ఏడాది పాలన.. చంద్రబాబుకు మంత్రుల గిఫ్ట్!
ఇక, తాజాగా ఏర్పడి 4.0 ప్రభుత్వంపై ప్రజలకు చాలానే ఆశలు ఉన్నాయి. దీంతో మరింతగా ఎక్కువగా శ్రమించాల్సిన అవసరం ఉందనేది సీఎంగా చంద్రబాబు పదే పదే చెబుతున్న మాట.;
ఏపీలో కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తయింది. ఈ క్రమంలో చంద్రబాబు ప్రజలకు `తల్లికి వందనం` పేరుతో గిఫ్టు ప్రక టించారు. ఇది సూపర్ సిక్స్ హామీల్లో కీలకమైంది. ఇదిలావుంటే.. టీడీపీకి చెందిన మంత్రులు కూడా చంద్రబాబు పెద్ద ఎత్తున గిఫ్టులు ఇచ్చారు. అయితే.. ఇవి అలాంటి ఇలాంటి గిఫ్టులు కావు. చంద్రబాబు కూడా.. సాధారణ గిఫ్టులు ఇచ్చేస్తే సంతసించే టైపు కూడా కాదు. ఆయన పనిరాక్షసుడనే పేరు తెచ్చుకున్నారు. ఈ క్రమంలో చంద్రబాబును మెప్పించాలన్నా.. మంత్రులు ఒప్పించాలన్నా.. ఆయనకు ఆయన శైలిలోనే గిఫ్టులు ఇవ్వాలి.
మంత్రులు తాజాగా ఈ గిఫ్టులనే ఇచ్చారు. గత ఏడాది కాలంగా.. మంత్రులు తమ తమ శాఖల ద్వారా చేసిన పనులను ఓ నివేదిక రూపంలో గుదిగుచ్చి.. చంద్రబాబుకు కానుకగా ఇచ్చారు. ``ఏడాది కాలంలో మీరు చూపిన బాటలో నడిచాం. మీ ఆకాంక్షలకు, ఆశయాలకు అనుగుణంగా పనిచేశాం. ఇదీ..మేం చేసిన పనులు`` అంటూ.. మంత్రులు తమ తమ నివేదికలను సీఎంవోకు అందించారు. తద్వారా చంద్రబాబు మనసు చూరగొనే ప్రయత్నాలు చేశారు. సహజంగానే చంద్రబాబు తాను పనిచేస్తూ.. తన తోటివారిని కూడా రుద్దుతారన్న పేరుంది. వారిలో అధికారులు కూడా ఉంటారు.
ఇక, తాజాగా ఏర్పడి 4.0 ప్రభుత్వంపై ప్రజలకు చాలానే ఆశలు ఉన్నాయి. దీంతో మరింతగా ఎక్కువగా శ్రమించాల్సిన అవసరం ఉందనేది సీఎంగా చంద్రబాబు పదే పదే చెబుతున్న మాట. అంతేకాదు.. ఏమాత్రం లైట్ తీసుకున్నా.. ప్రజలు కనిపెడుతూనే ఉంటారని.. తరచుగా ఆయన మంత్రులకు చెబుతున్నారు. కొన్నాళ్ల కిందట మంత్రుల గ్రాఫ్‌ను కూడా ఆయన వివరించారు. ఈ నేపథ్యంలోనే మంత్రులు తమ తమ శాఖలకు సంబంధించి ఏడాది కాలంలో చేపట్టిన పనులను, ప్రభుత్వం ద్వారా తీసుకున్న నిధులను వాటిని ఏయే కార్యక్రమాలకు ఎలా పంపిణీ చేసింది సమగ్రంగా వివరిస్తూ.. పీడీఎఫ్‌లు, హార్డ్ కాపీల రూపంలో ముఖ్యమంత్రి కార్యాలయానికి పంపించారు.
దీనిపై శ్రీకాకుళానికి చెందిన మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. ``ఏడాది పాలనలో ఎన్నోచేశాం. అయితే.. మాది మాటల ప్రభుత్వం కాదు. చేతల ప్రభుత్వం అందుకే నివేదికల రూపంలో సీఎంకు పంపించాం. మా ముఖ్యమంత్రి మాటలకు సంతృప్తి పడే వ్యక్తికాదు. ఆయన పనిచేస్తూ.. మాతో చేయిస్తున్నారు. అందుకే.. ఏడాది కాలంలో మేం ఏచేశామన్నది.. ఆయనకు నివేదికలరూపంలో ఇచ్చాం. దీనిని ప్రభుత్వ వార్షికోత్సవ గిఫ్టుగా మా మిత్రులు చెబుతున్నారు`` అని వ్యాఖ్యానించారు. మరి దీనిపై చంద్రబాబు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.