సీఈవోను హత్య చేసినోడికి బెయిల్ కోసం యూఎస్ లో ఉద్యమం
ఎందుకిలా జరుగుతుంది? దారుణానికి పాల్పడినోడికి మద్దతుగా ఇంత భారీగా సపోర్టు రావటం ఏమిటి? అతడి కోసం ఏకంగా ఆన్ లైన్ ఉద్యమాన్ని షురూ చేయటం ఏమిటి? అసలేం ఆలోచిస్తున్నారు?;
హత్య చేసినోడికి అండగా ఉండేవారు ఉంటారా? అలాంటోడి కోసం ఉద్యమాన్ని నిర్మిస్తారా? హత్య చేసినోడు సాదాసీదా వ్యక్తి కావటం.. హత్యకు గురైనోడు ఒక పెద్ద సంస్థకు సీఈవో స్థాయిలో ఉన్న వేళ.. బాధితుడి పక్షాన కాకుండా హత్యకు పాల్పడిన వ్యక్తికి బెయిల్ ఇవ్వాలంటూ ఉద్యమాన్ని చేపట్టిన వైనం దేనికి నిదర్శనం? ఇలాంటి సిత్రాలు ఏ దేశంలో బాస్? అని అడగొచ్చు. అయితే.. ఆ దేశం మరేదో కాదు. ప్రపంచానికి పెద్దన్న అమెరికా.
నిజం..తొమ్మిది నెలల క్రితం (2024 డిసెంబరు)లో అమెరికాలో అత్యంత సంపన్న ఆరోగ్య బీమా సంస్థ (యునైటెడ్ హెల్త్ కేర్) సీఈవో బ్రియాన్ థాంప్సన్ ను షూట్ చేసి చంపేశాడు లిగి మాంజియోన్ అనే యువకుడు. అంతటి దారుణానికి పాల్పడినోడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేయాల్సింది పోయి.. సదరు నిందితుడికి బెయిల్ ఇవ్వాలని పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తున్న వైనం ఇప్పుడు సంచలనంగా మారింది. మీడియాలోనూ పతాక శీర్షికల్లో ఈ డిమాండ్ కనిపించటం గమనార్హం.
ఎందుకిలా జరుగుతుంది? దారుణానికి పాల్పడినోడికి మద్దతుగా ఇంత భారీగా సపోర్టు రావటం ఏమిటి? అతడి కోసం ఏకంగా ఆన్ లైన్ ఉద్యమాన్ని షురూ చేయటం ఏమిటి? అసలేం ఆలోచిస్తున్నారు? మరేం జరుగుతుంది? అన్నది ఇప్పుడు పెద్ద చర్చగా మారింది. దీనిపై సైకాలజీ ఆఫ్ వయలెన్స్ జర్నల్ లో ప్రత్యేకంగా ఒక ఎడిషన్ ను తీసుకొచ్చారు. అమెరికాలో సాగుతున్న ఉద్యమం మీద జరిపిన పరిశోధనలో తాము గుర్తించిన అంశాలతో ఈ జర్నల్ ను తీసుకొచ్చారు.
పని ప్రదేశంలో విపరీతమైన ఒత్తిడి.. మానసిక అలసట పెరిగి.. చివరకు భయం.. బాధ.. అసహనం కట్టలు తెంచుకోవటం.. తమకు అదే పనిగా అన్యాయం జరిగిపోతుందన్న భావనతోనే ఈ తరహా ఉదంతాలు చోటు చేసుకుంటున్నట్లుగా చెబుతున్నారు. అన్యాయాన్ని అంతం చేసేందుకు హింసే అత్యుత్తమ మార్గంగా భావించటంలో భాగమే ఈ తరహా ఉద్యమాలుగా చెబుతున్నారు.
మరో సిద్ధాంతం ప్రకారం.. అతి పనితో విసిగిన సందర్భాల్లో ప్రతికూల ఆలోచనలు వెల్లువెత్తుతాయని.. ఇది కూడా ఆందోళనకు కారణంగా చెబుతున్నారు. మూడో సిద్ధాంతంలో తామెంత కష్టపడుతున్నా సరైన ప్రాధాన్యత లేకపోవటం.. తమ శ్రమకు తగ్గ ఫలితం లభించని వేళ.. తమకు నచ్చిన మార్గంలో నడిచేందుకు వీలుగా హింసాత్మక ఆలోచనలకు జై కొట్టే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. ఈ తరహా పెడపోకడల విషయంలో అంతర్జాతీయ సంస్థలు తక్షణమే స్పందించి.. దిద్దుబాటు చర్యలు చేపట్టకపోతే.. అరాచకం మరింత ప్రబలిపోయే ప్రమాదం ఉంది.
మానసిక అలసటకు గురైన వారంతా హింసాత్మక మార్గంలో నడుస్తారని చెప్పలేం. కానీ.. ఆ దిశగా నడిచే అవకాశం ఉందన్నది తాజా ఉదంతం స్పష్టం చేస్తుందని చెబుతున్నారు. అధిక పనిఒత్తిడితో మానసిక అలసటకు గురి కావటం.. చాలామందిలో అసహనం పెరిగిపోతుందని చెబుతున్నారు. ఇదే విధ్వంసకర ఆలోచనలకు అవకాశాన్ని ఇస్తుందని చెబుతున్నారు. ఏమైనా.. పని వాతావరణంతో పాటు.. పని ఒత్తిడిపై వ్యవస్థలు మరింత జాగ్రత్తగా ప్లాన్ చేయాల్సిన అవసరం ఉందంటున్నారు. లేకుంటే.. ఈ తరహా విధ్వంకర వాతావరణం మరింత పెరిగే ప్రమాదం ఉంది. తస్మాత్ జాగ్రత్త.