ఆరు లక్షల ఉద్యోగాలకు ఎసరు... అమెజాన్ ప్లాన్ ఇదిగో!
ప్రముఖ ఇ-కామర్స్ సంస్థ అమెజాన్ భారీ తొలగింపులకు ప్రణాళికలు వేస్తోందని అంతర్జాతీయ మీడియాలో ఆసక్తికర కథనం పేర్కొంది.;
ప్రముఖ ఇ-కామర్స్ సంస్థ అమెజాన్ భారీ తొలగింపులకు ప్రణాళికలు వేస్తోందని అంతర్జాతీయ మీడియాలో ఆసక్తికర కథనం పేర్కొంది. ఇప్పటికే.. పీపుల్ ఎక్స్ పీరియన్స్ అండ్ టెక్నాలజీ (పీ.ఎక్స్.టి) బృందంగా అంతర్గతంగా పిలువబడే దాని మానవ వనరుల విభాగంలో సుమారు 15 శాతం వరకు సిబ్బందిని తగ్గించేందుకు కంపెనీ సన్నాహాలు చేస్తున్నట్లు చెబుతున్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో 6 లక్షల ఉద్యోగాలకు ఎసరు పెట్టనున్నట్లు తెలుస్తోంది.
అవును... ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) బూమ్ తర్వాత టెక్ దిగ్గజాలు వేగంగా పరివర్తన చెందుతున్నాయి. ఇందులో భాగంగా... వారి కార్యకలాపాలను ఆటోమేషన్ వైపు మళ్ళిస్తున్నాయి. ఏఐతో పనిచేయడం, కొన్ని మానవ ఆధారిత కార్యకలాపాలను రోబోట్ టెక్నాలజీతో భర్తీ చేయడం వంటివి కంపెనీలు మార్పును అవలంబిస్తున్న కొన్ని మార్గాలు కాగా... ఇప్పుడు అమెజాన్ కూడా రోబోలతోనే పని చేయించుకోవాలని చూస్తుందంట.
వివరాళ్లోకి వెళ్తే... 6,00,000 కంటే ఎక్కువ ఉద్యోగాలకు రోబోలను ఉపయోగించేందుకు అమెజాన్ కృషి చేస్తోందని న్యూయార్క్ టైమ్స్ ఒక నివేదికలో పేర్కొంది. 2033 నాటికి ఈ మార్పును తీసుకురావాలని కంపెనీ యోచిస్తోందట. అమెజాన్ రోబోటిక్స్ బృందం కంపెనీలోని మొత్తం కార్యకలాపాలలో సుమారు 75 శాతం ఆటోమేషన్ కు మార్చడానికి.. 2027 నాటికి భర్తీ చేయబడే 1,60,000 ఉద్యోగాలను తగ్గించడానికి కృషి చేస్తోందని కథనం పేర్కొంది.
అవసరమైన అన్ని కార్యకలాపాలు ఆటోమేటెడ్ అయినప్పుడు, కంపెనీలోని మొత్తం ఆటోమేషన్ 2025 నుండి 2027 వరకు 12.6 బిలియన్ డాలర్లకు ఆదా చేస్తుందని అంచనా వేస్తున్నారు. ఈ స్థాయిలో సాగిన న్యూయార్క్ టైమ్స్ నివేదికకు సమాధానంగా.. అమెజాన్ అధికారిక ప్రకటనలో.. లీక్ అయిన పత్రాలు వక్రీకరించిన వాస్తవాన్ని చూపిస్తున్నాయని.. వాస్తవానికి అమెజాన్ మొత్తం నియామక వ్యూహాన్ని చూపించలేదని పేర్కొంది.
ఇదే సమయంలో... ఆటోమేట్ చేయడానికి మార్గాన్ని కనుగొనడానికి అమెజాన్ కు ఉన్నంత ప్రోత్సాహం మరెవరికీ లేదని డారన్ అసెమోగ్లు అన్నారు. అమెజాన్ ఆటోమేషన్ లక్ష్యాన్ని సాధిస్తే.. యునైటెడ్ స్టేట్స్ లోని అతిపెద్ద యజమానులలో ఒకరు ఉద్యోగ సృష్టికర్తగా కాకుండా ఉద్యోగ విధ్వంసకారిగా మారతారని ఆయన అన్నారు.
కాగా... ప్రోటియస్, సిక్వోయా వంటి అధునాతన రోబోటిక్స్ వ్యవస్థలు.. రద్దీగా ఉండే గిడ్డంగులను స్వయంప్రతిపత్తితో నావిగేట్ చేయగలవు. ఈ యంత్రాలు సెన్సార్లు, కెమెరాలు, ఏఐ అల్గారిథమ్ లతో అమర్చబడి ఉంటాయి. ఇవి మానవ పర్యవేక్షణ లేకుండా ప్యాకేజీలను తరలించడానికి, ఎత్తడానికి, సర్ధడానికి వీలు కల్పిస్తాయి.
ఇదే సమయంలో... సెల్ఫ్ డ్రైవింగ్ డెలివరీ వాహనాలు, డ్రోన్ షిప్పింగ్ ప్రోగ్రామ్ లతో సహా అమెజాన్ ఏఐ ఆధారిత లాజిస్టిక్స్, డెలివరీ కార్యకలాపాలను అన్వేషిస్తోందని చెబుతున్నారు. అవి రాబోయే దశాబ్దంలో వేల సాంప్రదాయ డెలివరీ ఉద్యోగాలకు అంతరాయం కలిగించవచ్చని చెబుతున్నారు. చాలా మంది కార్మికులకు ఈ వార్త ఒక హెచ్చరికలా అనిపిస్తుందని అంటున్నారు.
మరోవైపు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను అందిపుచ్చుకోవడంతోపాటు పాటు క్లౌడ్ కార్యకలాపాలకు అమెజాన్ ఇటీవల బిలియన్ డాలర్లు కుమ్మరిస్తుంది. ఈ క్రమంలో ఈ ఏడాది వర్కింగ్ క్యాపిటల్ పెట్టుబడుల్లో భాగంగా సుమారు 100 బిలియన్ డాలర్లకు పైగా ఖర్చు చేయాలని నిర్ణయించుకుంది. దానిలో ఎక్కువ భాగం నెక్స్ట్ జనరేషన్ డేటా సెంటర్ లను నిర్మించేందుకు కేటాయించింది.