జగన్ సత్తెనపల్లి టూర్ - మాజీ మంత్రి అంబటి అరెస్టుకు రంగం సిద్ధం?

కూటమి ప్రభుత్వంపై రాజీ లేని పోరాటం చేస్తున్న వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి.;

Update: 2025-06-19 06:50 GMT

కూటమి ప్రభుత్వంపై రాజీ లేని పోరాటం చేస్తున్న వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. దీంతో ఆయనను అరెస్టు చేసే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. మాజీ ముఖ్యమంత్రి జగన్ పర్యటన సందర్భంగా సత్తెనపల్లి నియోజకవర్గంలో చోటుచేసుకున్న ఉద్రిక్తతలకు మాజీ మంత్రి అంబటిని బాధ్యుడిని చేస్తూ పోలీసులు కేసులు నమోదు చేశారు. బుధవారం సత్తెనపల్లి నియోజకవర్గం రెంటపాళ్లలో జగన్ పర్యటించారు. అయితే కేవలం వంద మందితో మాత్రమే కార్యక్రమం నిర్వహణకు పోలీసులు అనుమతించారు. కానీ వేలాదిగా వైసీపీ శ్రేణులు తరలివచ్చాయి. అంతేకాకుండా పోలీసులు ఏర్పాటు చేసిన చెక్ పోస్టులను వైసీపీ శ్రేణులు తొలగించాయి. దీనికి కారణం అంబటి అంటూ పోలీసులు కేసులు నమోదు చేశారు.

మాజీ మంత్రి అంబటి సొంత నియోజకవర్గం సత్తెనపల్లి. 2019లో ఆయన సత్తెనపల్లి నుంచి పోటీ చేసి గెలిచారు. 2024 ఎన్నికల్లో ఓడిపోయారు. అయితే ప్రస్తుతం ఆయన బదులుగా గజ్జల సుధీర్ భార్గవ్ రెడ్డిని ప్రస్తుతం సమన్వయకర్తగా వైసీపీ నియమించింది. అదే సమయంలో అంబటిని గుంటూరు జిల్లా అధ్యక్ష పదవి అప్పగించింది. సత్తెనపల్లి పల్నాడు జిల్లాలో ఉన్నప్పటికీ అంబటికి నియోజకవర్గంలో ఉన్న అనుబంధంతో ఆయన ఇక్కడ రాజకీయంగా యాక్టివ్ గానే ఉన్నారు. దీంతో జగన్ పర్యటన విజయవంతం చేసే బాధ్యత తీసుకున్నారు. జగన్ పర్యటనపై పోలీసులు ఆంక్షలు విధించడంతో అంబటి ముందుండి పార్టీ శ్రేణులను నడిపించారు.

పోలీసులు ఏర్పాటు చేసిన చెక్ పోస్టును అంబటితోపాటు మిగిలిన వైసీపీ నేతలు తొలగించిన ఫొటోలు బుధవారం వైరల్ అయ్యాయి. ఈ సందర్భంగా అంబటి పోలీసులతో వాగ్వాదానికి దిగినట్లు వీడియోల్లో ఉంది. దీంతో ఆయనపై కేసులు నమోదు చేశారు. నాన్ బెయిలబుల్ సెక్షన్లు చేర్చడంతో మాజీ మంత్రిని అరెస్టు చేస్తారా? అన్న చర్చ మొదలైంది. సెక్షన్ 188, 332, 353, 427 సెక్షన్ల కింద అంబటిపై కేసు నమోదు చేయడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. ఇప్పటికే కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా అంబటి న్యాయపోరాటం చేస్తున్నారు. తన కేసులను తనే వాదించుకుంటున్నారు. ఇప్పటివరకు ఆయన పలు ప్రైవేటు కేసులు వేశారు.

మరోవైపు కూటమి ప్రభుత్వం వచ్చిన నుంచి వైసీపీలో అంబటి మాత్రమే ఇన్నాళ్లు సేఫ్ గా కనిపించారు. ఏడాదిగా ఎంతో మంది వైసీపీ నేతలు కేసుల్లో ఇరుకున్నా, అంబటిపై మాత్రం ఇప్పటివరకు ఎలాంటి కేసు వెలుగు చూడలేదు. ఆయన రాజకీయ విమర్శలు చేయడాన్ని ప్రభుత్వం కూడా సీరియస్ గా తీసుకోవడం లేదంటున్నారు. కానీ, బుధవారం జరిగిన సంఘటనతో పోలీసు విధులకు ఆటంకం కలిగించనందునే కేసు నమోదు చేసినట్లు చెబుతున్నారు. మొత్తానికి ఏదో రూపంలో అరెస్టు అవుతున్న నేతల జాబితాలో అంబటి పేరు చేరిందని అంటున్నారు. అయితే ప్రస్తుతానికి కేసులు నమోదు చేసిన పోలీసులు అంబటిని అరెస్టు చేసి రిమాండుకు తరలించే అవకాశాలు ఉన్నాయా? లేదా? అన్నది మాత్రం స్పష్టం కావడం లేదు. గతంలో కూడా టీడీపీ ప్రతిపక్షంలో ఉండగా, ఇలాంటి ఘటనలు జరిగాయి. అప్పుడు ఎవరిని జైలుకు పంపిన ఉదంతం లేకపోవడంతో అంబటికి స్టేషన్ బెయిలు ఇచ్చి వదిలేస్తారన్న చర్చ కూడా జరుగుతోంది. మొత్తానికి అంబటిపై కేసు రాజకీయంగా పెద్ద చర్చకు తెరలేపింది.

Tags:    

Similar News