చిత్రంగా ఉందే.. ఎలా ఓడిపోయాం: బీజేపీ అంతర్మథనం
| ఏపీ స్థానిక ఎన్నికల్లో బీజేపీ ఆశించిన ఫలితాలు సాధించకపోవడంపై రాష్ట్ర నేతలు విజయవాడలో సమావేశమయ్యారు. పలువురు రాష్ట్ర, జిల్లా స్థాయి నాయకులు కూడా ఓటమి పాలవడంతో కారణాలపై చర్చించారు. క్షేత్రస్థాయిలో పార్టీ బలహీనత, కూటమి నేతలతో సమన్వయ లోపం, ఎన్నికల్లో చురుగ్గా పనిచేయకపోవడం వంటివి ఓటమికి కారణాలుగా భావిస్తున్నారు.
''కూటమిలో ఉన్నాం.. కేంద్రంలో అధికారం చలాయిస్తున్నాం. కేంద్రం నుంచి భారీఎత్తున నిధులు వచ్చేలా చేస్తున్నాం. జగన్ పాలన కంటే కూడా ఇప్పుడు మెరుగైన పాలన ఇస్తున్నాం. కేంద్ర ప్రభుత్వ పథకాలను క్షేత్రస్థాయిలో జోరుగా అమలు చేస్తున్నాం. అయినా..మనం ఎందుకు ఓడిపోయాం. చిత్రంగా ఉంది. అసలు ఏం జరిగింది? దీనికి కారణం ఏంటి?'' ఇదీ.. ఇప్పుడు ఏపీ బీజేపీ నాయకులను వేధిస్తున్న ప్రశ్న. ఈ వ్యవహారంపై చర్చించేందుకు కీలక నాయకులు తాజాగా విజయవాడ వేదికగా భేటీ అయ్యారు.అయితే.. విషయం తేల్చక పోయినా.. ఓటమిపై మాత్రం సుదీర్ఘంగా చర్చించినట్టు తెలిసింది.
ఏం జరిగింది?
ఏపీలో ఈ నెల 3న స్థానిక మునిసిపాలిటీలు, కార్పొరేషన్లలో ఎన్నికలు జరిగాయి. 5వ తేదీన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు జరిగాయి. ఆ వెంటనే ఫలితాలు కూడావచ్చేశాయి. అయితే.. కూటమి ప్రభంజనం సృష్టించి.. వైసీపీని వెనక్కి నెట్టేసినా.. కూటమిలో భాగస్వామిగా ఉన్న బీజేపీ మాత్రం ఆ మేరకు ప్రభావం చూపించలేక పోయింది. కీలక నాయకులు, ముఖ్యంగా జిల్లాలకు పార్టీ అధ్యక్షులుగా ఉన్నవారు కూడా.. వార్డు మెంబర్లుగా గెలవలేక పోయారు. అంతేకాదు.. మూడు దశాబ్దాలుగా కాషాయ జెండాను మోస్తున్న వారు కూడా.. ఈ ఎన్నికల్లో పిల్లిమొగ్గలు వేశారు. దీంతో అసలు ఏం జరిగిందన్న విషయంపై పార్టీ అధిష్టానం నివేదిక కోరింది. దీంతో నాయకులు చర్చలు ప్రారంభించారు.
ఓడిన వారిలో..
బీజేపీ తరఫున పోటీ చేసి ఓడిన వారిలో కీలక నాయకులు, రాష్ట్రస్థాయి, జిల్లా స్థాయి నేతలు కూడా ఉన్నారు. తిరుపతిలో అందరికీ తెలిసిన సామంచి శ్రీనివాస్ కార్పొరేటర్‌గా గెలవకపోగా.. మూడోస్థానంతో సరిపుచ్చుకున్నారు. ఇక్కడ కాంగ్రెస్ రెండో స్థానం దక్కించుకుం ది. మంత్రి, బీజేపీ రాష్ట్ర అగ్రనేత సత్యకుమార్ యాదవ్ ప్రాతినిధ్యం వహిస్తున్న ధర్మవరం నియోజకవర్గంలోనూ బీజేపీ అట్టర్ ఫ్లాప్ అయిం ది. ఒకే ఒక్క ఓటు తేడాతో బీజేపీ అభ్యర్థిని ఓడిపోయారు. అల్లూరిజిల్లా బీజేపీ అధ్యక్షురాలు శాంత కుమారి.. స్థానిక జిల్లా పరిషత్ ఎన్నిక ల్లో ఓడిపోయారు. విజయనగరం జిల్లా బీజేపీ అధ్యక్షురాలిగా గత పదేళ్లుగా ఉన్న రెడ్డి పావని కూడా పరాజితుల జాబితాలో చేరారు. ఇలా.. మేధావులు, ఆర్ ఎస్ ఎస్ మూలాలు కూడా ఉన్న నాయకులు కూడా ఓడిపోయారు.
ఎందుకు?
వాస్తవానికి 2024 ఎన్నికల సమయంంలో ఎనిమిది మంది ఎమ్మెల్యేలను, ముగ్గురు ఎంపీలను దక్కించుకున్న బీజేపీ.. స్థానిక ఎన్నికల విషయానికి వచ్చే సరికి అనుకున్నస్థాయిలో పోరాటం చేయకపోవడం ఒక కారణమని అంటున్నారు. అదేవిధంగా కూటమి నాయకులతో నూ సఖ్యతను ప్రదర్శించడంలోనూ.. క్షేత్రస్థాయి నాయకులతో కలివిడి ముందుకు సాగకపోవడం వంటివి కూడా తాజా ఎన్నికల్లో ప్రభావం చూపించాయని తెలుస్తోంది. ఈ అంశాలపైనే ఇప్పుడు బీజేపీ రాష్ట్రస్థాయి నాయకత్వం దృష్టి పెట్టింది. మరి తప్పులు సరిచేసుకుంటారో.. లేదో చూడాలి.