బీజేపీ ఎఫెక్ట్: పళని స్వామికి ఎసరు!
బీజేపీ చేయి పడితే.. అయితే ముఖ్యమంత్రి అయినా అవుతారు. లేకపోతే ఎటూ కాకుండా అయినా పోతారన్న వాదన రాజకీయాల్లో ఉంది.
బీజేపీ చేయి పడితే.. అయితే ముఖ్యమంత్రి అయినా అవుతారు. లేకపోతే ఎటూ కాకుండా అయినా పోతారన్న వాదన రాజకీయాల్లో ఉంది. ఇప్పుడు తమిళనాడు రాజకీయాల్లో బీజేపీ ప్రభావం కూడా ఇలానే ఉంది. ఒకప్పుడు బీజేపీ మద్దతుతో ముఖ్యమంత్రి పీఠం దక్కించుకున్న అన్నాడీఎంకే కార్యదర్శి.. పళని స్వామి.. ఇప్పుడు అదే బీజేపీ ప్రభావంతో తన ఉనికిని కోల్పోయే పరిస్థితిని తెచ్చుకున్నారు.
తాజాగా అన్నాడీఎంకే రెండుగా చీలిపోయింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 47 స్థానాల్లో విజయం దక్కించుకుని మూడో స్థానానికి పరిమితమైన పార్టీలో.. పళనిపై ఆగ్రహ జ్వాలలు మిన్నంటాయి. అసలు ఈ దుస్థితికి కారణం.. ఆయనేనని సీనియర్ నాయకుడు షణ్ముగం వ్యాఖ్యానించారు. ఎన్నికలకు ముందు.. బీజేపీతో పొత్తు వద్దని తాము నెత్తీ నోరు కొట్టుకున్నామని.. టీవీకేతో చేతులు కలుపుదామని కూడా చెప్పామని కానీ.. తాను మునిగి.. తమను కూడా పళని స్వామి ముంచేశారని ఆయన ఆరోపిస్తున్నారు.
ఈ క్రమంలోనే 47 మంది ఎమ్మెల్యేలలో 30 మంది షణ్ముగం తన దారిలోకి తెచ్చుకున్నారు. ఆ వెంటనే తననే శాసన సభా పక్ష నాయకుడిగా గుర్తించాలని స్పీకర్‌కు లేఖ అందించారు. అంతేకాదు.. తాము అధికార టీవీకే పార్టీకి మద్దతు ఇస్తున్నామని.. పళని స్వామితో తమకు సంబంధం లేదని కూడా అసెంబ్లీ సాక్షిగా తేల్చేశారు. ఇక్కడితో కూడా ఆగకుండా.. తమదే అసలైన అన్నాడీఎంకే అని కూడా ప్రకటించుకో వడం గమనార్హం.
రీజన్ ఇదే..
జయలలిత హయాంలో ఆమె బీజేపీని ఎక్కువగా టార్గెట్ చేశారు. ముఖ్యంగా మోడీ ప్రధాని అయిన తర్వాత.. రాష్ట్రాల హక్కులను కాలరాస్తున్నారని.. రాష్ట్రాల సొమ్ములు దోచేస్తున్నారని. .కేంద్రం పై పెద్ద యుద్ధమే ప్రకటించారు. ఈ క్రమంలోనే ఆమెపై ఉన్న అవినీతి కేసులు పుంజుకుని జైలుకు వెళ్లారు. అనంతరం.. ఆమె మృతి చెందారు. దీంతో బీజేపీపై అన్నాడీఎంకేలో వ్యతిరేకత ఉంది.
కానీ, తన రాజకీయం కోసం పళని స్వామి అదే బీజేపీతో తొలినాళ్లలో తెరచాటున, తాజాగా బహిరంగంగా పొత్తు పెట్టుకున్నారు. ఈ ప్రభావంతోనే అధికారంలోకి వస్తుందని లేదా కనీసం రెండవ స్థానంలో అయినా ఉంటుందని భావించిన పార్టీ ఇప్పుడు మూడో స్థానానికి దిగిపోయింది. ఈ నేపథ్యంలో బీజేపీని వ్యతిరేకించే వర్గం కూటమికట్టి పార్టీని సొంతం చేసుకుంది.