రాజధాని రైతు గోడు వినిపిస్తోందా? భూదాతలపై సీఆర్డీఏ అంతులేని నిర్లక్ష్యం

తమది మంచి ప్రభుత్వంగా చెప్పుకుంటున్న కూటమి నేతలు రాజధాని అమరావతి రైతుల కష్టాలను తీర్చడంలో విఫలమవుతున్నారని విమర్శలు ఎదుర్కొంటున్నారు.;

Update: 2025-09-20 04:42 GMT

తమది మంచి ప్రభుత్వంగా చెప్పుకుంటున్న కూటమి నేతలు రాజధాని అమరావతి రైతుల కష్టాలను తీర్చడంలో విఫలమవుతున్నారని విమర్శలు ఎదుర్కొంటున్నారు. రాజధాని నిర్మాణం కోసం తమ సర్వస్వం త్యాగం చేసిన రైతుల విషయంలో ఐఏఎస్ అధికారులు తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. రైతుల విషయంలో ఉదారంగా వ్యవహరించాల్సి ఉండగా, కొందరు అధికారులు రైతులను అవమానించేలా ప్రవర్తిస్తున్నారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇదే సమయంలో అమరావతి విషయంలో తామే సుప్రీం అన్న భావనతో ఉన్న సీఆర్డీఏ అధికారులు కేంద్ర మంత్రి పెమ్మసాని, రాష్ట్రమంత్రి నారాయణ, మండలి మాజీ చైర్మన్, ప్రభుత్వ సలహాదారు షరీఫ్ మాటలను కూడా పట్టించుకోవడం లేదని అంటున్నారు.

రైతుల సహకారంతో 34 వేల ఎకరాలను సేకరించిన ప్రభుత్వం.. రెండో విడత సమీకరణకు కూడా సిద్దమవుతోంది. అయితే 8 ఏళ్ల క్రితం భూములిచ్చిన రైతులకే ఇంతవరకు న్యాయం చేయడం లేదన్న విమర్శలు.. రెండో విడత సమీకరణకు సవాల్ విసిరే పరిస్థితి తీసుకువస్తున్నట్లు చర్చ జరుగుతోంది. 2017లో రాజధాని నిర్మాణానికి ప్రభుత్వం భూమిని సమీకరించిన విషయం తెలిసిందే. అయితే రైతుల నుంచి తీసుకున్న భూమికి బదులుగా వారికి రిటర్నుబుల్ ప్లాట్స్, కమర్షియల్ ప్లాట్లు ఇస్తామని అప్పట్లో ఒప్పందం జరిగింది. ఈ అంగీకారం ప్రకారం రైతులకు భూములు కేటాయించినా, అక్కడక్కడ జరిగిన పొరపాట్లు కొంతమంది రైతులకు శాపంగా మారినట్లు చెబుతున్నారు.

రాజధాని పరిధిలో సీడ్ యాక్సెస్ రోడ్డు నిర్మాణంతోపాటు, ఈ-8, ఈ-7 రహదారుల నిర్మాణానికి భూమిని ఇచ్చిన రైతు ఆలూరి యుగంధర్ ను 8 ఏళ్లుగా సీఆర్డీఏ చుట్టూ తిప్పించుకోవడం రాజధాని రైతుల్లో హాట్ టాపిక్ గా మారింది. సుమారు 25 ఎకరాలను రాజధాని కోసం ధారాదత్తం చేసిన రైతును గౌరవించాల్సిన సీఆర్డీఏ అధికారులు తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. రైతు యుగంధర్ కు 8 ఏళ్ల క్రితమే రిటర్న్ బుల్ ప్లాట్స్ రిజిస్ట్రేషన్ చేశారు. కానీ, భూ సమీకరణకు అంగీకరించని రైతు భూమి ఆయనకు కేటాయించడంతో వివాదం మొదలైంది. ఈ విషయాన్ని ఆయన సీఆర్డీఏ అధికారులకు నివేదించినా ఎవరూ పట్టించుకోవడం లేదు.

రైతు భూములను వ్యాపార, వాణిజ్య సంస్థలకు కేటాయిస్తున్న ప్రభుత్వం.. రైతుకు ఇవ్వాల్సిన పెండింగ్ భూమిపై శ్రద్ధ వహించడం లేదని రైతు యుగంధర్ వ్యవహారంతో తెలుస్తోందని అంటున్నారు. రైతు ఆలూరి యుగంధర్ సమస్యపై మంత్రి నారాయణ, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వంటి వారికి అవగాహన ఉన్నా ఆయన పని కాకపోవడం ప్రభుత్వ పనితీరు ఎంతో ఘోరంగా ఉందన్న విషయాన్ని చాటుతోందని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సీఆర్డీఏ కమిషనర్ గట్టిగా ఓ గంట సమయం కేటాయిస్తే, రైతు యుగంధర్ పని పూర్తవుతుందని, కానీ, 8 ఏళ్లుగా కమిషనర్లు మారుతున్నారే కానీ, ఆయన పని మాత్రం పూర్తి కావడం లేదన్న ఆవేదన వ్యక్తమవుతోంది.

ఇలా రాజధానిలో దాదాపు 100 మంది రైతులు భూములు ఇచ్చి రిటర్న్ బుల్ ప్లాట్స్ కోసం సీఆర్డీఏ చుట్టూ తిరుగుతున్నారని అంటున్నారు. అన్నిస్థాయిల్లో రైతులు ప్రయత్నిస్తున్నా, సీఆర్డీఏ నిర్లక్ష్యం కారణంగా వారికి న్యాయం జరగడం లేదని చెబుతున్నారు. చివరికి ముఖ్యమంత్రి చంద్రబాబు జోక్యం చేసుకుంటే కానీ, పరిస్థితిలో మార్పు వచ్చే అవకాశం లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Tags:    

Similar News