ఏపీ మద్యం కేసు నిందితులు మరో 2 వారాలు రిమాండ్ లోనే..చెవిరెడ్డికి చెక్

ఆంధ్రప్రదేశ్ లో ఇటీవలి వరకు సంచలనం రేకెత్తించింది మద్యం కేసు.. ఏకంగా గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలోని పెద్దలనే టార్గెట్ చేసింది ప్రస్తుత కూటమి సర్కారు.;

Update: 2025-06-17 10:52 GMT

ఆంధ్రప్రదేశ్ లో ఇటీవలి వరకు సంచలనం రేకెత్తించింది మద్యం కేసు.. ఏకంగా గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలోని పెద్దలనే టార్గెట్ చేసింది ప్రస్తుత కూటమి సర్కారు. దీంట్లో భాగంగా ఒక్కొక్కరిని అరెస్టు చేస్తూ వెళ్లింది. నిందితులుగా పేర్కొన్న కొందరు సుప్రీంకోర్టు వరకు వెళ్లినా వారికి ముందస్తు బెయిల్ లభించలేదు. దీంతో గత నెలలో పలువురిని అరెస్టు చేసింది. అలా ఇప్పటివరకు అరెస్టు చేసిన ఏడుగురు రిమాండ్ లో ఉన్నారు.

వీరిలో గత ప్రభుత్వంలో నంబర్ 2గా వ్యవహరించిన ఐఏఎస్ అధికారి ధనుంజయరెడ్డి కూడా ఉండడం గమనార్హం. వికాట్ గ్రూప్ సంస్థ డైరెక్టర్లలో ఒకరైన బాలాజీ గోవిందప్ప, మాజీ సీఎం వైఎస్ జగన్ ఓఎస్డీగా వ్యవహరించిన క్రిష్ణమోహన్ రెడ్డితో పాటు రాజ్ కసిరెడ్డి, చాణక్య, దిలీప్, శ్రీధర్ ఉన్నారు. చివరగా ధనుంజయరెడ్డి, క్రిష్ణమోహన్ రెడ్డిలను ప్రభుత్వం అరెస్టు చేసింది. తాజగా వీరికి మరో రెండు వారాలు (జూలై 1 వరకు) రిమాండ్ ను పొడిగించింది విజయవాడ ఏసీబీ కోర్టు. దీంతో వీరందరినీ విజయవాడ జిల్లా జైలుకు తరలించారు.

కాగా, మద్యం విధానం కేసులోనే చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డిపై ఏపీ సిట్ ఇప్పటికే లుక్ ఔట్ నోటీసు జారీ చేసింది. దీంతో ఆయనను మంగళవారం బెంగళూరు ఎయిర్ పోర్టులో పోలీసులు అడ్డుకున్నారు. చెవిరెడ్డి బెంగళూరు ఎయిర్ పోర్టుకు వస్తున్న సమాచారం అందడంతో అక్కడ అడ్డుకున్నారు. ఆయనను విజయవాడ సిట్ కార్యాలయానికి తీసుకెళ్తారని చెబుతున్నారు. మద్యం కుంభకోణంలో తన ప్రస్తావనపై చెవిరెడ్డి ఇప్పటికే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మద్యం అంటేనే అసహ్యించుకునే.. ఆ వ్యాపారాన్నే సహించని తనపై ఇలాంటి నిందలు వేయడం పట్ల మండిపడుతున్నారు. మరోవైపు మద్యం కేసులో ఏపీ సిట్ విచారణను వేగం చేస్తోంది. అదనపు సమాచారం ఆధారంగా ఇటీవల తిరుపతి వెళ్లింది. సిట్ టీమ్ తిరుపతిలోనే ఉందని చెబుతున్నారు. చెవిరెడ్డి పాత్రపై ఆరా తీసేందుకే ఇలా చేస్తోందని తెలుస్తోంది. ఈ క్రమంలోనే చెవిరెడ్డి గన్ మన్ గా పనిచేసిన వ్యక్తికి విచారించారు. ఆయన సన్నిహితులపైనా నిఘా పెట్టారు. ఇలాంటి సమయంలో ఆయనను బెంగళూరు విమానాశ్రయంలో అడ్డుకోవడం గమనార్హం.

Tags:    

Similar News