ఆఫీస్ టైంలో పడుకోనివ్వండి... సర్వే ఫలితాలు వైరల్!
ఈ సర్వేలో... ఆఫీస్ టైంలో కాసేపు నిద్రపోవడానికి అవకాశమిస్తే ప్రొడక్టివిటీ బాగా పెరుగుతుందని మెజార్టీ ఉద్యోగులు భావిస్తున్నారని తేలిందంట.
ఆఫీస్ టైం లో ప్రధానంగా లంచ్ బ్రేక్ అనంతరం కాస్త కునుకు తీయాలనే అభిప్రాయం చాలా మంది ఉద్యోగుల్లో కలుగుతుందనే చెప్పాలి! వేసవికాలం అయితే ఈ ప్రభావం కాస్త ఎక్కువగానే ఉంటుంది! ఈ సమయంలో కొంతమందికి కళ్లు తెరిచి నిద్రపోయే కళ వరంగా ఉండటం వారికి ఎంతో కలిసొస్తుంటుంది. మరికొంతమంది మాత్రం వెనక్కీ ముందుకీ ఊగుతూ దొరికిపోతుంటారు. అయితే ఈ ఆఫీస్ టైం లో నిద్రపై తాజాగా జరిపిన ఒక సర్వేలో కీలక విషయాలు వెల్లడయ్యాయి.
అవును... ఆఫీస్ టైం లో కాసేపు నిద్రపోవడానికి అవకాశం ఇస్తే ఎలా ఉంటుంది, దానివల్ల కలిగే ప్రయోజనం ఏమైనా ఉందా.. ఉంటే అది ఉద్యోగికా, సంస్థకా.. అంటూ మొదలైన విషయాలపై తాజాగా ఒకసర్వే జరిగిందట. ఈ సర్వేలో... ఆఫీస్ టైంలో కాసేపు నిద్రపోవడానికి అవకాశమిస్తే ప్రొడక్టివిటీ బాగా పెరుగుతుందని మెజార్టీ ఉద్యోగులు భావిస్తున్నారని తేలిందంట.
అయితే జపాన్ లో ఇప్పటికే ఈ సంప్రదాయం ఉంది. బాగా పని చేయడానికి, అలసట నుంచి కాస్త బయటపడటానికి అంటూ ఆఫీస్ అవర్స్ లో కొద్దిసేపు నిద్రపోవడం ముఖ్యమని తాజాగా జీనియస్ కన్సల్టెంట్ సర్వేలో ఉద్యోగులు అభిప్రాయపడ్డారు! ఆఫీస్ టైంలో కాసేపు కునుకు తీయడం ముఖ్యమని ఏకంగా 94 శాతం మంది అభిప్రాయపడగా... కేవలం మూడు శాతం మంది మాత్రమే ఈ అభిప్రాయానికి వ్యతిరేకంగా ఓటేశారని అంటున్నారు.
తాజాగా ఆన్ లైన్ లో జరిపిన ఈ సర్వేలో మొత్తం 1,207 మంది ఉద్యోగులు పాల్గొన్నారని.. జీనియస్ కన్సల్టెంట్ సంస్థ వెల్లడించింది. ఇందులో ప్రధానంగా... బ్యాంకింగ్, ఫైనాన్స్, ఇంజినీరింగ్, ఎడ్యుకేషన్, కన్ స్ట్రక్షన్, హాస్పిటాలిటీ, హెచ్.ఆర్. సొల్యూషన్స్, ఐటీ, బీపీఓ, లాజిస్టిక్స్, మాన్యుఫాక్చరింగ్, మీడియా, ఫార్మా, ఆయిల్ అండ్ గ్యాస్ కంపెనీల్లో పనిచేస్తున్న ఉద్యోగుల అభిప్రాయాలను సేకరించినట్లు తెలిపింది.
ఈ సర్వే రిపోర్ట్ ప్రకారం... రోజువారి పనిలో అలసట, ఆయాసం వంటివి ఎదుర్కొంటున్నామని 60 శాతం మంది చెప్పగా... 27 శాతం మంది మాత్రం తమకు అలసట అనేదే లేదని చెప్పుకొచ్చారంట. ఇదే సమయంలో... ఆఫీస్ అవర్స్ లో ఒక గంట పాటు పడుకోవడానికి సమయం ఇస్తే... అదనపు అవ ర్స్ లో పనిచేసేందుకు తమకు అంగీకారమేనని 49 శాతం మంది వెల్లడించారు.
కాగా.. జపాన్ లో ఎప్పటినుంచో పాటిస్తున్న "ఇనెమురి" (ఆఫీస్ టైంలో పడుకోవడం) విధానం మంచిదని.. దానివల్ల ఉద్యోగుల ఆరోగ్యం మెరుగవుతుందని 78 శాతం మంది పేర్కొన్నారు.