‘మా కర్మ కాకపోతే ఏపీకి ప్రపంచస్థాయి రాజధాని అవసరమా?’.. వైసీపీ నేత అంబటి వ్యాఖ్యల కలకలం

వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు రాజధాని అమరావతిపై చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి.;

Update: 2025-11-29 18:00 GMT

వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు రాజధాని అమరావతిపై చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. రాజధాని అమరావతికి రెండో విడత భూసమీకరణకు వెళ్లాలని ప్రభుత్వం నిర్ణయించడాన్ని తప్పుబడుతూ మీడియాతో మాట్లాడిన అంబటి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఏపీకి ప్రపంచస్థాయి రాజధాని అవసరమా? ఢిల్లీకన్నా పెద్ద రాజధాని అవసరమేంటి? సింగపూర్ లాంటి రాజధాని కావాలని ఎవరు అడిగారు? అంటూ అంబటి లేవనెత్తిన ప్రశ్నలపై పెద్ద ఎత్తున జరుగుతోంది. అంబటి వ్యాఖ్యలు అధికార ప్రతిపక్షాల మధ్య మరో మాటల యుద్ధానికి దారితీసే పరిస్థితులు కనిపిస్తున్నాయని అంటున్నారు. అంబటి మీడియా సమావేశం వీడియోని వైసీపీ తన ఎక్స్ ఖాతాలో పోస్టు చేసింది. ఇందులో ఆయన అమరావతిపై చేసిన వ్యాఖ్యలను హైలెట్ చేస్తూ టీడీపీ సోషల్ మీడియా వైరల్ చేస్తోంది.

రాజధాని నిర్మాణానికి ప్రస్తుతం ఉన్న 54 వేల ఎకరాలకు అదనంగా మరో 16 వేల ఎకరాలను సమీకరించాలని కూటమి ప్రభుత్వం తాజాగా నిర్ణయించిన విషయం తెలిసిందే. దీనిపై శుక్రవారం కేబినెట్ సమావేశంలోనూ తీర్మానం చేశారు. అంతకుముందు రైతులతో సమావేశమైన ముఖ్యమంత్రి చంద్రబాబు రైతులతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించి వారి ఆమోదం తీసుకున్నారు. అయితే రెండో విడత సమీకరణపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ వైసీపీ వాదనను వినిపించే ప్రయత్నం చేశారు మాజీ మంత్రి అంబటి. తొలి విడతలో తీసుకున్న భూమిని అభివృద్ధి చేయకుండా రెండో విడత భూములు తీసుకోవడాన్ని వైసీపీ తీవ్రంగా తప్పుబడుతున్నట్లు అంబటి స్పష్టం చేశారు.

ఈ క్రమంలోనే రాజధాని అమరావతిని అద్భుతంగా నిర్మిస్తున్నామని చెప్పిన చంద్రబాబు.. ఇప్పుడు రెండో విడత భూమిని తీసుకుని ప్రపంచ స్థాయి నగరం నిర్మిస్తామని చెబుతున్నారని ఆరోపించారు. ఈ సందర్భంగానే ‘‘మా ఖర్మ కాకపోతే ఆంధ్రప్రదేశ్ కి ప్రపంచస్థాయి నగరం ఎందుకయ్యా స్వామీ.. ఏంటో అంత గొప్పమనం.. అంటే ఢిల్లీ కన్నా పెద్ద రాజధాని కావాలా? అంతేగా ఏంటో అంత గొప్ప మనం.. సింగపూర్ లాంటి రాజధాని, లండన్ లాంటి రాజధాని? ఏంటో సింగపూర్, లండన్ లాంటి రాజధానులను ఏం చేసుకుంటాం’’ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు అంబటి రాంబాబు.

రైతులను బెదిరించి భూములు తీసుకుంటున్నట్లు అంబటి ఆరోపించారు. భూములు ఇవ్వమని రైతులు ఎవరూ చెప్పలేని స్థితికి తీసుకువచ్చారని ధ్వజమెత్తారు. రాజధాని రైతులను కలల్లో ముంచి భూములు లాక్కుంటున్నారని అన్నారు. అయితే రైతులు ఎవరూ తమను సంప్రదించలేదని, అంబటి స్పష్టం చేశారు. రైతుల బాధలను తాము తెలియజేస్తామన్నారు. సమయం వచ్చినప్పుడు రైతులే బయటకు వస్తారని అంబటి వ్యాఖ్యానించారు. చంద్రబాబు మోసం చేస్తున్నారని తాము చెప్పినా, రైతులు నమ్మే పరిస్థితిలో లేరని.. భవిష్యత్తులో వారికే తెలుస్తుందని అన్నారు.


Tags:    

Similar News