ని నెరవేర్చారు, ఇంకా నెరవేర్చాల్సి ఉంది.
బేరీజు వేస్తారు జనాలు :
ఇలా మొత్తం నెరవేర్చే ప్రయత్నంలో మిగిలిన కాలాన్ని కూటమి సద్వినియోగం చేసుకోవాలని కూడా హితైషులు సూచిస్తున్నారు. ఏది ఏమైనా హామీ మూన్ ఎపుడో ముగిసింది. జనాలు వెయిట్ చేసి చూసే టైం కూడా గడచి పోయింది. ఇక మూడవ ఏడాదిలో ప్రవేశిస్తున్న కూటమి ప్రభుత్వాన్ని ప్రతీ రోజూ బేరీజు వేస్తారు జనాలు, ప్రతీ నిర్ణయం మీద తమదైన తీరులో స్పందిస్తారు. సో ఇక్కడ నుంచి కూటమి ప్రయాణం మరింత సంక్లిష్టంగానే మారుతుందని అంటున్నారు. చూడాలి మరి ఎలా ముందుకు సాగుతారు అన్నది.