ప్రజలకు పింఛను.. సర్కారుకు టెన్షను..!
సామాజిక భద్రతా పింఛన్ల విషయంపై కూటమి ప్రభుత్వం సీరియస్‌గానే ఉంది. అంటే.. వైసీపీ హయాం లో అనర్హులకు పింఛన్లు ఇచ్చారని.. వీటిని తొలగించాలని భావిస్తోంది.;
సామాజిక భద్రతా పింఛన్ల విషయంపై కూటమి ప్రభుత్వం సీరియస్‌గానే ఉంది. అంటే.. వైసీపీ హయాం లో అనర్హులకు పింఛన్లు ఇచ్చారని.. వీటిని తొలగించాలని భావిస్తోంది. దీనికి సంబంధించి కొన్ని పత్రిక ల్లోనూ కథనాలు వచ్చాయి. రాష్ట్రంలో 67.2 లక్షల మందికి పింఛన్లు ఇస్తున్నారు. వీరిలో వృద్ధులు, వితం తువులు, దివ్యాంగులు ఉన్నారు. అదేసమయంలో కిడ్నీ సంబంధిత రోగులు కూడా ఉన్నారు. అయితే.. వీరిలో దాదాపు 55 వేల మందికిపైగా అనర్హులు ఉన్నారన్నది లెక్క.
గత నెలలో సదరం ద్వారా దివ్యాంగులకు మరోసారి వైద్య పరీక్షలు నిర్వహించారు. అయితే... వీరిలో లక్ష మంది వరకు పరీక్షలకు రాలేదని ప్రభుత్వం గుర్తించింది. వీరంతా నకిలీలేనని చెబుతున్నారు. వీరిని తొలగించే విషయంపై సర్కారు ఆలోచన చేస్తోంది. కానీ, ఇది అంత తేలిక కాదని మరో అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. ఇప్పటికే సామాజిక భద్రతా పింఛన్లలో రూ.15000 చొప్పున పింఛను అందుకుంటున్న దివ్యాంగుల్లో సగానికి పైగా కోత పెట్టారు.
వారంతా సర్కారుపై కస్సుబుస్సులాడుతున్నారు. ఒకసారి ఇవ్వడం అంటూ ప్రారంభమైన తర్వాత.. తీసేస్తే.. లబ్ధి పొందుతున్న వారిలో ప్రభుత్వంపై సహజంగానే వ్యతిరేకత పెరుగుతుంది. ఇప్పుడు 55 వేల మంది అనర్హులు ఉన్నారని సర్కారు భావించినా.. వారిని తొలగిస్తే.. ఇదే పరిస్థితి ఏర్పడుతుందన్నచర్చ ఉంది. అయినప్పటికీ.. అనర్హులకు పింఛను ఎందుకు ఇవ్వాలన్న ప్రశ్న దిశగా ప్రభుత్వం కార్యాచరణ రెడీ చేస్తోంది. అనర్హులను ఏరేయాలని ప్రయత్నిస్తోంది.
వైసీపీకి మేలా..
అయితే.. కూటమి ప్రభుత్వం చేస్తున్న ఈ ప్రయత్నాలను వైసీపీ నిశితంగా గమనిస్తోంది. కూటమి అనర్హు లను ఏరేయడం ప్రారంభిస్తే. వెంటనే వైసీపీ దీనిని తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నాలు చేస్తోంది. పించను దారులను తమవైపు తిప్పుకొనే అవకాశం కూడా ఉంది. ఇది కూడా.. కూటమి ప్రభుత్వం పరిశీలిస్తోంది. వైసీపీకి ఛాన్స్ ఇవ్వకుండా.. ఎలా చేయాలన్న దానిపై అధికారులు కూడా కసరత్తు చేస్తున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.