అదిగో పులి...భీతిల్లిన సందర్శకులు
ఇదిలా ఉంటే గత ఐదు రోజులుగా దేవీపట్నం మండలం గోదావరి తీర ప్రాంతంలో పెద్ద పులి సంచారం ఉన్నట్లు అటవీ శాఖ అధికారులు గుర్తించారు.;
అదిగో పులి అంటే ఇదిగో తోక అన్న పాత సామెత కాదు, నిజంగా పులి అక్కడో ఇక్కడో తిరుగుతోంది అన్నది అటవీ శాఖ అధికారుల పక్కా సమాచారం. పులి సంచారానికి సంబంధించి అధికారులు ఎప్పటికప్పుడు ట్రేస్ చేస్తున్నారు. అలాగే దానిని బంధించాలని చేస్తున్న ప్రయత్నాలు కూడా ఇంకా ఒక కొలిక్కి రావడం లేదు. నిన్నటికి నిన్న అటవీ శాఖ అధికారులు పెద్ద పులి ఎక్కడ ఉంది అని అన్వేషిస్తూ పోలవరం జిల్లా రంపచోడవరం నియోజకవర్గం దేవీపట్నం మండలంలో గండి పోశమ్మ ఆలయ సమీప రహదారి లో వెళ్తున్నప్పుడు ఒక్కసారిగా సిగ్నల్ రెడ్ అలర్ట్ చూపించింది. అది కదులుతూ ముందుకు వస్తున్న విధానం ఫారెస్ట్ అధికారులు గుర్తించారు. పులి వారు ఉన్న ప్రాంతానికి ఒక వంద అడుగుల ముందే వస్తున్నట్లు అంచనా వేశారు. దాంతో ఒక్కసారిగా ఫారెస్ట్ అధికారులు పరుగులు తీస్తూ వారి వాహనాలు వెనక్కి వచ్చేసిన పరిస్థితి నెలకొంది.
చిక్కుకున్న సందర్శకులు :
ఇదిలా ఉంటే దేవీపట్నం మండలం రామదుర్గం కొండ ప్రాంతంలో పెద్ద పులి సంచారం ఉన్నట్లు తాజాగా సమాచారం అందడంతో అటవీ శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. అదే సమయంలో రాజానగరం మండలానికి చెందిన సుమారు యాభై మంది సందర్శకులు విహార యాత్ర కోసం రామదుర్గం కొండకు వెళ్ళారు. అక్కడ పులి సంచారం ఉందన్న సమాచారంలో వారంతా అక్కడే చిక్కుకుపోయి భయాందోళనకు గురయ్యారు. దీంతో ఈ విషయం తెలిసిన సంబంధిత అధికారులు తక్షణం స్పందించారు. అటవీ శాఖ అధికారులు ట్రాక్టర్ల సహాయంతో ప్రత్యేక బృందాలను పంపించి అక్కడ ఉన్న సందర్శకులను సురక్షితంగా తరలించే చర్యలు చేపట్టారు. ఇలా ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ ప్రతి దశలో సమాచారాన్ని అందిస్తూ అటవీ అధికారులు సమన్వయంతో వ్యవహరిస్తున్నారు.
తిష్ట వేసిన పులి
ఇదిలా ఉంటే గత ఐదు రోజులుగా దేవీపట్నం మండలం గోదావరి తీర ప్రాంతంలో పెద్ద పులి సంచారం ఉన్నట్లు అటవీ శాఖ అధికారులు గుర్తించారు. దాంతో ప్రజలను అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. పులి సంచారం గురించి పూర్తి సమాచారం లేకుండానే రామదుర్గం కొండకు వెళ్లిన సందర్శకులు ఈ పరిస్థితిని ఎదుర్కొన్నట్లు అధికారులు చెబుతున్నారు. అటవీ ప్రాంతాలకు వెళ్లే ముందు సంబంధిత అధికారుల నుంచి సమాచారం తీసుకోవాలని కోరారు. అంతే కాదు ఒంటరిగా లేదా గుంపులుగా అటవీ ప్రాంతాలకు వెళ్లకుండా జాగ్రత్తలు పాటించాలని సూచించారు.
సవాల్ చేస్తున్న వైనం :
ఇక పెద్ద పులి చిక్కకుండా అటవీ శాఖ అధికారులకు పరీక్ష పెడుతోంది. ముఖ్యంగా కింద స్థాయి ఫారెస్ట్ అధికారులైతే దాదాపు అనేక రోజులుగా ఈ పెద్దపులి వెనకే తిరుగుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. పోలవరం జిల్లా రంపచోడవరం నియోజకవర్గం దేవీపట్నం మండలంలో ఉన్న పెద్ద పులిని పట్టుకోవాలని అధికారులు విశ్వ ప్రయత్నమే చేస్తున్నారు. దీంతో ప్రతీ రోజూ సిగ్నల్ ద్వారా ఎక్కడుందో పెద్ద పులిని తెలుసుకునేందుకు ప్రత్యేక టీం పనిచేస్తోంది. గత నలభై అయిదు రోజులుగా పెద్ద పులి విషయంలో ప్రజలు ఎంత ఇబ్బందులు పడుతున్నారో అంతకంటే ఎక్కువగానే ఫారెస్ట్ అధికారులు కూడా ఇబ్బందులు పడుతున్నారని అంటున్నారు. అయితే ప్రస్తుతం పెద్ద పులికి సంబంధించిన సిగ్నల్ సైతం క్యాచ్ కాని పరిస్థితి నెలకొందని అధికారులు అంటున్నారు. అయినా సరే పెద్ద పులిని పట్టుకుని తీరుతామని అధికారులు చెబుతున్నారు. మరి పెద్ద పులి చిక్కితేనే పోలవరం ప్రాంతంలో ప్రజలకు భయాలు తొలగిపోతాయని అంటున్నారు.