అమరావతి వర్సెస్ మావిగాన్...అజెండా సెట్ అయినట్లే !
ప్రతీ ఎన్నికకూ ఒక అజెండా ఉంటుంది. అది జనంతో ముడి పడి ఉంటుంది. అలా ఉంటేనే రాజకీయం నిండుగా పండుతుంది.;
ప్రతీ ఎన్నికకూ ఒక అజెండా ఉంటుంది. అది జనంతో ముడి పడి ఉంటుంది. అలా ఉంటేనే రాజకీయం నిండుగా పండుతుంది. ఏపీలో 2014 లో జరిగిన ఎన్నికలు పూర్తిగా విభజన మీదనే సాగాయి. అడ్డగోలు విభజన కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది అంటూ దుమ్మెత్తిపోస్తూ చేసిన ఈ ప్రచారం ఆనాడు ఏపీలో జనాలకు బాగా ఎక్కింది అంతే కాదు ఏపీ పునర్ నిర్మాణం అంటూ మరో అడుగు ముందుకేసి టీడీపీ ఇచ్చిన హామీ బ్రహ్మాండంగా పనిచేసింది. అప్పటికే బీజేపీతో పొత్తులో ఉండడం కూడా టీడీపీ మీద నమ్మకాన్ని పెంచింది. అదే వైసీపీ కొత్త పార్టీ. దాని నాయకుడికి అనుభవం లేకపోవడం ఆయన ఏపీ పునర్ నిర్మాణం మీద హామీలు ఇచ్చినా బాబు ముందు బీజేపీ పొత్తు ముందు పనిచేయలేదనే చెప్పాలి. ఫలితం అందరికీ తెలిసిందే.
ప్రత్యేక హోదాతో :
ఇక 2019 ఎన్నికలు ప్రత్యేక హోదా మీదనే జరిగాయి. ఈ ఎన్నికల కోసమే రెండేళ్ళ ముందు నుంచే వైసీపీ హోదా మీద ఉద్యమాలు చేసింది. పాదయాత్రలోనూ జగన్ హోదా మీదనే మాట్లాడుతూ వచ్చారు. ఏపీకి హోదాని తెచ్చి తీరుతామని చెప్పారు దాంతో ఏపీ ఫ్యూచర్ బాగుంటుందని ఆశపడిన జనాలు వైసీపీకి మూకుమ్మడిగా ఓటెత్తారు. ఇక ఫలితం వైసీపీకి అనుకూలం అయింది. టీడీపీ కేవలం 23 సీట్లకు పరిమితం అయిపోయింది.
రాజధాని లేదంటూ :
ఇక 2024 ఎన్నికలకు వచ్చేసరికి ఏపీకి రాజధాని లేకుండా చేశారు అని టీడీపీ కూటమి జనంలోకి వెళ్ళి బలంగా చేసిన ప్రచారం ఒక ఎమోషన్ గా సెంటిమెంట్ గా మారింది. దానికి తోడు వైసీపీ ప్రభుత్వంలో మూడు రాజధానులను తెచ్చి దేనినీ చేయలేక చతికిల పడడం అలాగే అమరావతిని పూర్తిగా పక్కన పెట్టడంతో ఏపీలో అయిదు కోట్ల జనాలు అంతా రాజధాని ఉండాల్సిందే అని గట్టిగా తీర్మానించుకుని మరీ కూటమికి ఓటెత్తారు. అలా వైసీపీ చిత్తు అయిపోయింది. కేవలం 11 సీట్లకే పరిమితం అయిపోయింది.
మరోసారి అస్త్రాలతో :
ఇక 2029 ఎన్నికలకు ఏ అజెండా ఉంటుంది అన్నది అయితే వైసీపీకి ఇప్పటిదాకా ఇంకా క్లారిటీ అయితే లేదు, టీడీపీ కూటమి ప్రభుత్వం ఏ అంటే అమరావతి పీ అంటే పోలవరం అని జనాలకు చూపించి 2029 ఎన్నికల్లో గెలవాలని చూస్తూ ముందుకు సాగుతోంది. వైసీపీ సంక్షేమం విషయంలో తన మార్క్ ని చాటుకున్నా అభివృద్ధి విషయంలో అందునా రాజధాని విషయంలో ఏమి చెప్పాలన్నది అయితే ఎటూ తేలకుండా ఉంది. చూస్తూ చూస్తూ తాము సృష్టించిన మూడు రాజధానుల ప్రతిపాదనను కాదనలేదు, అమరావతికి జై కొట్టలేదు, దాంతో మావిగాన్ అని కొత్త ప్రతిపాదన జగన్ స్వయంగా చేశారు. అది కూడా కోస్తా గుండె కాయ లాంటి కృష్ణా గుంటూరు జిల్లాలను కలుపుతూ అభివృద్ధి కారిడార్ అని జగన్ కానీ వైసీపీ నేతలు కానీ ఇస్తున్న హైప్ ని చూస్తే కనుక 2029 కి ఆ పార్టీ అజెండా ఫిక్స్ అయినట్లే అంటున్నారు. అంతే కాదు జగన్ పాదయాత్రలో సైతం ఇదే విషయం మీద హైలెట్ చేస్తూ ముందుకు సాగుతారు అని అంటున్నారు.
సవాల్ గానే మరి :
ఇక టీడీపీ కూటమికి ఒక విధంగా రాజకీయంగా సవాల్ గానే ఈ విషయం ఉంటుంది అని చెప్పాలి. అమరావతికి చట్టబద్ధత తెచ్చారు జగన్ రాజధానిని కదపలేడు అని కూటమి నేతలు చెబుతున్నారు. కాబట్టి 2029 లోగా ఒక మంచి రూపునకు షేపునకు అమరావతిని తీసుకుని రావాల్సిన పెను సవాల్ కూటమి ప్రభుత్వం మీద ఉంది. అదే సమయంలో మావిగాన్ ప్రాంతాలుగా ఉన్న విజయవాడ గుంటూరు విషయంలో కీలకంగా వ్యవహరించాల్సి ఉంది. మూడేళ్ళలో ఆశించిన అభివృద్ధి అమరావతిలో చూపిస్తే కనుక కూటమికి 2029 లో ఎదురు ఉండదు, అలా కాకపోతే ఇబ్బంది అవుతుంది. అదే అమరావతి రాజధాని విషయంలో కూటమి ఏ పాటి సక్సెస్ సాధించినా జగన్ మావిగన్ బూమరాంగ్ అయి వైసీపీకే ఇబ్బంది అవుతుంది. మొత్తానికి మరో మారు జనంలో సెంటిమెంట్ రగిల్చేందుకు అటు కూటమి ఇటు వైసీపీ ఢీ కొడుతున్న నేపథ్యం అయితే కనిపిస్తోంది అని అంటున్నారు.