వెన్నుపోటు దినం ఎఫెక్ట్.. మాజీ మంత్రి అంబటిపై కేసు

గుంటూరులో నిర్వహించిన వెన్నుపోటు దినం కార్యక్రమంలో మాజీ మంత్రి అంబటి రాంబాబు పోలీసులను బెదిరించారని కేసు నమోదు చేశారు.;

Update: 2025-06-05 06:23 GMT

గుంటూరులో వైసీపీ నిర్వహించిన వెన్నుపోటు దినం కార్యక్రమం వివాదాస్పదంగా మారింది. పార్టీ పిలుపు మేరకు మాజీ మంత్రి అంబటి ఆందోళనకు సిద్ధమవగా, అనుమతి లేదని పోలీసులు అడ్డుకున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా అంబటి-పోలీసుల మధ్య జరిగిన వాగ్వాదంపై కేసు నమోదైంది. పోలీసు విధి నిర్వహణకు ఆటంకం కలిగించారనే అభియోగాలు మోపడంతో ఈ కేసులో అంబటిని అరెస్టు చేస్తారా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సాధారణంగా ధర్నాలు, ఆందోళనలు జరిగే సమయాల్లో పోలీసులు నేతలను అడ్డుకుని అరెస్టు చేస్తారు. తర్వాత స్టేషన్ బెయిల్ పై విడుదల చేస్తారు. అయితే అంబటిపై నాన్ బెయిలబుల్ సెక్షన్లు నమోదు చేశారని చెబుతుండటంతో వైసీపీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

గుంటూరులో నిర్వహించిన వెన్నుపోటు దినం కార్యక్రమంలో మాజీ మంత్రి అంబటి రాంబాబు పోలీసులను బెదిరించారని కేసు నమోదు చేశారు. ఆయనపై పట్టాభిపురం పోలీసుస్టేషన్ లో బీఎన్ఎస్ సెక్షన్ 353 కింద కేసు నమోదు చేశారు. బుధవారం నగరంలోని సిద్దార్థనగర్ లోని నివాసం నుంచి అంబటి అనుచరులతో కలిసి మోటార్ సైకిళ్లపై ర్యాలీగా కలెక్టరేట్ కు బయలుదేరారు. అక్కడ పోలీసులు అడ్డుచెప్పడంతో కుందులు రోడ్డు జంక్షన్లోని వివేకానంద విగ్రహం నుంచి మళ్లీ ప్రదర్శనగా కంకరగుంట ఓవర్ బ్రిడ్జి వద్దకు చేరుకున్నారు. అక్కడా పోలీసులు అడ్డుకోవడంతో పట్టాభిపురం సీఐ గంగా వెంకటేశ్వర్లుతో అంబటి వాగ్వాదానికి దిగారు.

సీఐ-అంబటి మధ్య తీవ్రస్థాయిలో వాదులాట జరగడం, ఆ వీడియోలు వైరల్ కావడంతో ప్రభుత్వం సీరియస్ గా పరిగణించిందని చెబుతున్నారు. సీఐపై అంబటి అభ్యంతరకరంగా మాట్లాడారని పోలీసు అధికారుల సంఘం కూడా ఆగ్రహంగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. సీఐ పట్ల అంబటి దురుసుగా వ్యవహరించడంతోపాటు బెదిరించేలా పళ్లు కొరికారని, విధులకు ఆటంకం కలిగించారని కేసు నమోదు చేశారు. అంబటితోపాటు పలువురు వైసీపీ నేతలను నిందితుల జాబితాలో చేర్చడం చర్చనీయాంశమవుతోంది.

Tags:    

Similar News