అమరావతిలో ఇల్లు కొంటారా? ఆ టైం వచ్చేసింది! మొదలైన ప్రైవేటు నిర్మాణాలు

ఏపీ కలల రాజధాని అమరావతి నిర్మాణ ప్రస్థానంలో సరికొత్త అధ్యాయం మొదలైంది. రాజధానిలో ప్రభుత్వ భవనాల నిర్మాణాలతోపాటు ప్రైవేటు ఇళ్ల నిర్మాణాలు మొదలయ్యాయి.

Update: 2026-06-21 11:30 GMT

ఏపీ కలల రాజధాని అమరావతి నిర్మాణ ప్రస్థానంలో సరికొత్త అధ్యాయం మొదలైంది. రాజధానిలో ప్రభుత్వ భవనాల నిర్మాణాలతోపాటు ప్రైవేటు ఇళ్ల నిర్మాణాలు మొదలయ్యాయి. దీంతో గత దశాబ్దకాలంగా రాజధానికి పట్టిన గ్రహణం వీడుతుందని వ్యాఖ్యానిస్తున్నారు. రాజధాని నిర్మాణం కోసం ల్యాండ్ పూలింగ్ స్కీమ్ కింద భూములు ఇచ్చిన రైతులకు ప్రభుత్వం కేటాయించిన ప్లాట్లలో, తొలిసారిగా ఒక రైతు సరికొత్త అపార్ట్‌మెంట్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. అమరావతి రాజధాని పరిధిలోని ఎల్‌పీఎస్ జోన్ 7లో ఈ తొలి ప్రైవేటు గృహ నిర్మాణ పనులు ప్రారంభం కావడం విశేషం. రాజధాని ప్రాంతంలో గృహ నిర్మాణ రంగానికి కొత్త ఊపునిచ్చేలా ఈ ప్రాజెక్టును జీ+5 అంతస్తుల విధానంలో నిర్మిస్తున్నారు. మొత్తం పది 3BHK ఫ్లాట్లతో అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటున్న ఈ భవనం, అమరావతి రియల్ ఎస్టేట్ రంగానికి ఒక రోల్ మోడల్‌గా నిలవబోతోందని వ్యాఖ్యానిస్తున్నారు.

ఈ అపార్ట్‌మెంట్ నిర్మాణంతో రాజధానిలో ప్రైవేటు ఇళ్లు, అపార్టుమెంట్ల నిర్మాణాలు జోరందుకునే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఇప్పటివరకు రాజధానిలో కేవలం ప్రభుత్వ భవనాలు మాత్రమే నిర్మితమవుతున్నాయి. ఫలితంగా రాజధాని ప్రాంతంలో ప్రభుత్వపరమైన అభివృద్ధి తప్ప, మరే పనులు జరగడం లేదని విపక్షాలు విమర్శలు గుప్పించేవి. నిజానికి రాజధానిలో ప్రైవేటు భవనాల నిర్మాణానికి రైతులు, భూ యజమానులు సిద్ధంగా ఉన్నప్పటికీ, ప్రభుత్వం సమీకరించిన భూములు అభివృద్ధి చేసి తిరిగి అప్పగించడంలో జాప్యం కారణంగా ఆలస్యమైందని అంటున్నారు. ఇప్పుడు ప్రభుత్వం రైతులకు రిటర్నబుల్ ప్లాట్లు కేటాయిస్తుండటంతో ఆ సమస్య క్రమంగా తొలగిపోతుందని చెబుతున్నారు.

2015లో నవ్యాంధ్ర రాజధాని నిర్మాణం కోసం దాదాపు 30 వేల ఎకరాల భూములను స్థానిక రైతులు స్వచ్ఛందంగా ప్రభుత్వానికి ల్యాండ్ పూలింగ్ పద్ధతిలో అందజేశారు. ఆ సమయంలో ప్రపంచస్థాయి నగరంగా అమరావతిని తీర్చిదిద్దుతామని, భూములిచ్చిన రైతులకు అభివృద్ధి చేసిన లేఅవుట్లలో వాణిజ్య, నివాస ప్లాట్లను రిటర్నబుల్ పద్ధతిలో కేటాయిస్తామని ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. ఈ క్రమంలోనే 2015 నుండి 2019 వరకు నాటి తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో తాత్కాలిక సచివాలయం, శాసనసభ, హైకోర్టు భవనాలు, సీడ్ యాక్సెస్ రోడ్డు వంటి మెరుగైన అంతర్గత రోడ్ల నిర్మాణాలు చకచకా సాగిపోయాయి.

అయితే 2019 అసెంబ్లీ ఎన్నికల అనంతరం రాష్ట్రంలో సంభవించిన రాజకీయ మార్పులు అమరావతి భవితవ్యాన్ని ఒక్కసారిగా ప్రశ్నార్థకం చేశాయి. ఆ ఎన్నికల్లో టీడీపీ ప్రభుత్వం ఓడిపోవడంతో రాజధాని పనులకు పూర్తిగా గ్రహణం పట్టింది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం అమరావతి నిర్మాణాన్ని పూర్తిగా అటకెక్కించి, మూడు రాజధానుల ప్రతిపాదనను తెరపైకి తీసుకువచ్చింది. ఈ నిర్ణయం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర వివాదాస్పదంగా మారడమే కాకుండా, రాజధాని ప్రాంతంలో దాదాపు ఐదేళ్లపాటు ఎలాంటి అభివృద్ధి పనులు జరగకుండా నిలిచిపోయేలా చేసింది. తమకు న్యాయం చేయాలంటూ రాజధాని రైతులు, మహిళలు సుదీర్ఘ కాలం పాటు చేసిన అమరావతి ఉద్యమం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

మళ్ళీ ఐదేళ్ల నిరీక్షణ తర్వాత, 2024 ఎన్నికల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో అమరావతి పనులు మళ్లీ పట్టాలెక్కాయి. ప్రభుత్వం ప్రాధాన్యతా క్రమంలో రాజధానిలోని జంగిల్ క్లియరెన్స్ పనులను పూర్తి చేసి, నిలిచిపోయిన అంతర్గత రోడ్ల నిర్మాణాన్ని వేగవంతం చేసింది. దీనితో పాటు రైతులకు ఇవ్వాల్సిన ప్రైవేటు ప్లాట్లను కూడా అధికారికంగా అప్పగించే ప్రక్రియ వేగం పుంజుకుంది. ప్రభుత్వ లేఅవుట్లలో మౌలిక వసతులు కల్పించడంతో ధైర్యం తెచ్చుకున్న ఒక రైతు, తన ప్లాట్‌లో ఈ అపార్ట్‌మెంట్ నిర్మాణాన్ని ప్రారంభించి చరిత్ర సృష్టించారు. అమరావతి భూముల్లో సాకారమవుతున్న తొలి ప్రైవేటు భవనంగా దీనిని పేర్కొంటున్నారు.

ఈ తొలి ప్రైవేటు అపార్ట్‌మెంట్ నిర్మాణం కేవలం ఒక భవనానికో లేదా ఒక రైతుకో పరిమితమైనది కాదని వ్యాఖ్యానిస్తున్నారు. ఇది అమరావతి ప్రాంతంలో సుదీర్ఘ కాలంగా వేధిస్తున్న ఇళ్ల కొరత సమస్యకు త్వరలోనే శాశ్వత పరిష్కారం లభిస్తుందనే ఆశలను చిగురింపజేస్తోందని అంటున్నారు. ప్రస్తుతం రాజధాని పరిధిలో సరైన వసతులు ఉన్న గృహ సముదాయాలు లేకపోవడం వల్ల వేలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు, సచివాలయ సిబ్బంది పక్కనే ఉన్న విజయవాడ, గుంటూరు నగరాల నుండి ప్రతిరోజూ రాకపోకలు సాగిస్తున్నారు. ఈ అప్ అండ్ డౌన్ సర్వీసుల వల్ల ఉద్యోగులపై తీవ్రమైన పనిభారం, ప్రయాణ అలసట పడుతోంది. రాబోయే రోజుల్లో అమరావతిలోనే ఇళ్ల లభ్యత పెరిగితే, ఉద్యోగులంతా ఇక్కడే స్థిరపడే అవకాశం ఉంటుంది. ఫలితంగా రాజధాని ప్రాంతంలో రాత్రి వేళల్లో కూడా జనాభా సంచారం పెరిగి, హోటళ్లు, రవాణా, వాణిజ్య సముదాయాల రూపంలో ఆర్థిక కార్యకలాపాలు మరింత జోరుగా సాగుతాయని విశ్లేషకులు భావిస్తున్నారు.

Tags:    

Similar News