పవర్ మహిమ: పళని సారథ్యంలో పని చేస్తామన్న షా..!

ఏ మాటకు ఆ మాటే చెప్పాలి. దేశాన్ని కనుసైగతో శాసించే సత్తా ఉన్నప్పటికి.. అవసరమైన వేళ.. మెట్టు దిగటానికి అస్సలు సందేహించని తత్త్వం మోడీషాలలో కనిపిస్తూ ఉంటుంది.;

Update: 2025-04-12 04:57 GMT

ఏ మాటకు ఆ మాటే చెప్పాలి. దేశాన్ని కనుసైగతో శాసించే సత్తా ఉన్నప్పటికి.. అవసరమైన వేళ.. మెట్టు దిగటానికి అస్సలు సందేహించని తత్త్వం మోడీషాలలో కనిపిస్తూ ఉంటుంది. అవసరానికి తగ్గట్లు ఎంత అహాన్ని అయినా ప్రదర్శించే ఈ ద్వయం.. సమయం.. సందర్భానికి తగినట్లుగా తగ్గేందుకు సైతం వెనుకాడరు. అమిత్ షా లాంటి వ్యక్తి నోటి నుంచి ఒక ప్రాంతీయ పార్టీ నాయకుడి సారథ్యంలో పని చేస్తామన్న మాట అనటమా? అంటే.. అనేస్తారు. ఎందుకు అనరు. ఎంతకూ కొరుకుడుపడని దక్షిణాదిని వశం చేసుకోవటానికి ఆ మాత్రం తగ్గితే తప్పేముంది చెప్పండి?

సౌత్ మీద ఫోకస్ చేసిన కమలనాథులు.. ఒక పట్టాన కొరుకుడుపడకుండా.. తరచూ కంట్లో నలకలా ఉండే తమిళనాడును వశం చేసుకోవటానికి నాలుగు అడుగులు తగ్గేందుకు సిద్ధమయ్యారు అమిత్ షా. కూటమి కలయికతో ఏపీలో అధికారపక్షంగా అవతరించిన బీజేపీ.. ఇప్పుడు తమిళనాడు మీద ఫోకస్ చేసింది. ఏపీలో ఏ వ్యూహంతో అయితే ముందుకు వెళ్లారో.. అదే వ్యూహాన్ని తమిళనాడులోనూ అమలు చేయాలని భావిస్తోంది. నిన్నటి వరకు ఒంటరిగా పోటీ చేసేందుకు మొగ్గు చూపిన కమలనాథులు.. త్రిభాషా ఉద్యమం.. నీట్.. పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజన లాంటి అంశాల విషయంలో అధికార డీఎంకే కేంద్రంలోని మోడీ సర్కారును ఎంతలా తిప్పలు పెడుతుందో తెలిసిందే.

ఈ నేపథ్యంలో ఒంటరిపోరు వదిలి.. తమిళనాడులో ఒకప్పటి అధికారపక్షం.. ఇప్పటి విపక్షం.. తమ పాత మిత్రపక్షమైన అన్నాడీఎంకేతో చేతులు కలిపేందుకు సిద్ధమైంది. వచ్చే ఏడాది తమిళనాడు అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో తాజాగా అన్నాడీఎంకేతో బీజేపీ పొత్తును ఫైనల్ చేసుకుంది. తమ అవసరానికి ఎంతకైనా దిగే అలవాటున్న అమిత్ షా.. అందుకు తగ్గట్లే ఢిల్లీ నుంచి ప్రత్యేకంగా చెన్నైకు వచ్చి.. అన్నాడీఎంకేతో స్వయంగా చర్చలు జరిపి.. పొత్తు మాటను స్వయంగా ప్రకటించారు.

అంతేనా? ఎయిర్ పోర్టు నుంచి నేరుగా అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి ఇంటికి వెళ్లిన అమిత్ షా.. ఈపీఎస్ ఫ్యామిలీతో కలిసి తేనీరు సేవించారు. పళని సూచనకు తగ్గట్లే.. తమిళనాడులో బీజేపీకి కొత్త ఇమేజ్ కట్టబెడుతూ.. అమితమైన దూకుడును ప్రదర్శిస్తున్న ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై తన పదవికి రాజీనామా చేయగా.. పెద్దగా పరిచయం లేని తిరునల్వేలి ఎమ్మెల్యే నయినార్ నాగేంద్రన్ కు రాష్ట్ర అధ్యక్ష బాధ్యతల్ని అప్పగించారు.

సౌత్ తమిళనాడులో బలమైన సామాజిక వర్గంగా చెప్పే దేవర్ల వర్గానికి చెందిన నాగేంద్రన్ ను తాజాగా ఎంపిక చేయటం ఆసక్తికరంగా మారింది. 1989లో అన్నాడీఎంకేలో చేరి రాజకీయాల్లోకి వచ్చిన నాగేంద్రన్ 2001లో తిరునల్వేలి నుంచి అన్నాడీఎంకే ఎమ్మెల్యేగా గెలిచారు. జయ మంత్రివర్గంలోనూ చోటు దక్కించుకున్నారు. 2017లో ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన ఆయన బీజేపీలో చేరారు. ఇక.. తాజా పొత్తు ప్రకటన వెనుక కర్త.. కర్మ.. క్రియ మొత్తం తుగ్లక్ సంపాదకులు.. ఆర్ఎస్ఎస్ క్రియాశీల నాయకుడిగా పేరొందిన ప్రముఖ ఆడిటర్ గురుమూర్తితో భేటీ అయ్యాకే తాజా నిర్ణయాన్ని తీసుకున్నారు.

షెడ్యూల్ ప్రకారం శుక్రవారం సాయంత్రం 5 గంటలకు గురుమూర్తితో అమిత్ షా భేటీ ఉంది. అందుకు భిన్నంగా ఉదయం 10 గంటలకే గురుమూర్తి ఇంటికి వెళ్లిన అమిత్ షా.. ఆయనతో చర్చలు జరిపారు. అన్నాడీఎంకేతో చర్చలు ఆలస్యం చేయొద్దని.. వెంటనే కూటమి ప్రకటన చేయాలని సూచన చేశారు. దీనికి ప్రతిగా పళనిస్వామితో గంట పాటు చర్చలు జరిపి.. బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి వెళ్లి పొత్తుపై ప్రకటన చేయటం గమనార్హం.

ఈ సందర్భంగా అన్నాడీఎంకే అంతర్గత వ్యవహారాల్లో తాము జోక్యం చేసుకోమంటూనే.. పళనిస్వామి సారథ్యంలో తాము పని చేస్తామని చెప్పటం ద్వారా.. ఆయనకు తామిచ్చే ప్రాధాన్యత ఎంతన్న విషయాన్ని చెప్పేశారు. అంతేకాదు.. తమ కూటమి చేతికి అధికారం దక్కితే.. ముఖ్యమంత్రి పదవి పళనిస్వామిదేనని చెప్పేయటం ద్వారా.. అనవసరమైన కన్ఫూజన్ కు తెర దించారని చెప్పాలి. ఈ కలయికపై ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ స్పందిస్తూ.. అన్నాడీఎంకేతో బీజేపీ చేతలు కలపటం ఆహ్వానించదగ్గ పరిణామంగా పేర్కొనటం గమనార్హం. ఏమైనా.. తమిళ రాజకీయాల్లో కొత్త సమీకరణలకు అమిత్ షా తెర తీశారని చెప్పాలి.

Tags:    

Similar News