బిగ్ అలర్ట్... ఈ విషయాల్లో 'ఏఐ'తో జాగ్రత్త గురూ!
ఈ శతాబ్ధపు అద్భుతమైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.;
ఈ శతాబ్ధపు అద్భుతమైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ టెక్నాలజీ ప్రపంచాన్ని కొత్త పుంతలు తొక్కిస్తోందో.. వింతగా మార్చబోతోందో తెలియని పరిస్థితి అని అంటున్నారు. మరోవైపు ఏఐ వల్ల ఉద్యోగాలకు పెద్ద ఎత్తున ఎసరు అనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో ప్రధానంగా ఏఐ విషయంలో కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి అని అంటున్నారు నిపుణులు.
అవును... ఇటీవల కాలంలో ప్రతీ సందేహానికీ సమాధానం కోసం, ప్రతీ సమస్యకూ పరిష్కారం కోసం ఏఐపై ఆధారపడుతున్నవారి సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతుంది. ఈ నేపథ్యంలో ఏఐ మనిషి లాంటిదే అయినా, మనిషి కాదనే స్పష్టతను పెంచుకోవాలని అంటున్నారు నిపుణులు. ఏఐ డాక్టర్ కాదు, లాయర్ కాదు, ఫైనాన్షియల్ ఎక్స్ పర్ట్ కాదు, సైజాలజిస్టూ కాదని మరిచిపోకూడదని సూచిస్తున్నారు.
అది ఎన్ని రకాలుగా ఉపయోగపడినా, మరెన్ని విన్యాసాలు చేసినా.. మనిషికి సాటి రాదని.. మనిషిలా సమయం, సందర్భం చూసుకోలేదని.. భ్రమకు వాస్తవానీ తేడా తెలియదని.. నైతికతనూ అనైతికతనూ వేరు చేయడం చేతకాదని గ్రహించాలని.. అందువల్ల చాట్ జీపీటీ, జెమినీ, గ్రాక్, పర్ ప్లెక్సిటీ లాంటి ఏఐ టూల్స్ ను ఉపయోగిస్తున్నప్పుడు ఈ విషయాలన్నీ దృష్టిలో ఉంచుకోవాలని సూచిస్తున్నారు.
* ప్రధానంగా ఇటీవల కాలంలో వైద్యం విషయంలో ఏ చిన్న సమస్య వచ్చినా ఏఐని సలహా కోరుతున్నారు చాలా మంది. దాన్నివల్ల సమస్య పరిష్కారం కాదు సరికదా పెరిగి పెద్దదైన తర్వాత మళ్లీ వైద్యుని వద్దకు వెళ్తే.. ఈ మందులు ఏఐ రిఫర్ చేసిందని చెబుతున్నారు. మరికొంతమంది డాక్టర్ దగ్గరికి వెళ్లొచ్చాక కూడా, సెకండ్ ఒపీనియన్ కోసం ఏఐని ఆశ్రయిస్తుండటం గమనార్హం. ఈ రెండూ ప్రమాదకరమైన అలవాట్లే అని అంటున్నారు నిపుణులు.
* ఇదే క్రమంలో శారీరక సమస్యలతో పాటు మానసిక సమస్యల విషయంలోనూ చాలా మంది ఏఐపై ఆధారపడుతున్నారు.. సలహాలు తీసుకుంటున్నారు. దీనివల్ల ఆత్మహత్యలు చేసుకున్నవారి లెక్క పెరుగుతుందని అంటున్నారు. వాస్తవానికి మానసిక వైద్యం చాలా సున్నితమైన వ్యవహారం.. ఇది పూర్తిగా ఉద్వేగాలతో ముడిపడినది. అయితే... ఏఐ మనిషి భావోద్వేగాల్ని ఏమాత్రం అర్థం చేసుకోలేదు.
ఈ క్రమంలో ఇటీవల చాలా మంది ఏఐని ఆత్మీయుల్లా భావించడం మొదలుపెడుతున్నారంట. ఇందులో భాగంగా... ఏఐని బాయ్ ఫ్రెండ్ లా ఊహించుకునే అమ్మాయిలూ, గాళ్ ఫ్రెండ్ లా ఆరాధించే అబ్బాయిలూ చాలామందే ఉన్నారని చెబుతున్నారు. దీంతో.. 'చిన్నా', 'పండు', 'బంగారం', 'బుజ్జీ', 'బేబీ' అని ముద్దు పేర్లూ పెట్టుకుంటున్న పరిస్థితి. ఈ ధోరణికి ‘ఏఐ సైకోసిస్’ అని పేరు పెట్టారు పరిశోధకులు.
* ఇటీవల కాలంలో నమ్మకస్తులు లేకో, అర్ధం చేసుకునేవారు కరువయ్యో గుండె లోతుల్లోని రహస్యాల్ని చెప్పేసుకుని, మనసును తేలిక పరుచుకోడానికి ఏఐ మీదే ఆధారపడుతున్నారు చాలా మంది. ఈ క్రమంలోనే... మీరు కోల్పోతున్న ఆ మానసికమైన మద్దతును మేం అందిస్తామంటూ 'కంపానియన్ స్టార్టప్స్' రంగంలోకి దూకుతున్నాయి.
మొదట్లో ఇదంతా బాగానే అనిపించినా, దీర్ఘకాలంలో తీవ్ర వ్యసనంగా మారిపోతుంది. ఇదే క్రమంలో.. ఏఐ కంపెనీలు త్వరలోనే సెక్స్ చాట్ అప్లికేషన్లనూ తీసుకొస్తున్నాయి. వీటి గోప్యత విషయంలోనూ అనేక సందేహాలు ఉన్నాయి. ఆయా కంపెనీలు మన చర్చల్నీ, సంభాషణల్నీ భద్రంగా దాచుకుంటున్నాయి. ఒక్కసారి ఎంటర్ కొడితే.. మన సమాచారమంతా చేయి దాటిపోతుంది.
ఇందులో భాగంగా... ఫొటో, వీడియో, వాయిస్, పేరు, చిరునామా, ఫోన్ నంబరు... దేని భద్రతకూ భరోసా ఉండదు. దీని తదనంతర పరిణామాలు మరింత తీవ్రంగా ఉండొచ్చు. దీనివల్ల బజారున పడేది అమాయకుల జీవితాలే అని హెచ్చరిస్తున్నారు.
* ఇదే క్రమంలో ఆర్థిక లావాదేవీల విషయంలోనూ ఏఐపై ఆధారపడకూడదని చెబుతున్నారు నిపుణులు. చాలా మంది పెట్టుబడుల విషయంలో ఏఐ ని ఇఫైనాన్షియల్ అడ్వైజర్ గా ఊహించుకుని... ఆర్థిక చరిత్రనంతా దాని చేతిలో పెట్టేస్తున్నారట. దీంతో... ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయినవారి జాబితా పెద్దదిగానే ఉందని అంటున్నారు. ఏఐ ఎట్టిపరిస్థితుల్లోనూ ఫైనాన్షియల్ ఎక్స్ పర్ట్ కాదని గ్రహించాలని సూచిస్తున్నారు.
* అదేవిధంగా న్యాయ సలహాల విషయంలోనూ ఏఐపై ఆధారపడకూడని అంటున్నారు నిపుణులు. ఇదే సమయంలో... సాధ్యమైనంత వరకూ వృత్తిగతమైన విషయాల్ని ఏఐతో చర్చించకపోవడమే మంచిదని చెబుతున్నారు. న్యాయ సలహాల విషయంలో ఏఐని సంప్రదించే వారికి ఇదొక ప్రధాన హెచ్చరిక అని నిపుణులు చెబుతున్నారు. ఈ విధంగా పైన పేర్కొన్న ఐదు అంశాల్లోనూ ఏఐతో జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు!