తోకచుక్కలు పడకుండా అప్పట్లో శాంతిహోమం.. ఆ తర్వాతేమైంది?
కొన్ని వందల ఏళ్ల నాటి పురాతన శిలాశాసనాలు.. రాగి రేకులపై ఉన్న సమాచారాన్ని అర్థం చేసుకునే అంశంలో తాజాగా పురావస్తు శాఖ అధికారులు ఆసక్తికర అంశాల్ని గుర్తించారు.;
కొన్ని వందల ఏళ్ల నాటి పురాతన శిలాశాసనాలు.. రాగి రేకులపై ఉన్న సమాచారాన్ని అర్థం చేసుకునే అంశంలో తాజాగా పురావస్తు శాఖ అధికారులు ఆసక్తికర అంశాల్ని గుర్తించారు. నాలుగేళ్ల క్రితం శ్రీశైలంలో రాగి శాసనాలు కొన్ని లభ్యమయ్యాయి. అందులోని అంశాలపై అధ్యయనాన్ని చేపట్టారు భారత పురావస్తు శాఖ శాసన అధ్యయన విభాగం. ఈ క్రమంలో 1456 కాలం నాటి శాసనాల్లో ఏయే అంశాల్ని పేర్కొన్నారన్న దానిపై పరిశోధన చేయగా.. అందులో తోకచుక్కలు.. ఉల్కాపాతానికి సంబంధించిన విశేషాలు వెలుగు చూశాయి.
ప్రతి 72 ఏళ్ల నుంచి 80 ఏళ్ల మధ్య భారీ సంఖ్యలో ప్రకాశవంతమైన తోకచుక్కలు పడుతుండేవని.. అలా పడిన ప్రాంతంలో విపత్తులు సంభవిస్తాయన్న నమ్మకం అప్పట్లో ఉండేది. ఇదిలా ఉండగా 1456వ సంవత్సరంలో విజయనగర రాజ్యంలో తోకచుక్కలు పడతాయన్న అంచనాలు వ్యక్తమయ్యాయి. దీంతో.. ప్రజల్లో భయాందోళనలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో స్పందించిన రాజు.. తోకచుక్కలు.. ఉల్కాపాతాలు తమ రాజ్యంలో పడకుండా ఉండేందుకు మల్లికార్జున శ్రీశైలంలో భారీ ఎత్తున శాంతిహోమాన్ని చేపట్టారు.
ఈ పూజలు ఫలించి.. విజయనగర సామ్రాజ్య పరిధిలో తోకచుక్కలు పడలేదన్న విషయాన్ని అప్పటి రాజు విశ్వసించారు. దీంతో.. శాంతి హోమం చేసిన లింగనార్య అనే బ్రాహ్మణుడికి సింగపుర అనే గ్రామాన్ని దానం చేసినట్లుగా తాజాగా వెలుగు చూసిన శానసనం స్పష్టం చేసింది. ఈ శాసనం పుణ్యమా అని కొన్ని వందల ఏళ్ల క్రితం ఉల్కాపాతం.. తోకచుక్కల వంటి అంశాలపై అప్పటి పాలకులకు ఎలాంటి అవగాహన ఉండన్న విషయం తాజా ఆవిష్కరణలో గుర్తించారని చెప్పాలి.