మండలిలో ఎమ్మెల్సీల ఫైట్.. సోము వీర్రాజు Vs వైసీపీ సభ్యులు

సీనియర్ నేత, బీజేపీ సభ్యుడు సోము వీర్రాజుపై వైసీపీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్సీలు దూసుకురావడంతో సభలో మిగిలిన సభ్యులు షాక్ తిన్నారు.;

Update: 2026-02-26 10:32 GMT

పెద్దల సభ శాసనమండలిలో గురువారం తీవ్ర ఉద్రిక్త పరిస్థితి చోటుచేసుకుంది. సీనియర్ నేత, బీజేపీ సభ్యుడు సోము వీర్రాజుపై వైసీపీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్సీలు దూసుకురావడంతో సభలో మిగిలిన సభ్యులు షాక్ తిన్నారు. ఈ ఊహించని పరిణామంతో చైర్మన్ మోషేన్ రాజు సైతం విస్మయానికి గురయ్యారని అంటున్నారు. దీంతో సభను కొద్దిసేపు వాయిదా వేయాల్సివచ్చిందని చెబుతున్నారు. మండలిలో వైసీపీ సభ్యుల తీరు తీవ్ర చర్చకు దారితీసింది. సీనియర్ నేత సోము వీర్రాజుపై దాడికి యత్నించారన్న సమచారం ఇటు అసెంబ్లీ లోపల బయట కూడా హాట్ టాపిక్ గా మారింది.

శాసనమండలిలో రాయలసీమ ఎత్తిపోతల పథకంపై హాట్ డిబేట్ జరిగింది. వైసీపీ సభ్యుల ప్రశ్నలకు జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు సమాధానమిచ్చారు. ఈ చర్చ పూర్తయిన తర్వాత బీజేపీ సభ్యుడు సోము వీర్రాజు మాట్లాడేందుకు నిల్చొన్నారు. అయితే మంత్రి సమాధానంపై సంతృప్తి చెందని వైసీపీ సభ్యులు అనుబంధ ప్రశ్నలు అడిగేందుకు అవకాశం ఇవ్వాలని చైర్మన్ ను కోరారు. ఇందుకు ఆయన నిరాకరించి తదుపరి ప్రశ్నపై బీజేపీ సభ్యుడు వీర్రాజుకు చాన్స్ ఇచ్చారు.

చైర్మన్ అనుమతితో సభలో మాట్లాడేందుకు సోము వీర్రాజు సమాయత్తం అవుతుండగా, వైసీపీకి చెందిన ఎమ్మెల్సీలు ఇజ్రాయెల్, పాలవలస విక్రాంత్, రమేశ్ యాదవ్ ఒక్క ఉదుటన దూసుకెళ్లారు. సోము వీర్రాజు వైపు ముగ్గురు వైసీపీ ఎమ్మెల్సీలు దూకుడుగా రావడం చూసిన మంత్రులు అనిత, గొట్టిపాటి రవి వారిని అడ్డుకున్నారని చెబుతున్నారు. తాము నిరసన చెబుతుంటే సోము వీర్రాజు మైక్ తీసుకోవడం ఏంటని వైసీపీ ఎమ్మెల్సీ ఇజ్రాయెల్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ముగ్గురు ఎమ్మెల్సీల దూకుడుతో సభలో గందరగోళం నెలకొనడంతో చైర్మన్ మోషేన్ రాజు కాసేపు సభను వాయిదా వేశారు.

ఈ పరిణామం అసెంబ్లీ లాబీల్లో తీవ్ర చర్చకు దారితీసింది. పెద్దల సభలో హుందాగా నడుచుకోవాల్సిన సభ్యులు ఇలా దురుసుగా నడుచుకోవడం ఏంటని అధికార పార్టీ నేతలు ఖండిస్తున్నారు. అయితే తాము దౌర్జన్యం చేయలేదని, అధికారపక్షం కావాలనే దుష్ప్రచారం చేస్తోందని వైసీపీ ఎమ్మెల్సీలు వివరణ ఇస్తున్నారు. అయితే సభ్యులు దుందుడుకు ప్రవర్తన వల్లే సభను వాయిదా వేశారని కూటమి ఎమ్మెల్సీలు విమర్శలు చేస్తున్నారు. మొత్తానికి ఈ సంఘటన శాసనమండలిని మరోసారి వేడెక్కించింది. ఈ బడ్జెట్ సమావేశాలు ఆరంభం నుంచి శాసనమండలి చర్చల్లో వైసీపీ సభ్యులు ప్రభుత్వంపై గట్టిగా పోరాడుతున్నారు. తాజా సంఘటనతో తమ వాదనలకు శాసనమండలిని వేదికగా చేసుకునేలా వైసీపీ గట్టిగా ప్రయత్నిస్తోందని వ్యాఖ్యానిస్తున్నారు.

Tags:    

Similar News