పురుషులకు 'చోటివ్వని' ఉచిత బస్సు!
మొత్తంగా ఈ పథకం అమలు ప్రారంభమై.. శనివారం నాటికి 9 రోజులు అయింది. ఈ 9 రోజల్లో ఆర్టీసీలో ఎంత మంది ప్రయాణించారు..?;
ఏపీలో మహిళల కోసం కూటమి ప్రభుత్వం `స్త్రీ శక్తి` పేరుతో ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణ సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చింది. గత ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికలకు ముందు టీడీపీ అధినేత చంద్ర బాబు తాము .. అధికారంలోకి వస్తే మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చారు. దీనిని సూపర్-6 హామీల్లోనూ చేర్చారు. ఇచ్చిన మాట ప్రకారం.. ప్రభుత్వం ఏర్పడిన 15 మాసాల్లో ఆగస్టు 15 79వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని గత శుక్రవారం దీనిని ప్రారంభించారు.
మొత్తంగా ఈ పథకం అమలు ప్రారంభమై.. శనివారం నాటికి 9 రోజులు అయింది. ఈ 9 రోజల్లో ఆర్టీసీలో ఎంత మంది ప్రయాణించారు..?, మహిళా ప్రయాణికుల నుంచి వస్తున్న ఆదరణ ఎంత? అనే విషయా లపై ఆర్టీసీ అధికారులు తాజాగా కొన్ని గణాంకాలను వెలువరించారు. దీనిలో ప్రధానంగా ఈ ఉచిత ప్రయాణాన్ని వినియోగించుకునే మహిళల శాతం పెరిగింది. తొలి రెండు రోజుల్లోనే 3 లక్షల మంది మహిళలు ప్రయాణించారు. ఆతర్వాత.. రోజు రోజుకు వీరి సంఖ్య పెరుగుతూ వచ్చింది.
ఇక, ఇప్పుడు మరింతగా పెరిగిందని ఆర్టీసీ అధికారులు వెలువరించిన గణాంకాల్లో స్పష్టంగా తెలుస్తోంది. అయితే.. మహిళల శాతం పెరగడంతో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే పురుషుల శాతం తగ్గుముఖం పట్టిన ట్టు అధికారులు పేర్కొన్నారు. ఈ పథకం ప్రారంభం కాక ముందు.. 40 శాతం పురుషులు ఆర్టీసీ బస్సులలో ప్రయాణాలు సాగిస్తుండగా.. వీరు దాదాపు సగానికి పైగా తగ్గుముఖం పట్టినట్టు అధికారులు గుర్తించారు. అదేసమయంలో అప్పటి వరకు 60 శాతంగా ఉన్న మహిళలు.. 85 శాతానికి పెరిగినట్టు తెలిపారు.
ఇలా.. ఉచిత బస్సుల్లో మహిళలు పెరగడంతో పురుషుల సంఖ్య తగ్గిందని భావిస్తున్నారు. దీనికి పలు కారణాలు కూడా విశ్లేషించారు. ఇక, ఈ 9 రోజుల్లో ఉచితంగా మహిళలు ప్రయాణించడం ద్వారా 41.22 కోట్ల బిజినెస్ జరిగినట్టు అధికారులు చెబుతున్నారు. ఇది ప్రభుత్వం నుంచి రీయింబర్స్ రూపంలో ఆర్టీసీకి చేరనుంది. అదేసమయంలో పురుషుల కంటే కూడా.. మహిళలు పెరిగిన నేపథ్యంలో 2 కోట్ల మంది వరకు ఈ సేవలను వినియోగించుకున్నట్టు తెలిపారు.
పురుషులు తగ్గడానికి కారణాలు ఇవీ..
1) అన్ని సీట్లలోనూ మహిళలే కూర్చోవడం.
2) బస్సు మొత్తంలో మహిళలే ఉండడంతో వారి మధ్య నిలబడి వెళ్లేందుకు ఇష్టపడకపోవడం.
3) మహిళల మధ్య చిన్నపాటి ఘర్షణలు కూడా తలెత్తుతుండడంతో పురుషులు ఎందుకులే అని భావించడం.