ప్రపంచంలోనే తొలి AI మంత్రి.. అల్బేనియాలో సంచలనం

అల్బేనియా తీసుకున్న విప్లవాత్మక నిర్ణయం ప్రపంచ రాజకీయాల్లోనే కాదు.. టెక్నాలజీ వినియోగంలోనూ కొత్త అధ్యాయాన్ని రాసింది.;

Update: 2025-09-14 07:16 GMT

అల్బేనియా తీసుకున్న విప్లవాత్మక నిర్ణయం ప్రపంచ రాజకీయాల్లోనే కాదు.. టెక్నాలజీ వినియోగంలోనూ కొత్త అధ్యాయాన్ని రాసింది. అవినీతి వ్యతిరేక పోరాటానికి ఆయుధంగా కృత్రిమ మేధస్సు (AI) ను ఉపయోగిస్తూ ఒక మంత్రిగా నియమించడం అనేది ఆధునిక చరిత్రలో మొదటిసారిగా చోటుచేసుకున్న పరిణామం.

ప్రపంచంలో తొలి AI మంత్రి "డియెల్లా"

అల్బేనియా ప్రభుత్వం, ప్రజా టెండర్లు, ప్రభుత్వ ప్రొక్యూర్‌మెంట్‌లలో జరుగుతున్న అవినీతిని అరికట్టడమే లక్ష్యంగా "డియెల్లా" అనే AI మంత్రిని ఏర్పాటు చేసింది. ఈ మంత్రికి శరీరం లేదా జాతి లేదు. కోడ్‌ల రూపంలో, డిజిటల్ వేదికపైనే ఇది పని చేస్తుంది. కానీ దీని బాధ్యత మాత్రం అత్యంత కీలకం వందల కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ ఒప్పందాలు, కాంట్రాక్టులు కేటాయింపులలో పారదర్శకతను తీసుకురావడం.

ప్రధాని ఎడి రామా మాటల్లో "మనుషులపై లంచాల ప్రభావం ఉంటుంది. కానీ AI మంత్రికి పక్షపాతం ఉండదు. ఇదే దీని అసలైన బలం."

అవినీతి కత్తిరించడానికి టెక్నాలజీ కత్తి

అల్బేనియా అవినీతి బారిన పడి, దీర్ఘకాలం రాజకీయ అస్థిరతను ఎదుర్కొంది. ముఖ్యంగా ప్రభుత్వ ఖర్చులు, కాంట్రాక్టుల చెల్లింపుల్లో లంచగొండితనం బహిర్గతమయ్యింది. ఈ దశలోనే ప్రజల నమ్మకం కోల్పోకుండా AI మంత్రిని ప్రవేశపెట్టడం రామా ప్రభుత్వానికి సాహసోపేతమైన ప్రయోగం. ఇప్పటికే డిజిటల్ సర్వీసెస్ పోర్టల్ ద్వారా పౌరుల అభ్యర్థనలను ప్రాసెస్ చేస్తూ దీని సామర్థ్యాన్ని చూపిస్తోంది.

మానవేతర మంత్రి.. రాజకీయాలకు కొత్త అర్థం

డియెల్లా ఇప్పుడు టెండర్లను పరిశీలించి, అర్హత కలిగిన సంస్థలకే కాంట్రాక్టులు ఇవ్వనుంది. అంతేకాకుండా ప్రపంచవ్యాప్తంగా ప్రతిభావంతులను నియమించుకునే అధికారం కూడా ఉంది. అంటే ఒక మానవ మంత్రి చేయగలిగిన పరిధికన్నా విస్తృతంగా ఈ AI మంత్రి పని చేసేలా ప్రణాళికలు ఉన్నాయి. ఇప్పటిదాకా AIని ఆరోగ్యం, గేమింగ్, ఆటోమేషన్ వంటి రంగాలలోనే ఉపయోగించారు. కానీ రాజకీయ స్థాయిలో మంత్రిగా నియమించడం అనేది టెక్నాలజీ చరిత్రలోనే ఒక కొత్త సృష్టి.

భవిష్యత్తు రాజకీయాల దిశ

ప్రధాని రామా చేసిన మరో ప్రకటన ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. “ఒక రోజు అల్బేనియాకు డిజిటల్ ప్రైమ్ మినిస్టర్ వస్తాడు”. ఇది కేవలం జోక్ మాత్రమే కాదని, భవిష్యత్తులో ఆ దిశగా అడుగులు పడతాయని ఆయన స్పష్టం చేశారు.

ప్రజలకు కావలసింది నమ్మకమైన, పారదర్శకమైన పాలన. దానిని ఎవరు అందిస్తారన్నది ముఖ్యం. అది మానవుడా, లేక యంత్రమా అన్నది అంత ముఖ్యమేమీ కాదని ఆయన అభిప్రాయం.

*ప్రపంచానికి కొత్త నిర్వచనం?

డియెల్లా సక్సెస్ అయితే ఇతర దేశాలు కూడా ఇదే దారిలో నడిచే అవకాశం ఉంది. ఇండియా వంటి పెద్ద దేశాల్లో ఐటి మంత్రివర్గంలో AI భాగస్వామ్యం దశలవారీగా పెరగవచ్చు. అయితే మరోవైపు “అవినీతిలో మునిగిపోయే మనుషులు చివరికి యంత్రాలనూ వక్రీకరించగలరా?” అనేది మిగిలిన అతిపెద్ద సవాల్.

మొత్తానికి అల్బేనియా వేసిన ఈ అడుగు ప్రపంచ రాజకీయాలకు కొత్త నిర్వచనంగా నిలవొచ్చు.

Tags:    

Similar News