పులివెందుల రాజకీయాల్లో ట్విస్టుల మీద ట్విస్టులు.. వివేకా ఇంటికి ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి

అంటే జగన్ అడ్డాలో అడుగుపెట్టిన ఆదినారాయణరెడ్డి రాజకీయంగా వైఎస్ కుటుంబంపై పట్టు సాధించే ప్రయత్నం చేశారని అంటున్నారు.;

Update: 2025-08-08 14:34 GMT

మాజీ సీఎం జగన్ ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందుల నియోజకవర్గంలో రాజకీయాలు కీలక మలుపు తిరుగుతున్నాయి. పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నిక నేపథ్యంలో చోటుచేసుకుంటున్న ఈ పరిణామాలు ఆసక్తి రేపుతున్నాయి. కొద్దిరోజుల్లో ఎన్నిక జరుగుతుందనగా, ప్రస్తుతం పులివెందుల మండల పరిధిలో హైటెన్షన్ నెలకొంది. ఇలాంటి సమయంలో మాజీ సీఎం జగన్ బాబాయ్ వైఎస్ వివేకా ఇంటికి జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి వెళ్లారు. వివేకా హత్యకు ఆదినారాయణరెడ్డి కారణమంటూ కడప ఎంపీ అవినాశ్ రెడ్డి తనకు చెప్పాడని, ఆ మేరకు ఓ లేఖపై సంతకం చేయాలని తనను కోరగా తిరస్కరించినట్లు వైఎస్ సునీత గురువారం వెల్లడించారు. ఇది జరిగిన ఒక రోజు తర్వాత వివేకా ఇంటికి ఆదినారాయణరెడ్డి వెళ్లడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.

పులివెందులలో జగన్ ఇంటికి సమీపంలోనే వివేకా ఇల్లు ఉంటుంది. అంటే జగన్ అడ్డాలో అడుగుపెట్టిన ఆదినారాయణరెడ్డి రాజకీయంగా వైఎస్ కుటుంబంపై పట్టు సాధించే ప్రయత్నం చేశారని అంటున్నారు. ఆదినారాయణరెడ్డి ప్రమేయం ఉందని తనకు చెప్పగా, తాను తిరస్కరించినట్లు సునీత చెప్పడంతో వైఎస్ కుటుంబం ఉన్న వీధిలోకి ఆదినారాయణరెడ్డి అడుగుపెట్టే సౌలభ్యం కలిగిందని అంటున్నారు. అంతేకాకుండా వివేకా సతీమణి సుభద్రమ్మ, కుమార్తె సునీత, అల్లుడు రాజశేఖరరెడ్డితో ఆదినారాయణరెడ్డి సుదీర్ఘంగా చర్చించారు. పులివెందుల ఎన్నిక నేపథ్యంలో ఈ భేటీ తీవ్ర చర్చనీయాంశమైంది.

అయితే భేటీ అనంతరం తాను వివేకా ఇంటికి రావడానికి కారణాలను ఆదినారాయణరెడ్డి వివరించారు. గత ప్రభుత్వంలో తనను అంతం చేయాలని అప్పటి ప్రభుత్వ పెద్దలు పెద్ద కుట్ర చేశారని ఆరోపించారు. అంతేకాకుండా సంబంధం లేని కేసులో తనను ఇరికించే ప్రయత్నం చేశారని, అందుకే హత్య జరిగిన ప్రదేశానికి వచ్చానని తెలిపారు. వివేకా కుటుంబంతో భేటీ వెనుక ఎలాంటి రాజకీయం లేదన్న ఆదినారాయణ రెడ్డి.. కుట్రతోనే వివేకాను హత్య చేశారని ఆరోపించారు. వివేకా హత్య మాజీ సీఎం జగన్ కు తెలిసే జరిగిందని ఎమ్మెల్యే ఆరోపించారు. వివేకా జయంతి సందర్భంగా ఆ కుటుంబాన్ని పరామర్శించాలనే ఆలోచనతో వచ్చినట్లు చెప్పారు.

Tags:    

Similar News