అంబ‌టి నిరాహార దీక్ష‌.. సొంత ష‌ర‌తులు!

ఆశ్చ‌ర్యంగా అనిపించినా.. నిజ‌మే. వైసీపీ కీల‌క నాయ‌కుడు, మాజీ మంత్రి అంబ‌టి రాంబాబు ఈ నెల 18న నిరాహార దీక్ష‌కు దిగుతున్న‌ట్టు ప్ర‌క‌టించారు.;

Update: 2026-04-17 12:34 GMT

ఆశ్చ‌ర్యంగా అనిపించినా.. నిజ‌మే. వైసీపీ కీల‌క నాయ‌కుడు, మాజీ మంత్రి అంబ‌టి రాంబాబు ఈ నెల 18న నిరాహార దీక్ష‌కు దిగుతున్న‌ట్టు ప్ర‌క‌టించారు. అయితే.. ఇలాంటి దీక్ష‌ల‌కు స‌హ‌జంగా ఎలాంటి ష‌ర‌తులైనా ప్ర‌భుత్వం లేదా పోలీసులు పెడ‌తాయి. నిరాహార దీక్ష చేసే వారిని పోలీసులు అరెస్టు చేయ‌డం లేదా.. వ‌ద్ద‌ని వారించ‌డం వంటివి ఉంటాయి. ఇవి స‌హ‌జం కూడా.

అయితే.. అంబ‌టి ఈ విష‌యంలో ఏమ‌నుకున్నారో .. ఏమో త‌న దీక్ష‌కు తానే కొన్ని ష‌ర‌తులు విధించుకున్నారు. ఉద‌యం 8 నుంచి సాయంత్రం 7 గంట‌ల వ‌ర‌కు 12 గంట‌లు మాత్ర‌మే దీక్ష చేస్తాన‌ని చెప్పారు. అదేస‌మ‌యంలో త‌న దీక్ష‌కు కేవ‌లం ఐదుగురు మాత్ర‌మే త‌న అనుచ‌రులు సంఘీభావంగా కూర్చుంటార‌ని తెలిపారు. ఎలాంటి ఆందోళ‌న‌లు చేసేది లేద‌ని, నినాదాలు కూడా ఉండ‌బోవ‌ని వెల్ల‌డించారు. ఇందంతా శాంతియుత దీక్ష‌గా ఆయ‌న పేర్కొన్నారు.

ఎందుకీ దీక్ష‌?

ఇటీవ‌ల కొన్నాళ్ల కింద‌ట‌.. సీఎం చంద్ర‌బాబు మాతృమూర్తిపై అంబ‌టి తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. త‌ర్వాత క్ష‌మాప‌ణ‌లు చెప్పారు. అయిన‌ప్ప‌టికీ.. టీడీపీ నాయ‌కులు ఇచ్చిన ఫిర్యాదుల‌తో పోలీసులు ఆయ‌న‌ను అరెస్టు చేయ‌డం.. జైలుకు త‌ర‌లించ‌డం తెలిసిందే. ఆ త‌ర్వాత బెయిల్‌పై అంబ‌టి బ‌య‌ట‌కు వ‌చ్చారు. అయితే.. పోలీసులు త‌న‌ను అరెస్టు చేసిన‌ప్పుడు.. స్టేష‌న్‌లో హింస‌కు గురి చేసే ప్ర‌య‌త్నం చేశార‌న్న‌ది అంబ‌టి ఆరోప‌ణ‌.

పోలీసులు త‌న‌ను నేల‌పై కూర్చోబెట్టి కాళ్లు రెండూ పంగ చీల్చే ప్ర‌య‌త్నం చేసి.. త‌న‌ను హించార‌ని ఆయ‌న చెబుతున్నారు. వాస్త‌వానికి ఈ విష‌యాన్ని ఆయ‌న బెయిల్పై బ‌య‌ట‌కు వ‌చ్చిన వారం రోజుల త‌ర్వాత కానీ.. చెప్ప‌లేదు. ఈ క్ర‌మంలోనే హైకోర్టులో కేసు కూడా దాఖ‌లు చేశారు. ఇప్పుడు దానికి కొన‌సాగింపుగా ఆయ‌న సొంత ష‌ర‌తుల‌తో కూడిన దీక్ష‌కు దిగుతుండ‌డం గ‌మ‌నార్హం.

Tags:    

Similar News