సినిమా సీన్ కాదు ఎమ్మెల్యే ఆది స్కెచ్ అంతే!
తన నియోజకవర్గం పరిధిలోని అల్ట్రాటెక్ సిమెంట్ పరిశ్రమలకు అవసరమైన ఫ్లైయూష్.. సున్నపురాయి సరఫరా జరగకుండా ఎమ్మెల్యే ఆది మనుషులు అడ్డుకోవటం హాట్ టాపిక్ గా మారింది.;
తమకు నచ్చినట్లుగా మాత్రమే జరగాలే తప్పించి.. న్యాయం, ధర్మం లాంటి వాటిని పెద్దగా పట్టించుకోని ప్రజాప్రతినిధులు కొందరు ఉంటారు. ఆ కోవలోకే వస్తారు జమ్ములమడుగు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి. తనకు నచ్చిన కంపెనీల విషయంలో ఆయన వ్యవహరించే తీరు చూస్తే.. సినిమాల్లో మాత్రమే ఇలాంటి సీన్లు ఉంటాయన్న భావన కలుగుతుంది. కానీ..ఆదికి ఆగ్రహం వస్తే రీల్ సీన్లు రియల్ సీన్లుగా మారతాయన్న మాట వినిపిస్తోంది.
ఇంతకూ జరిగిందేమంటే.. తన నియోజకవర్గం పరిధిలోని అల్ట్రాటెక్ సిమెంట్ పరిశ్రమలకు అవసరమైన ఫ్లైయూష్.. సున్నపురాయి సరఫరా జరగకుండా ఎమ్మెల్యే ఆది మనుషులు అడ్డుకోవటం హాట్ టాపిక్ గా మారింది. అది కూడా.. ఒక గంటో.. రెండు గంటలో కాదు. ఏకంగా ఐదు రోజలుగా. ఎర్రగుంట్లలో ఉన్న రాయలసీమ థర్మర్ విద్యుత్కేంద్రం నుంచి ఫ్లైయాష్ రవాణా చేసే లారీలను ఆపేసిన ఎమ్మెల్యే ఆది.. ఫ్లైయాష్ రవాణా చేయొద్దంటూ లారీ యజమానులకు హుకుం జారీ చేసినట్లుగా చెబుతున్నారు. ఈ కారణంగా లారీలు నిలిచిపోయినట్లుగా తెలుస్తోంది.
సిమెంటు పరిశ్రమలకు సమీపంలో ఉన్న గనుల నుంచి సున్నపరాయిని సరఫరా చేస్తుంటారు. ఆ లారీల్నిసైతం ఎమ్మెల్యే ఆది మనుషులు అడ్డుకున్నారు. సిమెంట్ పరిశ్రమకు సున్నపరాయిని తీసుకెళ్లే దారిలో అడ్డంగా ఒక మినీ బస్సు.. దాని పక్కనే ఒక ఇన్నోవాలో తన మనుషుల్ని పెట్టి.. సిమెంట్ పరిశ్రమల్లోకి లారీలు వెళ్లకుండా అడ్డుకోవటంతో అల్ట్రాటెక్ పరిశ్రమలో ఇప్పటికే ఉన్న ముడిసరుకుతో ఉత్పత్తి జరిగింది. గురువారం నుంచి మెటీరియల్ కొరత కారణంగా ఉత్పత్తి నిలిచిపోతుందని చెబుతున్నారు.
ఇంతకూ ఎమ్మెల్యే ఆది ఎందుకిలా చేస్తున్నారు? ఎంత కూటమి ప్రభుత్వంలో భాగస్వామి పార్టీ అయితే మాత్రం ఇలా ఎలా చేస్తారన్న ప్రశ్నలకు పలు వాదనలు వినిపిస్తున్నాయి. ఎమ్మెల్యేగా గెలిచిన నాటినుంచి ఈ సిమెంట్ పరిశ్రమలకు సంబంధించిన కాంట్రాక్టులన్నీ తనకే ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నట్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఒక యూనిట్ లో సిమెంట్ ప్యాకింగ్.. ఒక బ్లాక్ నుంచి సున్నపరాయి రవాణా తదితర కాంట్రాక్టులు ఆయన మనుషులకే అప్పగించినట్లుగా చెబుతున్నారు.
అయితే.. ఇవి సరిపోవని.. మరో బ్లాక్ నుంచి సున్నపరాయి సరఫరా.. ఆర్టీపీపీ నుంచి ఫ్లైయాస్ సరఫరా తనకే ఇవ్వాలని ఒత్తిడి చేస్తున్నారని.. వీటితో పాటు క్రిష్ణపట్నం పోర్టు నుంచి ఈ పరిశ్రమకు వచ్చే బొగ్గు రవాణాతో పాటు.. నెల్లూరు జిల్లాలో ఉన్న థర్మల్ ప్లాంట్ నుంచి ప్లైయాష్ రవాణా.. రాజమహేంద్రవరం నుంచి జిప్సం తీసుకురావటం లాంటి అన్నీ కాంట్రాక్టుల్ని తమ వారికే కట్టబెట్టాలని ఒత్తిడి చేస్తున్నట్లు చెబుతున్నారు.
అయితే.. ఇలా అన్ని కాంట్రాక్టులూ ఇవ్వటం కుదరదని.. గతంలో ఒప్పందాలు చేసుకున్న వారు ఉంటారని.. వారందరిని తప్పించలేమని యాజమాన్యం చెబుతున్నా.. ఎమ్మెల్యే ఆది ఖాతరు చేయటం లేదంటున్నారు. ఈ పరిశ్రమలకు చెందిన ముడి సరుకు రవాణా కాకుండా ఆపేస్తే.. సంస్థ వారే దారికి వస్తారన్న ఉద్దేశంతో ఐదు రోజులుగా తన మనుషుల్ని రంగంలోకి దించిన లారీలు సంస్థకు వెళ్లకుండా అడ్డుకున్నట్లు చెబుతున్నారు.
ఈ నేపథ్యంలో ఈ వ్యవహారంపై ఆదినారాయణరెడ్డి తనదైన వాదనను వినిపిస్తున్నారు. సిమెంట్ అమ్మకాల్ని ప్రాంతాల వారీగా రేటు నిర్ణయించి దోచుకుంటోందని.. పరిశ్రమలోని ఉద్యోగులకు ప్రయోజనాలు కల్పించటం లేదని చెబుతున్నారు. అంతేకాదు.. కార్మికులు మరణిస్తే వారి కుటుంబాల్ని ఆదుకోవటం లేదని.. సీఎస్ఆర్ కింద నిధులు ఖర్చు చేయకుండా తప్పుడు లెక్కలు చూసించి మోసం చేస్తున్నట్లుగా చెబుతున్నారు. ప్రజలకు కాలుష్యాన్ని వెదజల్లుతూ నివారణ చర్యలు తీసుకోవటం లేదని చెబుతున్నారు.
ఈ వాదన విన్నప్పుడు అనిపించేది ఒక్కటే.. కంపెనీల కారణంగా నష్టం జరుగుతుంటే.. వాటిపై చట్టపరమైన చర్యలు తీసుకోవటం తప్పేం కాదు. అంతేకానీ.. తన మనుషుల్ని.. వాహనాల్ని రోడ్లకు అడ్డంగా పెట్టేసి.. ముడిసరుకు ఆపటంలో లాజిక్ ఏమిటన్నది అర్థం కాదు. ఇదిలా ఉంటే.. సిమెంట్ పరిశ్రమకు చెందిన ప్రతినిధులు తాజాగా జిల్లా కలెక్టర్ ను కలిసి ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన కలెక్టర్.. వెంటనే జిల్లా ఎస్పీతో మాట్లాడి.. పరిశ్రమల వద్దకు పోలీసు బలగాల్ని ఏర్పాటు చేయటంతో పాటు.. ఇలాంటి అరాచకాలకు పాల్పడే వారి పట్ల కఠినంగా ఉండాలని ఆదేశించారు. తాజా పరిణామాలతో ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి ప్రధాన అనుచరుడు జగదీశ్వర్ రెడ్డితో పాటు పలువురిపై కేసులు నమోదైన విషయాన్ని పోలీసులు వెల్లడించారు.