రాజ‌ధానిని రాజ‌కీయం చేయ‌డ‌మేనా.. ష‌ర్మిల గారూ?!

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తిని ప్ర‌పంచ స్థాయి న‌గ‌రంగా తీర్చిదిద్దాల‌ని.. దీనిని ఒక సాధార‌ణ మునిసిప‌ల్ స్థాయికి ప‌రిమితం చేయ‌రాద‌ని సీఎం చంద్ర‌బాబు, కూట‌మి ప్ర‌భుత్వం నిర్ణ‌యించుకున్నాయి.;

Update: 2025-11-30 04:17 GMT

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తిని ప్ర‌పంచ స్థాయి న‌గ‌రంగా తీర్చిదిద్దాల‌ని.. దీనిని ఒక సాధార‌ణ మునిసిప‌ల్ స్థాయికి ప‌రిమితం చేయ‌రాద‌ని సీఎం చంద్ర‌బాబు, కూట‌మి ప్ర‌భుత్వం నిర్ణ‌యించుకున్నాయి. ఈ క్ర‌మంలో ఇప్ప‌టికే రైతుల నుంచి సేక‌రించిన 33 వేల ఎక‌రాల‌కు తోడు మ‌రో 46 వేల ఎక‌రాల‌ను సేక‌రించాల‌ని నిర్ణ‌యించారు. త‌ద్వారా భూమి పెరిగి.. పెట్టుబ‌డులు, కేంద్ర సంస్థ‌లు, స్థానిక‌, ఇత‌ర ప్రాంతాల వారికి నివాసాలు.. అదేస‌మ‌యంలో విమానాశ్ర‌యం స‌హా ఇతర నిర్మాణాల‌ను చేప‌ట్టాల‌ని ప్ర‌భుత్వం భావిస్తోంది. దీనికి సంబంధించి రాజ‌ధాని ప్రాంత అభివృద్ధి అథారిటీ(సీఆర్ డీఏ) ప‌క్కా ప్ర‌ణాళిక‌ను సిద్ధం చేసింది.

అయితే.. దీనిని త‌ప్పుబ‌డుతూ.. కాంగ్రెస్ పార్టీ ఏపీ చీఫ్ వైఎస్ ష‌ర్మిల తాజాగా మీడియా ముందుకు వ‌చ్చారు. సీఎం చంద్ర‌బా బుకు పలు ప్ర‌శ్న‌లు సంధించారు. వాస్త‌వానికి ఆమె అడ‌గాల‌ని అనుకుంటే.. సీఎం చంద్ర‌బాబును క‌లిసి విన‌తి ప‌త్రాన్ని ఇవ్వొచ్చు. లేదా సీఆర్ డీఏ అధికారుల‌ను క‌లిసి వివ‌రాలు కోరినా వారు చెబుతారు. కానీ, దీనికి భిన్నంగా రాజ‌ధానిపై రెండు గంట‌ల పాటు మీడియా ముందు వ్యాఖ్య‌లు చేయ‌డం.. రైతుల ప‌ట్ల తీవ్ర‌సానుభూతిని ప్ర‌ద‌ర్శించ‌డం వంటివి రాజ‌కీయంలో భాగ‌మేన‌న్న సందేహాలు వ్య‌క్తం చేస్తున్నారు ప‌రిశీల‌కులు.

రాజ‌ధానికి త‌మ మ‌ద్ద‌తు ఉంటుంద‌ని ష‌ర్మిల గ‌తంలో ప్ర‌క‌టించుకున్నారు. ఇక‌, ఆ పార్టీ అగ్ర‌నేత కూడా.. తాము కేంద్రంలో అధికారంలోకి వ‌స్తే.. రాజ‌ధాని అమ‌రావ‌తిని నిర్మించి తీరుతామ‌ని చెప్పారు. అయితే.. ఇప్పుడు ప్ర‌పంచ వ్యాప్తంగా అన్ని దేశాలు, రాష్ట్రాల్లోనూ రాజ‌ధానుల‌ను విస్త‌రిస్తున్నారు. ఒక‌ప్పుడు చిన్న‌విగా ఉన్న రాజ‌ధానుల‌ను ఇప్పుడు జ‌నాభా పెరుగుదుల ప్ర‌పంచ స్థాయి సౌక‌ర్యాలు, అవ‌స‌రాల‌ను దృష్టిలో పెట్టుకుని విస్త‌రిస్తున్నారు. దీనికి భారీ ఎత్తున ఖ‌ర్చు చేస్తున్న సంద‌ర్భాలు కూడా ఉన్నాయి. ఈ నేప‌థ్యంలో వ‌చ్చే 25 సంవ‌త్స‌రాల భ‌విష్య‌త్తును దృష్టిలో పెట్టుకుని చంద్ర‌బాబు ఇప్పుటి నుంచే రాజ‌ధాని విస్త‌ర‌ణ‌కు ప్రాధాన్యం ఇస్తున్నారు.

ఈ నేప‌థ్యంలోనే మ‌రో 46 వేల ఎక‌రాల సమీక‌ర‌ణ‌కు సిద్ధ‌మ‌య్యారు. ఈ విష‌యాన్ని రాజ‌కీయం చేయ‌డం ద్వారా రాజ‌ధానికి ప‌రోక్షంగా ష‌ర్మిల మేలు కంటే కీడు ఎక్కువ‌గాఉంటుంద‌ని ప‌రిశీల‌కులు చెబుతున్నారు. రైతుల‌ను రెచ్చ‌గొట్ట‌డం ఆమె సాధించేది ఏమీ ఉండ‌ద‌ని కూడా అంటున్నారు. తొలి విడ‌త‌లో రైతుల‌కు మేలు చేయ‌లేద‌ని.. ప్ర‌స్తుతం మ‌రోసారి భూములు తీసుకుంటున్నార‌ని ష‌ర్మిల అన్నారు. కానీ.. తొలి విడ‌త‌లో రైతుల‌కు మేలు చేసే స‌మ‌యానికి రాష్ట్రంలో ప్ర‌భుత్వం మారిన విష‌యం తెలిసిందే. దీంతో మొత్తానికే ఇది నిలిచిపోయింది. కాబ‌ట్టి.. ఇప్పుడు మ‌ళ్లీ మొద‌టి నుంచి రాజ‌ధాని నిర్మాణాన్ని చేప‌ట్టిన‌ట్టు అయింది. ఈ విష‌యాలు తెలిసి కూడా రాజ‌ధానిని రాజ‌కీయంగా వాడుకునేందుకు ష‌ర్మిల ప్ర‌య‌త్నిస్తున్నార‌న్న విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి.

Tags:    

Similar News