‘సాఫ్ట్ వేర్’ కల చెదురుతోంది..?

ఒకప్పుడు ఇంజనీరింగ్ సీటు వస్తే జీవితం స్థిరపడిపోయినట్టేనని చాలామంది నమ్మేవారు. మంచి కాలేజీలో సీటు వస్తే ఇక తిరుగులేదని భావించేవారు.;

Update: 2025-07-16 02:45 GMT

ఒకప్పుడు ఇంజనీరింగ్ సీటు వస్తే జీవితం స్థిరపడిపోయినట్టేనని చాలామంది నమ్మేవారు. మంచి కాలేజీలో సీటు వస్తే ఇక తిరుగులేదని భావించేవారు. కానీ కాలం మారింది. ఇప్పుడు ఐఐటీలు వంటి ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో చదివిన విద్యార్థులకు కూడా క్యాంపస్ ఇంటర్వ్యూల్లో ఉద్యోగాలు రావడం కష్టంగా మారింది. ఇక సాధారణ కాలేజీల పరిస్థితి చెప్పనక్కర్లేదు.

- ప్రాక్టికల్ స్కిల్స్ లోపం ప్రధాన కారణం

ఈ పరిస్థితికి ప్రధాన కారణం విద్యార్థులలో ప్రాక్టికల్ స్కిల్స్ లోపించడమే. కేవలం మార్కుల కోసం చదివి, సబ్జెక్టుపై లోతైన అవగాహన లేదా ఆసక్తి లేనివారు ఉద్యోగాల్లో అవసరమయ్యే నైపుణ్యాలను పెంపొందించుకోలేకపోతున్నారు. కోర్సు పూర్తయితే చాలు అనే ధోరణి మారాలి. ఉద్యోగం అనేది మెరుగైన నైపుణ్యం ఉన్నవారికే లభిస్తుంది. కేవలం సర్టిఫికేట్ ఉన్నవారికే కాదు.

- ఐటీ రంగంపై ఏఐ ప్రభావం

ఎంట్రీ-లెవల్ ఐటీ ఉద్యోగాలు వేగంగా కృత్రిమ మేధస్సు (AI) తో భర్తీ అవుతున్నాయి. గతంలో ముగ్గురు వ్యక్తులు చేయాల్సిన పనిని ఇప్పుడు ఒక వ్యక్తి AI సహాయంతో తక్కువ ఖర్చుతో పూర్తి చేయగలుగుతున్నారు. మధ్యస్థాయి, చిన్న కంపెనీలు ఈ మార్పును మరింత వేగంగా అమలు చేస్తూ ఉద్యోగ అవకాశాలపై మరింత ఒత్తిడిని పెంచుతున్నాయి.అమెరికాలో కంప్యూటర్ సైన్స్ గ్రాడ్యుయేట్లలో నిరుద్యోగ శాతం 7.5% ఉండటం ఆందోళన కలిగించే విషయం. యూకేలో ఒక్క ఇంటర్వ్యూ అవకాశం పొందడానికి 1000 అప్లికేషన్లు సమర్పించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

-ఇతర రంగాల్లో అవకాశాలు

ఐటీ రంగం మాత్రమే కాదు, అనేక ఫీల్డ్-బేస్డ్ రంగాలు ఇంకా AI ప్రభావానికి అతీతంగా ఉన్నాయి. ఉదాహరణకు చూస్తే.. నిర్మాణ రంగంలో సివిల్ ఇంజనీర్లు, ఆర్కిటెక్టులు, సైట్ సూపర్వైజర్లకు డిమాండ్ ఉంది. ఫ్యాక్టరీ పనుల్లో మెకానికల్, ఎలక్ట్రికల్ రంగాల్లో హ్యాండ్స్-ఆన్ (ప్రత్యక్ష) ఉద్యోగాలు ఉన్నాయి. ప్లంబింగ్, కార్పెంటరీ, ఎలక్ట్రీషియన్ వృత్తులకు మార్కెట్లో ఫుల్ డిమాండ్ ఉంది. ఇవన్నీ "డిగ్నిటీ ఆఫ్ లేబర్" ఉన్న ఉద్యోగాలు, వాటి అవసరం ఎప్పటికీ ఉంటుంది. వీటిలో ఆధునికతను జోడించి కొత్త మార్గాలను అన్వేషించాలి.

- AI తో పోటీకి కొత్త నైపుణ్యాలు అవసరం

AI వల్ల కొన్ని ఉద్యోగాలు కనుమరుగు అవుతున్నప్పటికీ, అనేక కొత్త ఉద్యోగాలు కూడా పుట్టుకొస్తున్నాయి. మెషీన్ లెర్నింగ్ ఇంజనీర్, AI ట్రైనర్, చాట్‌బాట్ టెస్టర్, డేటా లేబలర్, మోడల్ ఆడిటర్ లాంటివి కొత్తగా వచ్చాయి. ఈ కొత్త ఉద్యోగాలను పొందాలంటే కొత్త నైపుణ్యాలను నేర్చుకోవాలి. ప్రస్తుత విద్యా వ్యవస్థ ఈ దిశగా మారాలి. విద్యార్థులు కూడా మార్కులకు పరిమితం కాకుండా ప్రాక్టికల్ నాలెడ్జ్ , అప్లికేషన్-బేస్డ్ లెర్నింగ్ పై దృష్టి పెట్టాలి.

విద్యార్థులు కేవలం పుస్తకాలకే పరిమితం కాకుండా, ప్రాక్టికల్ స్కిల్స్ నేర్చుకోవాలి. ఇంటర్న్‌షిప్‌లు, ప్రాజెక్టులు, స్టార్టప్ మైండ్‌సెట్ ను మెరుగుపరచుకోవాలి. కళాశాలలు ఆధునిక టెక్నాలజీలపై ఆధారపడే కరిక్యులమ్ ను అమలులోకి తేవాలి. తల్లిదండ్రులు ఐటీ ఉద్యోగమే అన్న లక్ష్యాన్ని తొలగించి, పిల్లల ఆసక్తులకు తగ్గ దారిని ప్రోత్సహించాలి. ప్రభుత్వం స్కిల్ డెవలప్‌మెంట్ సంస్థలు, వృత్తి విద్యను ప్రోత్సహించాలి. యువత నూతన రంగాల్లో అవకాశాలు ఎక్కడున్నాయో తెలుసుకొని, ఆ దిశగా అడుగులు వేయాలి.

ఐటీ రంగం పూర్తిగా అంతరించిపోయినట్టేమీ కాదు. కానీ పాత విధానాలు మరిచిపోవాలి. కొత్త శిక్షణ, కొత్త అభిరుచులు, కొత్త పనితీరు అవసరం. "ఐటీ జాబ్ అంటే లైఫ్ సెటిల్" అన్న కాలం ముగిసింది. ఇప్పుడు ఎవరికైతే నైపుణ్యం, స్మార్ట్ వర్క్ ఉన్నాయో వారికే ముందుకు వెళ్లే అవకాశముంది. అందుకే యువతా, మార్పును అంగీకరించండి, కొత్త విషయాలు నేర్చుకోండి, ఆచరణలో పెట్టండి. ఈ మారిన యుగంలో మీ స్థానాన్ని మీరు ఖచ్చితంగా సంపాదించుకోగలరు.

Tags:    

Similar News