అమరావతి ఆహ్వానపత్రిక చూశారా? ఏయే విశేషాలు ఉన్నాయో తెలుసా?
రాజధాని అమరావతి పునఃనిర్మాణ పనులు ప్రారంభం సందర్భంగా ఏపీ ప్రభుత్వం అట్టహాసంగా ఏర్పాట్లు చేస్తోంది.;
రాజధాని అమరావతి పునఃనిర్మాణ పనులు ప్రారంభం సందర్భంగా ఏపీ ప్రభుత్వం అట్టహాసంగా ఏర్పాట్లు చేస్తోంది. పునఃనిర్మాణ పనులకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేయనుండటంతో ప్రత్యేక ఆహ్వాన పత్రికలు రూపొందించింది. చూడచక్కని డిజైన్లతో రూపొందించిన ఈ ఆహ్వాన పత్రికను అతిథులకు ప్రత్యేకంగా పంపుతున్నారు. ఏపీ జీఏడీ అధికారులు అమరావతి ఆహ్వానపత్రిక పంపిణీని పర్యవేక్షిస్తున్నారు.
ఏపీ కలల రాజధాని అమరావతి పునఃనిర్మాణానికి సంబంధించి రూపొందించిన ఆహ్వానపత్రిక ఆన్ లైన్ లో వైరల్ అవుతోంది. గత పదేళ్లుగా రాజధాని లేని రాష్ట్రంగా మిగిలిపోయిన ఏపీ దశ, దిశ తిరుగుతుందనేదానికి సంకేతంగా ఈ ఆహ్వాన పత్రికను డిజైన్ చేశారు. ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్లతోపాటు రాజధాని అమరావతి స్థూపం, అమరావతి నగర ఊహాచిత్రంతో ఆహ్వానపత్రిక తయారు చేశారు.
రాజధాని రైతులతోపాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వంలోని కీలక నాయకులు, ప్రజాప్రతినిధులు, ఎంపీలు, ఎమ్మెల్యేలకు ఈ ఆహ్వాన పత్రికలను పంపుతున్నారు. మే 2న ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా రాజధాని పునఃనిర్మాణ పనులు ప్రారంభమవుతున్న విషయం తెలిసిందే. సుమారు లక్ష కోట్ల రూపాయల నిధులతో వివిధ పనులకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేయనున్నారు.
ప్రధాని పర్యటనకు సమయం దగ్గరపడుతుండటంతో ఏపీ ప్రభుత్వం శరవేగంగా ఏర్పాట్లు చేస్తోంది. శంకుస్థాపన అనంతరం సుమారు 5 లక్షల మందితో సభ నిర్వహించాలని ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. మే 2న తిరువనంతపురం నుంచి మధ్యాహ్నం 12.40 గంటలకు బయలుదేరనున్న ప్రధాని మధ్యాహ్నం 2.50 గంటలకు విజయవాడలోని గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంటారు. అనంతరం అక్కడి నుంచి హెలికాఫ్టర్ లో అమరావతికి చేరుకుంటారు. మధ్యాహ్నం 3.30 నుంచి సాయంత్రం 4.45 వరకు వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు. మొత్తంగా ప్రధాని గంట 15 నిమిషాలు అమరావతిలో గడుపుతారు.