ఏడాదిలో రాజకీయ నిరుద్యోగం

ఏపీలో కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకుంది. ఐదేళ్ల వైసీపీ పాలనపై అలుపులేని పోరాటం చేసిన మూడు పార్టీల కూటమి సరిగ్గా ఏడాది క్రితం బంపర్ విక్టరీ సాధించింది.;

Update: 2025-06-12 17:30 GMT
ఏడాదిలో రాజకీయ నిరుద్యోగం

ఏపీలో కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకుంది. ఐదేళ్ల వైసీపీ పాలనపై అలుపులేని పోరాటం చేసిన మూడు పార్టీల కూటమి సరిగ్గా ఏడాది క్రితం బంపర్ విక్టరీ సాధించింది. ఎన్నికల్లో పోటీ చేసి గెలిచిన ఎమ్మెల్యేలు, ఎంపీలుగా అధికారం చలాయిస్తున్నారు. ఏడాదిగా రాజయోగంతో చాలా మంది హ్యాపీగా గడుపుతున్నారు. తమకు తిరుగులేదన్నట్లు వ్యవహరిస్తున్నారు. అయితే ఈ ఏడాదిలో తమకేం చేశారో చెప్పాలంటూ కూటమి కార్యకర్తలు నిలదీస్తున్నారు. ఎంపీలు, ఎమ్మెల్యేలుగా గెలిపిస్తే తమకు ఏ పదవులిచ్చారని ప్రశ్నిస్తున్నారు.

కూటమి పాలనలో ఎక్కువగా రాజకీయ నిరుద్యోగం కనిపిస్తోందని టాక్ వినిపిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ఘన విజయం సాధిస్తే, తమకు కనీస గుర్తింపు దక్కడం లేదని కార్యకర్తల్లో ఎక్కువ వ్యతిరేకత ఉందని అంటున్నారు. దీనికి కారణం నామినేటెడ్ పోస్టులను భర్తీ చేయకపోవడమే అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇదే సమయంలో కూటమిలోని ప్రధాన పార్టీ అయిన టీడీపీలో పలువురు సీనియర్లు కూడా పదవులు లేక ఖాళీగా గడపాల్సిరావడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారని అంటున్నారు.

తన నాలుగో విడత పాలన గతానికి భిన్నంగా ఉంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబు పలుమార్లు ప్రకటించినప్పటికీ, ఈ సారి కూడా పదవుల భర్తీలో నాన్చుడు ధోరణే అనుసరిస్తున్నారని సొంత పార్టీ నుంచే విమర్శలు ఎదుర్కొంటున్నారు. గత ఏడాది జూన్ లో అధికారం చేపట్టిన తర్వాత రకరకాల కారణాలతో పదవుల భర్తీని వాయిదా వేసుకుంటూ వచ్చారు. తొలిసారి సెప్టెంబరులో 20 మందితో నామినేటెడ్ పోస్టులు భర్తీ చేశారు. ఆ తర్వాత విడతల వారిగా దాదాపు 100 వరకు కార్పొరేషన్లకు చైర్మన్లను నియమించారు. ఈ కార్పొరేషన్లలో డైరెక్టర్లుగా నియోజకవర్గ స్థాయి నేతలను నియమించారు.

అయితే ఇంకా కొన్ని కార్పొరేషన్లకు చైర్మన్లను నియమించడంపై ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని టీడీపీ కేడర్ అసమ్మతితో రగిలిపోతోందని అంటున్నారు. అదేవిధంగా గ్రామ, మండల, జిల్లా స్థాయిల్లో కూడా 80 శాతం పదవులను పెండింగులో పెట్టడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. అధికారం వచ్చి ఏడాది అయినా, క్షేత్ర స్థాయిలో పదవులు లేక ప్రభుత్వ కార్యక్రమాల్లో భాగం కాలేకపోతున్నామని టీడీపీతోపాటు జనసేన, బీజేపీ కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ రాష్ట్రంలో దాదాపు 90 శాతం స్థానిక సంస్థలు అంటే జిల్లా, మండల పరిషత్, పంచాయతీలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పాలకవర్గాలు వైసీపీ అధీనంలోనే ఉన్నాయి. దీంతో కూటమి ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాల్లో ఇంకా వైసీపీ నేతలే కనిపిస్తున్నారని అసంతృప్తి చెందుతున్నారు. జిల్లా, మండలస్థాయి పదవులు భర్తీ చేస్తే ప్రభుత్వ కార్యక్రమాల్లో తాము కూడా భాగమవుతామని అంటున్నారు. దీంతో కూటమి పాలనలో రాజకీయ నిరుద్యోగం బాగా ఎక్కువైందని విమర్శలు వినిపిస్తున్నాయి.

Tags:    

Similar News