మరో వారమే మున్సిపల్ చైర్మన్లు, మేయర్లు.. ప్రభుత్వం కీలక నిర్ణయం

ఏపీలో పట్టణ, నగర పాలక సంస్థల పాలకవర్గాల విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.;

Update: 2026-03-11 17:30 GMT

ఏపీలో పట్టణ, నగర పాలక సంస్థల పాలకవర్గాల విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మరో వారం రోజుల్లో అంటే ఈ నెల 17తో ఆయా సంస్థల 5 ఏళ్ల పదవీకాలం పూర్తి కానుంది. దీంతో ప్రస్తుతం ఉన్న పాలకవర్గాల స్థానంలో మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు ప్రత్యేకాధికారులను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో మరో వారం రోజుల్లో రాష్ట్రంలో దాదాపు 90 శాతం పట్టణ సంస్థలు ప్రత్యేకాధికారుల పాలన కిందకు వెళ్లిపోనున్నాయి. కార్పొరేషన్లకు ఐఏఎస్ స్థాయి అధికారులను మున్సిపాలిటీలకు ఆర్డీవో కేడర్ అధికారులను ప్రత్యేకాధికారులుగా ప్రభుత్వం నియమించింది.

రాష్ట్రంలో 75 మున్సిపాలిటీలు, నగర పంచాయతీలతో పాటు 11 కార్పొరేషన్లకు ప్రభుత్వం స్పెషల్ ఆఫీసర్లను నియమించింది. వీరంతా ఈ నెల 18న ఆయా పట్టణ సంస్థల బాధ్యతలు స్వీకరించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, ఒంగోలు, తిరుపతి, కడప, కర్నూలు, అనంతపురం కార్పొరేషన్లకు ఐఏఎస్ అధికారులు స్పెషల్ ఆఫీసర్లుగా వ్యవహరిస్తారు. మళ్లీ ఎన్నికలు జరిగి మేయర్లు బాధ్యతలు స్వీకరించేవరకు వీరంతా ఆయా బాధ్యతలు చూడాల్సివుంటుందని ప్రభుత్వం స్పష్టం చేసింది.

కాగా, ప్రస్తుతం పాలకవర్గం లేని కాకినాడ కార్పొరేషనులో స్పెషల్ ఆఫీసర్ పాలనను మరో ఆరు నెలలు పొడిగించారు. అదేవిధంగా పెద్దాపురం, జగ్గయ్యపేట మున్సిపాలిటీల స్థాయిని గ్రేడ్-2 నుంచి స్పెషల్ గ్రేడ్ కి పెంచారు. ఇక ఏలూరు కార్పొరేషన్ కు జులై 29 వరకు గడువు ఉండటంతో స్పెషల్ ఆఫీసర్ ను నియమించలేదు. అదేవిధంగా నెల్లూరు కార్పొరేషన్ తో పాటు కుప్పం వంటి మున్సిపాలిటీలకు నవంబరు 21 వరకు గడువు ఉంది. దీంతో వాటికి ప్రత్యేకాధికారులను నియమించలేదు. ఇక గతంలో ఎన్నికలు జరగని 23 మున్సిపాలిటీలకు ప్రస్తుతం ఉన్న స్పెషల్ ఆఫీసర్లనే కొనసాగిస్తూ ఆదేశాలు జారీ చేశారు.

ఇక పట్టణ పాలక వర్గాల పదవీ కాలం ముగియడంతో ఆయా సంస్థల్లో కుర్చీలను వైసీపీ నేతలు వీడాల్సివుంటుందని అంటున్నారు. 2021లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ఒక్క తాడిపత్రి మినహా రాష్ట్రంలో మిగిలిన అన్ని నియోజకవర్గాలను వైసీపీ గెలుచుకుంది. గత అసెంబ్లీ ఎన్నికల తర్వాత కొన్ని చోట్ల రాజకీయ పరిస్థితులు మారడం, కౌన్సిలర్లు పార్టీ ఫిరాయించడంతో టీడీపీ నేతలు ఆయా మున్సిపాలిటీలను కైవసం చేసుకున్నారు. అయినప్పటికీ ఇప్పటికీ 90 శాతం మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో వైసీపీ నేతలే చైర్మన్లు, మేయర్లుగా చెలామణి అవుతున్నారు. పదవీ కాలం పూర్తి కావడంతో వీరంతా మాజీలు అవుతున్నారు.

Tags:    

Similar News